వీరసింహారెడ్డి సక్సెస్ మీట్ లో అక్కినేని తొక్కినేని అంటూ బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారాయి. బాలయ్య వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు అభిమానులు. రాష్ట్రవ్యాప్తంగా ఈరోజు అక్కినేని అభిమానులు నిరసన ప్రదర్శనలు చేపట్టారు. సినీ ఇండస్ట్రీలో అక్కినేని కుటుంబం వివాదాలకు దూరంగా ఉంటుందని, తమ హీరోలను, వారి కుటుంబాన్ని అవమానిస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. క్షమాపణ చెప్పకుండా బాలయ్య బయటకు వస్తే తెలుగు రాష్ట్రాల్లో ఆయన ఎక్కడ తిరిగినా అడుగడుగునా నిలదీస్తామన్నారు అభిమానులు. 


సినీ ఇండస్ట్రీలో ఎలాంటి వివాదాల జోలికి వెళ్లని కుటుంబం అక్కినేని కుటుంబం అని అన్నారు అభిమానులు. అలాంటి కుటుంబాన్ని బాలకృష్ణ కించపరిచేలా మాట్లాడితే కనీసం ఇండస్ట్రీలోని పెద్దలు కూడా స్పందించకపోవడం క్షమించరాని నేరం అని విమర్శించారు. నోటిదూల బాలయ్య క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేశారు. టికెట్ రేట్లు పెంచాలని ఏపీ సీఎం చుట్టూ తిరిగే పెద్దలు, ఇప్పుడు ఓ పెద్ద కుటుంబాన్ని బాలయ్య అవమానకరంగా మాట్లాడితే ఎందుకు నోరు మెదపట్లేదని నిలదీశారు. బాలయ్యకు వ్యతిరేకంగా రాసి ఉంచిన ఫ్లెక్సీతో నెల్లురూ నర్తకీ సెంటర్లో నిరసన చేపట్టారు. బాలయ్య ఫ్లెక్సీ దహనం చేశారు. సినీ ఇండస్ట్రీలో పెద్దలు చొరవ తీసుకుని బాలయ్యతో క్షమాపణ చెప్పించాలని డిమాండ్ చేశారు. 


వీరసింహారెడ్డి సినిమా సక్సెస్ మీట్లో ఓ నటుడి గురించి మాట్లాడుతూ బాలకృష్ణ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆ నటుడు సెట్ లో ఉన్నప్పుడు ఎన్టీఆర్, రంగారావు, అక్కినేని, తొక్కినేని.. ఇలా చాలా విషయాలు మాట్లాడుకుంటామన్నారు. అయితే ఆయన ఫ్లోలో తొక్కినేని అనడం వివాదాస్పదం అయింది. దాన్ని సోషల్ మీడియాలో తెగ ట్రోల్ చేశారు. తొక్కినేని అంటూ బాలకృష్ణ నోరుజారిన విషయం రెండు రోజుల తర్వాత బాగా వైరల్ అయింది. దీనిపై అక్కినేని కుటుంబం నుంచి కూడా వెంటనే రియాక్షన్ వచ్చింది. నాగచైతన్య, అఖిల్ సోషల్ మీడియాలో ప్రకటనలు విడుదల చేశారు. 


ఈ వ్యవహారం మూడు రోజులుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. దీనిపై అక్కినేని అభిమాన సంఘాలు తీవ్రంగా స్పందిస్తున్నాయి. వెంటనే బాలకృష్ణ క్షమాపణ చెప్పాలని అభిమానులు డిమాండ్ చేస్తున్నారు. క్షమాపణ చెప్పకపోతే బాలయ్యను ఎక్కడా తిరగనివ్వబోమంటున్నారు. ఊహించని ఈ వ్యవహారంతో అటు బాలయ్య కూడా ఆలోచనలో పడినట్టు తెలుస్తోంది. అయితే ఆయన నుంచి అధికారికంగా ఎలాంటి ప్రకటనా విడుదల కాలేదు. 


ఆమధ్య దైవ బ్రాహ్మణుల గురించి కూడా బాలకృష్ణ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అయితే వెంటనే ఆయన సర్దుకున్నారు. క్షమాపణలు చెప్పారు. దాంతో ఆ వివాదం సద్దుమణిగింది. ఇప్పుడు మరోసారి ఆయన నోరుజారి చేసిన వ్యాఖ్యలు సినీ ఇండస్ట్రీలో సంచలనంగా మారాయి. బాలకృష్ణ వ్యాఖ్యలను ఎవరూ సమర్థించలేదు. అలాగని ఆయన వ్యాఖ్యల్ని ఖండిస్తూ ఇతర నటీనటులెవరూ ప్రకటనలు కూడా విడుదల చేయలేదు. ఈ వివాదంలో వేలు పెట్టడం ఎందుకని సైలెంట్ అయిపోయారు. కానీ అభిమానులు మాత్రం.. మిగతా నటీనటులు దీనిపై ఎందుకు స్పందించలేదు అని నిలదీస్తున్నారు. అక్కినేని కుటుంబం వివాదాలకు దూరంగా ఉంటుందని. కానీ వారిని ఎందుకు వివాదాల్లోకి లాగుతున్నారని ప్రశ్నిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న ఆందోళనలపై బాలకృష్ణ ఎలా స్పందిస్తారో చూడాలి.