నెల్లూరు జిల్లా రాపూరు గురుకుల పాఠశాలలోని ముగ్గురు బాలికల మిస్సింగ్ కేసు రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ కేసుని గంటల వ్యవధిలోనే పోలీసులు ఛేదించారు. సంక్రాంతి సెలవుల నుంచి పాఠశాలకు వచ్చిన ఆ ముగ్గురు బాలికలు.. ఇంటిపై బెంగతో హాస్టల్ నుంచి బయటకు వచ్చేశారు. అప్పటికే చీకటి పడటం, ఇంటికి తిరిగి వెళ్తే తల్లిదండ్రులు మందలిస్తారన్న కారణంతో వారు వెంకటగిరిలో ఉండిపోయారు. ఆ ముగ్గురు 10వతరగతి చదువుతున్నారు. అయితే రాత్రికి పిల్లలు హాస్టల్ కి రాలేదని గ్రహించిన తల్లిదండ్రలు, హాస్టల్ సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీసీ కెమెరాల ఫుటేజీ సాయంతో ఆ పిల్లలను ట్రేస్ చేశారు. ఆ ముగ్గురు వెంకటగిరిలోని టీచర్స్ కాలనీలో ఉన్నట్టు గుర్తించారు. వారికి పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చి తల్లిదండ్రులకు అప్పగించారు. 


రాపూరు హాస్టల్ లో టెన్త్ క్లాస్ అమ్మాయిలు మిస్సింగ్ అనే వార్త బయటకు రాగానే మిగతా పిల్లల తల్లిదండ్రుల్లో కూడా ఆందోళన మొదలైంది. అసలు హాస్టల్ లో పిల్లలు ఏం చేస్తున్నారు, ఎందుకు బయటకు వెళ్లిపోయారు, హాస్టల్ లో ఏం జరుగుతోందంటూ ఆరా తీశారు. చివరకు వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. హాస్టల్ సిబ్బంది కూడా పోలీసులను ఆశ్రయించారు. దీంతో పోలీసులు ఈ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకున్నారు. రాపూరు పోలీసులు, వెంకటగిరి పోలీసుల సహకారంతో సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. 


వెంకటగిరిలో అమ్మాయిలు ఉన్నట్టు గుర్తించారు. వెంకటగిరి బస్టాండ్ లోని సీసీ కెమెరాల్లో ఆ ముగ్గురు అమ్మాయిల దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. దీంతో పోలీసులు ఆ చుట్టుపక్కల గాలించడం మొదలు పెట్టారు. వాస్తవానికి ముగ్గురు అమ్మాయిలు సంక్రాంతి సెలవల తర్వాత అదేరోజు హాస్టల్ కి వచ్చారు. తల్లిదండ్రులతో కలసి వారు హాస్టల్ కి వచ్చారు. అయితే హోమ్ సిక్ తో వారికి హాస్టల్ లో ఉండటం ఇష్టం లేదు. వెంటనే ఇంటికి వెళ్లాలనుకున్నారు. హాస్టల్ నుంచి తప్పించుకుని బయటకు వచ్చేశారు. అయితే ఇంటికి వెళ్దామనుకునే క్రమంలో వారు కొంతసేపు వెంకటగిరిలోనే ఉండిపోయారు. ఓవైపు చీకటిపడిపోతుండే సరికి వారికి ఇంటికి వెళ్లేందుకు ధైర్యం సరిపోలేదు. రాత్రివేళ ఇంటికి వస్తే తల్లిదండ్రులు మందలిస్తారేమోననే భయంతో వారు వెంకటగిరిలోనే ఉండిపోయారు. టీచర్స్ కాలనీ ప్రాంతంలో ఉన్న వారిని పోలీసులు ట్రేస్ చేశారు. 


అమ్మాయిలు మిస్సింగ్ అనే వార్త బయటకు రావడం, గతంలో కూడా అదే హాస్టల్ నుంచి అమ్మాయిలు వెళ్లిపోయారని తేలడంతో పోలీసులు ఈ కేసుని సీరియస్ గా తీసుకున్నారు. వెంటనే మూడు టీముల్ని రంగంలోకి దింపారు. మరోవైపు అమ్మాయిల ఆచూకీ దొరికినా, వారు మైనర్లు కావడంతో వారి వివరాలు జాగ్రత్తగా ఉండాల్సిన బాధ్యత కూడా పోలీసులపైనే ఉంది. దీంతో వారు రహస్యంగా ఈ సెర్చింగ్ ఆపరేషన్ మొదలు పెట్టారు. అమ్మాయిలు దొరకగానే ముందు పోలీస్ స్టేషన్ కి తరలించి వారికి కౌన్సెలింగ్ ఇచ్చారు. తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చి, పిల్లలు క్షణికావేశంలో అఘాయిత్యం చేసుకోకుండా చూడాలన్నారు. వారికి చదువు విలువ తెలియజెప్పి ఇంటికి పంపించారు.