నాలుగో తరగతి బాలికపై లైంగిక దాడి జరిగిన ఘటనలో నెల్లూరు నగరంలోని ఒవెల్-14 స్కూల్ గుర్తింపు రద్దు చేశారు అధికారులు. ఈమేరకు జిల్లా డీఈవో ఉత్తర్వులు జారీ చేశారు. ప్రాథమిక విచారణలో పాఠశాల యాజమాన్యం నిర్లక్ష్య వైఖరి నిర్ధారణ కావడంతో ఒవెల్ స్కూల్ గుర్తింపును రద్దు చేస్తున్నట్టు జిల్లా ఇన్చార్జి విద్యాశాఖ అధికారి ఆ ప్రకటనలో పేర్కొన్నారు. ఆ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులందరినీ వారి తల్లిదండ్రులు కోరిన పాఠశాలలో చేర్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని ఆయన తెలిపారు.


అయితే ఇక్కడే పెద్ద చిక్కొచ్చి పడింది. స్కూల్ గుర్తింపు రద్దు చేయడాన్ని మిగతా పిల్లల తల్లిదండ్రులు ఒప్పుకోవడంలేదు. తమ పిల్లల భవిష్యత్తు ఏం కావాలని వారు ఆందోళనకు దిగారు. స్కూల్ లో ఒకరు తప్పు చేస్తే స్కూల్ గుర్తింపు రద్దు చేయడమేంటని ప్రశ్నిస్తున్నారు. ఈమేరకు వారు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని కలసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. ఇప్పటికిప్పుడు స్కూల్ గుర్తింపు రద్దు చేస్తే తమ కష్టాలు ఎవరికి చెప్పుకోవాలంటున్నారు విద్యార్థుల తల్లిదండ్రులు. తమ పిల్లలు నష్టపోకుండా స్కూల్ గుర్తింపుని పునరుద్ధరించాలన్నారు.


ఇటీవల హైదరాబాద్ డీఏవీ స్కూల్ విషయంలో కూడా  ఇలాంటి ఘటనే జరిగింది. అక్కడ డీఏవీ స్కూల్ గుర్తింపుని కూడా రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసింది. అప్పట్లో తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఈ విషయంపై స్పష్టమైన ప్రకటన చేశారు. అయితే ఆ తర్వాత మిగతా విద్యార్థుల తల్లిదండ్రులు ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చారు. కావాలంటే ఈ విద్యాసంవత్సరం తర్వాత కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. తమ పిల్లల భవిష్యత్తు పాడైపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో తెంలగాణ ప్రభుత్వం ఓ మెట్టు దిగింది. స్కూల్ గుర్తింపు పునరుద్ధరించింది. ఇప్పుడు నెల్లూరులో కూడా అలాగే స్కూల్ గుర్తింపు పునరుద్ధరించాలని డిమాండ చేస్తున్నారు మిగతా విద్యార్థుల తల్లిదండ్రులు.


నెల్లూరు డైకస్ రోడ్ లోని ఒవెల్-14 స్కూల్ లో పీఆర్వోగా పని చేసే బ్రహ్మయ్య స్కూల్ లో నాలుగో తరగతి చదువుతున్న విద్యార్థినిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన నెల్లూరులో సంచలనంగా మారింది. వెంటనే ఆ చిన్నారి తల్లిదండ్రులు స్కూల్ కి వచ్చి ఫిర్యాదు చేశారు. అతడిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ విషయం ఆనోటా ఈనోటా అందరికీ తెలియడంతో, ఆ స్కూల్ లో తమ పిల్లలను చేర్పించిన తల్లిదండ్రులంతా ఒక్కసారిగా అక్కడకు వచ్చారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. స్కూల్ లో  బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన ముద్దాయిని అదుపులోకి తీసుకున్నారు నెల్లూరు పోలీసులు. పోక్సో చట్టంతోపాటు, ఎస్సీ, ఎస్టీ కేసు కూడా నమోదు చేశారు. నిందితుడిని జ్యుడీషియల్ రిమాండ్ కి పంపించారు. ఈ ఘటనపై పూర్తి స్థాయి దర్యాప్తు చేపట్టారు. అయితే స్కూల్ అనుమతి రద్దు చేస్తూ ఇన్ చార్జి డీఈవో ప్రకటించడంతో అసలు గొడవ మొదలైంది. మిగతా పిల్లల తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. వారంతా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యేన కలసి స్కూల్ తిరిగి ప్రారంభించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.