Ysrcp Vs Tdp : ఎన్టీఆర్ కుమార్తె ఉమామహేశ్వరి మృతి విషయంలో టీడీపీ, వైసీపీ మధ్య సోషల్ మీడియా వార్ నడుస్తోంది. వైఎస్ వివేకా హత్య విషయంలో ఇప్పటికీ టీడీపీ ట్విట్టర్ హ్యాండిల్స్ నుంచి హూ కిల్డ్ బాబాయ్ అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతూనే ఉంది. దీనికి పోటీగా ఉమామహేశ్వరి విషయంలో వైసీపీ నేతలు కూడా కొన్ని పోస్టింగ్ లు పెట్టారు. విజయసాయిరెడ్డి కూడా తన పర్సనల్ అకౌంట్ నుంచి ట్వీట్స్ చేయడం విశేషం. ఎన్టీఆర్ భార్య లక్ష్మీపార్వతి కూడా ఈ విషయంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అయితే వైసీపీ సోషల్ మీడియా కన్వీనర్ గుర్రంపాటి దేవేందర్ రెడ్డి విషయంలో టీడీపీ సీరియస్ గా రియాక్ట్ అయింది. ఆయన సోషల్ మీడియాలో పెట్టిన పోస్టింగ్ లపై టీడీపీ నేతలు ఫైర్ అవుతున్నారు. నెల్లూరు జిల్లా కావలిలో గుర్రంపాటి దేవేందర్ రెడ్డిపై పోలీసులకు టీడీపీ మహిళా విభాగం నేతలు ఫిర్యాదు చేశారు. గుంటుపల్లి శ్రీదేవి చౌదరి ఆధ్వర్యంలో మహిళా విభాగం నేతలు.. కావలి వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. 



లోకేశ్ పై అనుచిత వ్యాఖ్యలు


టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్, ఆయన కుటుంబ సభ్యులపై  నిరాధార ఆరోపణ చేస్తూ సోషల్ మీడియాలో తప్పుదారి పట్టించే సమాచారాన్ని పోస్ట్ చేసి నందమూరి కుటుంబ సభ్యుల మనోభావాలు దెబ్బతీస్తున్నారంటూ మండిపడ్డారు టీడీపీ మహిళా విభాగం నేతలు. టీడీపీ నేతల భావోద్వేగాలు దెబ్బతీస్తున్నారని అన్నారు. వైసీపీ సోషల్ మీడియా కన్వీనర్ గుర్రంపాటి దేవేందర్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ కావలి వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు. నారా లోకేశ్ కి రాష్ట్రంలో పెరుగుతున్న ఆదరణను చూసి వైసీపీ నాయకులు, ఆయన ప్రతిష్ట దిగజార్చడానికి అనేక కుట్రలు  చేస్తున్నారని ఆరోపించారు.


ఆయనకు సంబంధం ఏంటి?


ఉమామహేశ్వరి మృతికి లోకేశ్ కారణం అంటూ ఇటీవల వైసీపీ సోషల్ మీడియా విభాగం ప్రచారం చేసిందని అంటున్నారు టీడీపీ నేతలు. ఉమామహేశ్వరికి జూబ్లీహిల్స్ లో భూమి ఉందని, ఆ భూమి తనకు ఇవ్వాలని లోకేశ్ ఒత్తిడి చేశారని, అందుకే ఉమామహేశ్వరి ఆత్మహత్య చేసుకుందని సోషల్ మీడియాలో ప్రచారం చేశారని అంటున్నారు. ఇది పూర్తిగా నిరాధారమైన ఆరోపణ అని, బూటకపు ప్రచారం అని, సీఎం జగన్ ఆదేశాలతోనే వైసీపీ నాయకులు ఇలాంటి ప్రచారం మొదలు పెట్టారని ఆరోపించారు. లోకేశ్ ను నేరుగా ఎదుర్కోలేక వైసీపీ ఇలాంటి నీచ రాజకీయాలు చేస్తోందని మండిపడ్డారు టీడీపీ నేతలు. లోకేశ్ ఇమేజ్ ని దెబ్బతీసేందుకే ఇలా ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ, వైసీపీ సోషల్ మీడియా కన్వీనర్ గుర్రంపాటి దేవేందర్ రెడ్డిపై కావలి 1వ పట్టణ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. 


విజయసాయి రెడ్డి ట్వీట్స్ రగడ 


అటు సోషల్ మీడియాలో ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకోవడంతో ఆగలేదు. టీడీపీ నుంచి కౌంటర్లు పడుతున్నా వైసీపీ వెనక్కి తగ్గడంలేదు. ఉమామహేశ్వరిది అనుమానాస్పద మరణం అని కొందరు, ఆమె ఉరి వేసుకోడానికి బలమైన కారణాలున్నాయని మరికొందరు ఇష్టం వచ్చినట్టు పోస్టింగ్ లు పెడుతున్నారు. ఆమె మరణానికి చంద్రబాబుకి మధ్య సంబంధం ఏంటని కూడా వైసీపీ నేతలు లాజిక్ తీస్తున్నారు. అయితే  ఎంపీ విజయసాయి రెడ్డి ఇలాంటి పోస్టింగ్ లు పెట్టడంతో టీడీపీ నేతలు ఎదురుదాడి ప్రారంభించారు. ఇలాంటి ప్రచారంలో నేరుగా పేర్లు ప్రస్తావిస్తూ లోకేశ్ పై వ్యాఖ్యలు చేసిన వైసీపీ సోషల్ మీడియా విభాగం నేతలపై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి.