YS Avinash Reddy: ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను గత ఏడేళ్లుగా  ఊపేస్తున్న మాజీ మంత్రి వైఎస్ వివేకాంద రెడ్డి హత్య కేసులో సరికొత్త సంచలనం చోటు చేసుకుంది. ఇన్నాళ్లూ కేవలం హత్యోదంతం, కుట్ర కోణాల చుట్టూ తిరిగిన దర్యాప్తులోకి ఇప్పుడు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టేట్ హఠాత్తుగా ప్రవేశించింది. ఈ  హత్య వెనుక భారీ ఎత్తున చేతులు మారినట్టు భావిస్తున్న రూ. 40 కోట్ల సుపారీ ఒప్పందాలపై నిశిత దృష్టి సారించింది. మనీలాండరింగ్‌ నిరోధక చట్టం సెక్షన్ల కింద కేసు నమోదు చేసింది. దర్యాప్తులో భాగంగానే శుక్రవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు హైదరాబాద్‌తోపాటు కడప జిల్లాలోని నిందితుల నివాసాల్లో మొత్తం  ఏడు చోట్ల ఏక కాలంలో సోదాలు నిర్వహించింది. 

Continues below advertisement

ఈ ఆకస్మిక తనిఖీల్లో కడప లోక్‌సభ సభ్యుడు అవినాష్ రెడ్డి నివాసం నుంచి లెక్కల్లో చూపని 24 లక్షల నగదు, రెండు బ్యాంకు లాకర్ల తాళాలను, కీలక డిజిటల్ పరికరాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వివేకా హత్య జరిగి ఏడేళ్లు గడుస్తున్నా కొలిక్కి రాని ఈ వివాదం, ఇప్పుడు ఈడీ ప్రవేశంతో ఏపీ రాజకీయాల్లో మరింత హీట్‌ను పెంచింది. ఒకవైపు ఈడీ దర్యాప్తు వేగవంతం చేయగా, మరోవైపు ఇది కూటమి ఆడుతున్న డైవర్షన్ డ్రామా అంటూ వైఎస్‌ఆర్ సీపీ మండిపడుతోంది. 

ఈడీ రాకకు కారణమైన మనీ ట్రయల్స్ 

వైఎస్‌ వివేకానంద రెడ్డి 2019 మార్చి 15 అర్ధరాత్రి వేళ పులివెందులలోని ఆయన నివాసంలోనే హత్యకు గురయ్యారు. ఈ కేసును సీబీఐ దర్యాప్తు చేస్తూ ఇప్పటి వరకు కోర్టులో మూడు ఛార్జిషీట్లను దాఖలు చేసింది. వైసీపీలో వైఎస్‌ వివేకానందరెడ్డి చేరడం వల్ల తమ రాజకీయ ఆధిపత్యానికి, ప్రాబల్యానికి అడ్డుకట్ట పడుతుందని ఆందోళన అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి వారి ముఖ్య అనుచరులు దేవి రెడ్డి శివశంకర్ రెడ్డిలలో ఉందని అందుకే వివేకను హత్య చేశారని సీబీఐ అభియోగపత్రాల్లో పేర్కొంది. 

Continues below advertisement

అందుకు సంబంధించిన ఆర్థిక లావాదేవీలై దర్యాప్తు చేసిన సీబీఐ, హత్య కోసం 40 కోట్ల సుపారీ ఒప్పందం జరిగిందని, అందులో భాగంగా నిందితుడైన షేక్ దస్తగిరికి అడ్వాన్స్‌ కింద కోటి రూపాయలు ఇచ్చారని గుర్తించింది. ఈ ఆర్థిక లావాదేవీలపైనే ఈడీ ఇప్పుడు మనీలాండరింగ్ కోణంలో దర్యాప్తు చేస్తోంది. ఈ కుట్ర జరిగిన కొద్ది రోజులకే సునీల్ యాదవ్ కోటి రూపాయల నగదును దస్తగిరికి అడ్వన్స్‌గా అందించాడు. ఇందులో నుంచి 25 లక్షలు అప్పుగా తీసుకున్నాడు సునీల్. మిగిలిన మొత్తాన్ని తన మిత్రుడు సయ్యద్ మున్నా వద్ద ఉంచాడు దస్తగిరి. ఇందులో సుమారు 46.70 లక్ష నగదును, లెక్కల్లో చూపని బంగారు ఆభరణాలను సీబీఐ గతంలోనే మున్నా, అతని తల్లి పేరిట ఉన్న లాకర్ల నుంచి స్వాధీనం చేసుకుంది. ఈ సీబీఐ అభియోగాలు ఆధారంగానే ఈడీ రంగంలోకి దిగి దర్యాప్తు చేస్తోంది. 

