పులి భయం నెల్లూరు జిల్లా వాసులను కూడా ఇబ్బంది పెడుతోంది. గతంలో ఎప్పుడూ నెల్లూరు జిల్లాలో పులి ఉన్నట్టు కానీ, పులి జాడ కానీ లేదు. కానీ ఇప్పుడు తొలిసారిగా నెల్లూరు జిల్లాలో కూడా పులి అనే భయం మొదలైంది. ఏఎస్ పేట మండలం వేల్పులగుంట ప్రాంతంలో చిరుత పులి సంచరిస్తున్నట్టు పుకార్లు మొదలయ్యాయి.
పుకారేనా..? నిజమా..?
ప్రస్తుతానికి ఇది పుకారే అనుకున్నా చిరుత భయం మాత్రం అందర్నీ చుట్టేసింది. ఎందుకంటే ఇప్పటి వరకూ ఈ చిరుతను ఎవరూ చూడలేదు. కేవలం వారు చూశారని వీరు, వీరు చూశారని వారు చెప్పుకుంటున్నారు. ఇక వాట్సప్ గ్రూపుల్లో అయితే నిత్యం ఇదే గోల. వారం రోజులుగా వాట్సప్ గ్రూపుల్లో పులి వార్త చక్కర్లు కొడుతోంది. ముఖ్యంగా ఏఎస్ పేటకు చెందిన వాట్సప్ గ్రూపుల్లో పులిపై రకరకాల కథనాలు కనపడుతున్నాయి.
మేకను ఎత్తుకెళ్లిందా..?
కలిగిరి మండలం కావలి ముస్తాపురంకి చెందిన చల్లా బ్రహ్మయ్య మేకను చిరుత ఎత్తుకెళ్లిందని చెబుతున్నారు. చల్లాబ్రహ్మయ్య మేకలను తోలుకుని పొలల్లోకి వెళ్తుంటాడు. వేల్పులగుంట ప్రాంతంలో చిరుత దాడి చేసి మేక పిల్లను ఎత్తుకెళ్లినట్టు బ్రహ్మయ్య చెబుతున్నారు. అయితే అక్కడ ఎలాంటి చిరుత కాలి గుర్తులు కనపడటంలేదు. వేల్పులగుంట, కావలి ఎడవల్లి, అక్బరాబాద్, ముస్తాపురం పరిసర ప్రాంతాలలో వారం రోజులుగా చిరుత సంచరిస్తుందని చెబుతున్నారు.
పశువుల కాపర్లలో ఆందోళన..
ఆ చుట్టుపక్కల చాలామంది పశువుల కాపర్లు మేకలను తోలుకుని అటవీ ప్రాంతంలోకి వెళ్తుంటారు. వారంతా ఇప్పుడు చిరుత భయంతో హడలిపోతున్నారు. చిరుత మేకల మందపై దాడి చేసిందని తెలుసుకున్న వారు భయపడుతున్నారు. అయితే మేక కనిపించలేదు కానీ, దాన్ని చిరుత తిన్నట్టు ఆనవాళ్లు ఎక్కడా లేవు.
రంగంలోకి ఫారెస్ట్ అధికారులు..
చిరుత విషయం ఆనోటా ఈనోటా బాగా ప్రచారం కావడంతో రెవెన్యూ అధికారులు అలర్ట్ అయ్యారు. స్థానిక వీఆర్వో సమాచారం మేరకు తహశీల్దార్, ఆర్డీవోలు పరిస్థితి సమీక్షించారు. వారు అటవీశాఖ అధికారులకు సమాచారమిచ్చారు. అటవీశాఖ అధికారులు ఈ ప్రాంతానికి వచ్చి చిరుత విషయం తేల్చేయబోతున్నారు. అసలు ఈ ప్రాంతంలో గతంలో ఎప్పుడూ చిరుత సంచారం లేదు. తొలిసారిగా ఇప్పుడు చిరుత పులి భయం అందర్నీ పట్టిపీడిస్తోంది.
చిరుత కాలి గుర్తులను అటవీశాఖ అధికారులు గుర్తు పట్టే వీలుంది. అటవీ అధికారులు రంగంలోకి దిగితే చిరుత విషయం తేలిపోతుంది. లేకపోతే ప్రజలు మరిన్ని రోజులు చిరుత పేరుతో భయపడిపోతుంటారు. ఇటీవల కొంతమంది లారీ డ్రైవర్లకు ఆ ప్రాంతంలో చిరుత కనిపించిందని ప్రచారం జరిగింది. ఆ తర్వాత మేకల కాపరులు చిరుత గురించి అధికారులకు సమాచారం ఇచ్చారు. తమకు సంబంధించిన మేకను చిరుత ఎత్తుకు వెళ్లిందని వారు చెబుతున్నారు. అయితే పులిని మాత్రం ఎవరూ చూడలేదు. ప్రత్యక్ష సాక్షులెవరూ లేకపోవడంతో ఇది కేవలం ప్రచారమేనా అన్న అనుమానం కూడా ఉంది. ఏది ఏమయినా ప్రజల్లో చిరుత భయం ఉంది కాబట్టి.. దాన్ని పటాపంచలు చేసేందుకు అటవీ శాఖ అధికారులు రంగంలోకి దిగుతున్నారు.