Veligonda Project: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో అసాధ్యమనుకున్న 30 ఏళ్ల వెలిగొండ ప్రాజెక్టు మొదటి దశను అధికారికంగా ప్రారంభించనున్నట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు. ఈ చారిత్రాత్మక ఘట్టానికి ముందు ప్రాజెక్టు నిర్మాణంలో తమ భూములను కోల్పోయిన వెలిగొండ నిర్వాసితులకు  ప్రభుత్వం 250 కోట్ల విలువైన పరిహారం చెక్కును అందేజేసింది. అమరావతిలో జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితులకు చెక్కులు పంపిణీ చేశారు. 

Continues below advertisement

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ... వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితులకు మేలు జరిగేలా ప్రభుత్వం నిరంతరం ప్రయత్నం చేస్తోందని భరోసా ఇచ్చారు. దశాబ్ధాలుగా నలుగుతున్న నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించాలనే సంకల్పంతోనే ఈ ప్రాజెక్టు పనులను పూర్తి చేశామని ఆయన స్పష్టం చేశారు. 

30 ఏళ్ల కల సాకారం 

వెలిగొండ ప్రాజెక్టు ఈ ప్రాంత రైతాంగం 30 ఏళ్లుగా కంటున్న సాగు, తాగునీటి కల. ఈ ప్రాజెక్టు  నేపథ్యాన్ని గుర్తు చేసుకుంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొన్ని కీలక విషయాలను పంచుకున్నారు. తాను సీఎంగా 1995లో ఆ ప్రాంతానికి వెళ్లినప్పుడు, అక్కడి రైతులు తమకు సాగునీరు, తాగునీరు ఇవ్వాలని కోరారని గుర్తు చేసుకున్నారు. ఆనాటి రైతుల ఆవేదనను చూసి, ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలని సంకల్పించి, 1996లో వెలిగొండ ప్రాజెక్టుకు శిలాఫలకం వేశామని పేర్కొన్నారు. 

Continues below advertisement

1996లో తానే శంకుస్థాపన చేసిన ప్రాజెక్టును తిరిగి 2026లో ప్రారంభించుకోవడం తన అదృష్టమని చంద్రబాబు కామెంట్ చేశారు. అసాధ్యమనుకున్న 30 ఏళ్ల  వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణాన్ని సుసాధ్యమని చేసి చూపించామని ఆయన ప్రకటించారు. నాడు ఎన్టీఆర్ వేసిన వివిధప్రాజెక్టుల ఫౌండేషన్లను పూర్తి చేసి ప్రారంభించటం తన అదృష్టంగా భావిస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు. 

రెండేళ్లలో 2,250 కోట్ల ఖర్చు 

వెలిగొండ ప్రాజెక్టును సకాలంలో పూర్తి చేయడానికి ప్రభుత్వం చూపిన చొరవ అసాధారణమైంది. ఈ ప్రాజెక్టును పూర్తి  చేసి ఇప్పుడు ప్రారంభించేలా గత రెండేళ్ల కాలంలోనే ప్రభుత్వం 2250 కోట్లు భారీ బడ్జెట్‌ను ఖర్చు చేసిందని ముఖ్యమంత్రి వెల్లడించారు. 2019లో తాము అధికారంలోకి వచ్చి ఉంటే ఈ ప్రాజెక్టు 2021లోనే పూర్తి చేసేవాళ్లమని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. 

గత పాలకులు చేసిన డ్రామాలతో ఈ ప్రాజెక్టు పనులు సాధ్యం కాలేదని చంద్రబాబు ఆరోపించారు. గత పాలకులు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ తీవ్ర నష్టం చేకూర్చారని ధ్వజమెత్తారు. అయినప్పటికీ, ఎట్టి పరిసస్థితుల్లోనూ ప్రాజెక్టు పూర్తి చేసి ప్రజలకు నీరు ఇవ్వాలని సంకల్పించుకున్నామని, అనుకున్న విధంగానే పనులను ముగించామని చంద్రబాబు విమర్శించారు. 

నీటి భద్రతకు కట్టుదిట్ట చర్యలు 

ఈ ఏడాది రాష్ట్రంలో నెలకొన్న ప్రతికూల వాతావరణ పరిస్థితులపై ముఖ్యమంత్రి మాట్లాడారు. ఈ ఏడాది ఎల్‌ నినో తీవ్ర ప్రభావం కారణంగా రాష్ట్రంలో దాదాపు 50 శాతం సాగర్ జలాశయాలకు కూడా నీళ్లు రాలేదని చెప్పారు. ఇలాంటి పరిస్థితులు ఎదురైనప్పటికీ, ప్రాజెక్టును పూర్తి చేసి నీరు ఇవ్వాలని ప్లాన్ చేసినట్టు వివరించారు. 

పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయడం ద్వారా కృష్ణ డెల్టాకు నీటి తరలించవచ్చని, అదే సమయంలో శ్రీశైలంలో నీటి పొదుపు చేసి ప్రకాశం, నెల్లూరు, కడప, రాయలసీమ ప్రాంతాలకు నీరు ఇవ్వొచ్చని ముఖ్యమంత్రి చెప్పారు. దీని  ద్వారా ఈ ప్రాంతాల నీటి అవసరాలు తీరుతాయని అన్నారు. 

ఐదు నదుల అనుసంధానానికి ప్లాన్ 

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర నీటి సమస్యలకే కాకుండా జాతీయ స్థాయిలో నీటి భద్రతను సాధించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక బృహత్తర ప్రతిపాదనను ముందుకు తెచ్చారు. ఇటీవల జరిగిన సదరన్ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో గంగా-గోదావరి- కావేరీ నదుల అనుసంధానించాలని తాను ప్రతిపాదించినట్టు ఆయన వెల్లడించారు. 

ఐదు నదులను అనుసంధానిస్తే నాలుగు రాష్ట్రాల్లో ఉన్న తీవ్రమైన నీటి సమస్యలు తీరిపోతాయని సీఎం అభిప్రాయపడ్డారు. ఈ అనుసంధాన ప్రక్రియ విజయవంతమైతే దేశానికి నీటి సమస్య పరిష్కారమై నీటి భద్రత వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. 

మార్కాపురంలో ప్రతి ఇంటికి తాగునీరు 

వెలిగొండ ప్రాజెక్టు సాకారం కావడంతోపాటు, ఆ ప్రాంత స్వతోముఖాభివృద్ధికి ప్రభుత్వం పలు నూతన కార్యక్రమాలను చేపడుతోంది. మార్కాపురం జిల్లా పరిధిలో జల్ జీవన్ మిషన్ ద్వారా ప్రతి ఇంటికీ కుళాయి నీరు ఇచ్చేందుకు పనులు వేగంగా జరుగుతున్నాయని ముఖ్యమంత్రి ప్రకటించారు. దీంతోపాటు సెప్టెంబర్‌లో హార్టికల్చర్‌ హబ్‌ ఏర్పాటుకు ఫౌండేషన్ వేయనున్నట్టు చంద్రబాబు వెల్లడించారు. ఈ హబ్‌ ద్వారా స్థానిక రైతులకు కొత్త అవకాశాలు లభిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.