ఏక కాలంలో ఏడు చోట్ల ఆకస్మిక తనిఖీలు 

శుక్రవారం తెల్లవారుజాము నుంచే హైదరాబాద్ కడప పరిధిలోని కీలక నిందితుల ఇళ్లపై ఈడీ అధికారులు ఏక కాలంలో దాడి చేశారు. సుమారు 40 మందికి పైగా ఉన్న ఈడీ ప్రత్యేక అధికారులు వివిధ బృందాలుగా విడిపోయి ఏడు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు.

హైదరాబాద్‌లోని కోకాపేట గోల్డెన్ మైన్ రోడ్డులోని ఓపెన్ స్కైస్పేస్ అపార్ట్‌మెంట్‌లో ఉన్న కడప ఎంపీ అవినాష్ రెడ్డి ప్లాట్‌లో 8 గంటలపాటు సోదాలు చేశారు.  పులివెందులలోని అవినాష్ రెడ్డి స్వగృహంపై అధికారులు దాడి చేసి సమయానికి ఆయన అక్కడ లేరు. ఇల్లు తాళం వేసి ఉండటంతో ఎంపీ చిన్నాన్న వైఎస్ మనోహర్ రెడ్డిని పిలిపించి తాళాలు తెరిపించారు. దాదాపు ఆరున్నర గంటలపాటు తనిఖీలు చేశారు. ఇక్కడి నుంచే లెక్కో చూపని 24 లక్షల నగదు రెండు బ్యాంక్ లాకర్ల తాళాలు స్వాధీనం చేసుకున్నారు. 

ప్రస్తుతం జైల్లో ఉన్న దేవిరెడ్డి శివశంకర్ రెడ్డికి కి చెందిన ైదరాబాద్ మైహోమ్ అవతార్‌లోని అపార్ట్మెంట్‌్లో సోదాలు జరిపి డిజిటల్ ఆధారాలను సేకరించారు. శివశంకర్ రెడ్డి పులివెందుల నివాసంలోనూ అధికారులు సోదాలు చేసి దస్త్రాలు పరిశీలించారు. పులివెందుల మైత్రి లే అవుట్‌ లో ఉన్న సునీల్ యాదవ్ ఇళ్లలో ఉదయం ఆరు గంటల నుంచి 11 గంటల వరకు సోదాలు చేశారు. 1400 పేజీల కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది. తొండూరు మండలం టి. తుమ్మలపల్లెలోని ఎర్రగంగిరెడ్డి నివాసంలో సోదాలు నిర్వహించి కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారని సమాచారం. 

ఇది కూటమి ప్రభుత్వం డైవర్షన్ డ్రామా: వైసీపీ 

ఈ డీ సోదాలపై వైసీపీ మండిపడింది. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న ఘోరమైన వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు ఈడీ సోదాల డ్రామా ఆడుతున్నారని ఆ పార్టీ నేత గడికోట శ్రీకాంత్ రెడ్డి ఆరోపించారు. " రాష్ట్రంలో ఇన్ని సమస్యలు ఉండటంతో ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేక వ్యక్తమవుతోంది. ప్రభుత్వంపై వస్తున్న ఈ విమర్శల నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికి హఠాత్తుగా ఎప్పుడో ఆరేళ్ల క్రితం జరిగిన కేసును పట్టుకొని ఈడీ సోదాలు అంటూ ప్రచారం చేస్తున్నారు. ఇది పూర్తిగా కూటమి ప్రభుత్వం వారి డైవర్షన్ డ్రామానే" అని శ్రీకాకంత్ రెడ్డి ఆరోపించారు. 

అసుల ఈ కేసు దర్యాప్తును చంద్రబాబే అడ్డుకుంటున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. " వివేకా హత్య జరిగినప్పుడు రాష్ట్రంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నారు. అప్పట్లోనే సిట్ విచారణ జరిగింది. ఆ తర్వాత సీబీఐ విచారణ కూడా జరిగింది. ఇప్పుడు కేసు కోర్టుల పరిధిలో ఉంది. ట్రయల్ జరగనీయకుండాఎందుకు అడ్డుకుంటున్నారు. వివేకాను చంపిన గొడ్డలి ఎవరిదో తేల్చేందుకు ఎందుకు భయపడుతున్నారు. విచిత్రమేంటంటే చంద్రబాబుకు సంబంధించిన అనేక కీలక కేసుల్లో వాదిస్తున్న అడ్వకేట్ లూథ్రా నే ఈ కేసులో నిందితుల తరఫున వాదిస్తున్నారు. ఈ సంబంధాలపై ప్రభుత్వం సమాధానం చెప్పాలి. ప్రజల పన్నుల డబ్బు కోట్ల రూపాయలను ఫీజులుగా చెల్లిస్తూ కేసు విచారణ ఎందుకు ఆలస్యం చేస్తున్నారు. " అని మండిపడ్డారు.