గ్రామాల్లో శాంతి భద్రతల పర్యవేక్షణ విషయంలో మహిళా పోలీసులే కీలకంగా వ్యవహరించాలని సూచించారు నెల్లూరు జిల్లా ఎస్పీ విజయరావు. మహిళా పోలీసులందరితో ఆయన వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడారు. పండగ సందర్భాల్లో చేపట్ట వలసిన బందోబస్తు ఏర్పాట్లను ఆయన మహిళా పోలీసులకు వివరించారు. గ్రామాల్లో పండుగల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరక్కుండా చూడాలని, ఒకవేళ ఎక్కడైనా ఇబ్బందికర పరిస్థితులు ఎదురైతే వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్ దృష్టికి తీసుకురావాలని సూచించారు. గ్రామాల్లో మహిళా పోలీసులే శాంతి భద్రతల విషయంలో చొరవ తీసుకోవాలని ఎస్పీ విజయరావు వారికి వివరించారు.
17 సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధనకోసం..
పోలీస్ శాఖలో అంతర్భాగంగా ఉన్న మహిళా పోలీసులు.. పోలీస్ శాఖకు సంబంధించిన 17 సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధనలో ముందుండాలని సూచించారు ఎస్పీ విజయరావు. పోలీస్ శాఖకు అనుబంధంగా ఉన్న 6 లక్ష్యాలను కూడా ఆయన వివరించారు. ప్రజల ఆరోగ్య సంరక్షణ, జీవన ప్రమాణాలు పెంపు, లింగ సమానత్వం సాధించి మహిళా సాధికారతను పెంపొందించాలని సూచించారు. గౌరవప్రదమైన ఉపాధి, ఆర్థికవృద్ధి, అసమానతల తొలగింపు, సుస్థిర నగరాలు, సమూహాలలో శాంతి స్థాపన, న్యాయం, బలమైన వ్యవస్థలు అనే లక్ష్యాలను మహిళా పోలీసులకు సమగ్రంగా వివరించారు.
ప్రజలకు డిపార్ట్ మెంట్ కి మధ్య వారధి..
గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేసే మహిళా సంరక్షణ కార్యదర్శులు, ప్రస్తుతం మహిళా పోలీస్ లు అయ్యారు. వీరి యూనిఫామ్, ఇతరత్రా వ్యవహారాలు కోర్టులో పెండింగ్ లో ఉన్నా కూడా ప్రస్తుతం పోలీస్ డిపార్ట్ మెంట్ పరిధిలోనే మహిళా పోలీసులు విధులు నిర్వహిస్తున్నారు. మారుమూల గ్రామల్లో సైతం సమస్యలను తెలుసుకోవడానికి పోలీసు డిపార్టుమెంటుకు ప్రజలకు మధ్య వారధిగా మహిళా పోలీసులు ఉంటున్నారు.
సాయంత్రం స్పందన..
ఇటీవల సీఎం జగన్, కలెక్టర్లు-ఎస్పీలతో స్పందన కార్యక్రమంపై సమీక్ష నిర్వహించారు. ప్రతి సచివాలయ పరిధిలోనూ క్రమం తప్పకుండా ప్రతిరోజూ స్పందన కార్యక్రమమం నిర్వహించాలని సీఎం సూచించారు. ఈమేరకు జిల్లా ఎస్పీ మహిళా పోలీసులకు ఆదేశాలిచ్చారు. ప్రతి రోజూ సాయంత్రం 3 నుండి 5 వరకు సచివాలయం పరిధిలో స్పందన కార్యక్రమం నిర్వహించాలని, పథకాలకు సంబంధించిన సమస్యలను ఇతర అధికారులు నోట్ చేసుకుంటారని, శాంతి భద్రతల సమస్యలు, కుటుంబ సమస్యలపై వినతులను మహిళా పోలీసులు స్వీకరించాలని సూచించారు. సచివాలయాల పరిధిలోనే తమకు న్యాయం జరుగుతుంది అనే నమ్మకం, భావన ప్రజల్లో కల్పించాలని చెప్పారు. పోలీసు శాఖకు గ్రామాల్లో మీరే పదునైన ఆయుధం, మీదే కీలక పాత్ర అని చెప్పారు. ఫిర్యాదుదారులతో ఆప్యాయంగా మాట్లాడి వారి సాధకబాధకాలను ఓపికగా అడిగి తెలుసుకోవాలన్నారు. సమాజంలో అసాంఘిక కార్యకలాపాలు అరికట్టాలని, బాల్య వివాహాలు, వరకట్నం, గృహ హింస, పురుషాధిక్యత వంటివాటిని పూర్తిగా పారద్రోలాలన్నారు. ఇదే స్పూర్తితో చక్కగా క్రమశిక్షణతో విధులు నిర్వర్తించాలన్నారు. మహిళలు, చిన్నారులు, వృద్దులపై నేరాలు జరుగకుండా ముందస్తు చర్యలతో అడ్డుకట్ట వేయాల్సిన బాధ్యత మహిళా పోలీసులపై ఉందన్నారు. ప్రభుత్వం, పోలీసుశాఖలు మహిళల భద్రతే పరమాధిగా ఉండాలన్నారు. ప్రతి మహిళ సెల్ ఫోన్ లో దిశ యాప్ ఉండాలని, దిశ యాప్ వాడకంపై కూడా పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలని చెప్పారు ఎస్పీ విజయరావు.