Watch Video: 


స్కూల్‌లో అటూ ఇటూ తిరుగుతూ రిపోర్టింగ్..


ప్రభుత్వ పాఠశాలల్లో వసతులు ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అక్కడక్కడా కాస్త పరిస్థితులు మెరుగ్గానే ఉన్నా...చాలా చోట్ల దారుణమైన స్థితిలో ఉంటున్నాయి. వాటిని బాగు చేయాలన్న ఆలోచన కూడా కొందరు అధికారుల్లో కలగటం లేదు. ఓ బాలుడు ఇక తన స్కూల్ బాగుపడదు అనుకున్నాడో ఏమో, అదిరిపోయే ఐడియాతో ముందుకొచ్చాడు. తన స్కూల్ స్థితిగతులను వివరిస్తూ రిపోర్టింగ్ చేశాడు. స్కూల్‌లోనే అటు ఇటు తిరుగుతూ, క్లాస్‌లు శిథిలావస్థలో ఉండటాన్ని చూపిస్తూ రిపోర్టింగ్ చేశాడు. మరో బాలుడు దీన్ని వీడియో తీశాడు. గుక్క తిప్పుకోకుండా వివరిస్తున్న బాలుడిని చూసి ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. టాయిలెట్‌ సరిగా లేదని, తలుపులు విరిగిపోయాయని అక్కడికి వెళ్లి మరీ చూపించాడు. ఓ కర్రకు క్లాత్ చుట్టి, మైక్‌లా మార్చేసి అది పట్టుకుని చాలా లైవ్‌లీగా చెప్పాడు. కొవిడ్ సమయంలో మూతపడిన ఈ స్కూల్‌ని ఈ మధ్యే రీ ఓపెన్ చేసినా...క్లాస్‌లు ఇంకా జరగటం లేదు. తరగతి గదులు ఖాళీగానే ఉంటున్నాయి. తాగేందుకు నీళ్లు కూడా లేని దుస్థితినీ బాలుడు కళ్లకు కట్టాడు. హ్యాండ్‌పంప్‌లు లేకపోవటాన్ని చూపిస్తూ..అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. మిగతా విద్యార్థులు కూడా ఈ సమస్యల గురించి మాట్లాడాలని విజ్ఞప్తి చేశాడు. ట్విటర్‌లో ఓ నెటిజన్ ఈ వీడియో పోస్ట్ చేయగా...అందరూ వావ్ అంటూ కామెంట్ చేస్తున్నారు.