Mla Kotamreddy : నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మళ్లీ ప్రెస్ మీట్ పెట్టారు. టీడీపీ నుంచి పోటీ చేయాలనేదే తన ఆకాంక్ష అని తేల్చిచెప్పారు. చంద్రబాబు అభీష్టం మేరకే తనకు టికెట్ కేటాయిస్తా్రన్నారు. ఎంపీ ఆదాల  రూరల్ లో పోటీ చేస్తున్నట్టా, లేనట్టా స్పష్టం చేయాలన్నారు. 
 
తాను మొదలు పెట్టిన గడప గడపను రాష్ట్ర కార్యక్రమంగా చేపట్టారని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. తన ఆరోగ్య పరిస్థితుల వల్ల ప్రస్తుతం గడప గడపకి తిరగలేకపోతున్నానని అన్నారాయన. అందుకే ప్రత్యామ్నాయ కార్యక్రమాలు చేపడుతున్నానని అన్నారు. తాను చంద్రబాబు ట్రాప్ లో పడ్డానని అంటున్నారు కదా, ఒకవేళ పడితే అలాంటి పరిస్థితి ఎందుకొచ్చిందో వైసీపీ ప్రభుత్వం ఆలోచించుకోవాలన్నారు. తాను ఎవరి ట్రాప్ లో పడనని, ప్రజల ట్రాప్ లోనే పడతానని అన్నారు. చంద్రబాబుకు తనను ట్రాప్ లో వేయాల్సిన అవసరం ఏముంటుందని ప్రశ్నించారు. ఆదాల ప్రభాకర్ రెడ్డి రూరల్ లో పోటీ చేస్తానని చెప్పి, ఆ తర్వాత వెంటనే మాట మార్చారని, ఇంతకీ ఆయన పోటీ చేస్తున్నారా లేదా తేల్చలేదని చెప్పారు. తనకు మాత్రం వచ్చేసారి టీడీపీ నుంచి పోటీ చేయాలని ఉందని, కానీ అది చంద్రబాబు ఇష్టం కదా అన్నారు.  తాను ఏ పార్టీలో చేరాలో, ఏ పార్టీ టికెట్ పై పోటీ చేయాలో కాలమే నిర్ణయిస్తుందన్నారు. కేంద్ర హోంశాఖకు ఫోన్ ట్యాపింగ్ పై ఫిర్యాదు చేయాలని చెప్పిన కాకాణి, ఆ తర్వాత ఇప్పుడు కోర్టులో కేసు వేయమంటున్నారని, మాటలు మార్చేస్తున్నారని మండిపడ్డారు. తనతో కలిసి వస్తున్న సర్పంచ్ లు, ఎంపీటీసీలతో కోటంరెడ్డి ఇవాళ ప్రెస్ మీట్ పెట్టారు. 


టీడీపీ నుంచే పోటీ


నెల్లూరు రూరల్ లో టీడీపీ నుంచి పోటీ చేయాలన్నదే తన ఆకాంక్ష అని, చంద్రబాబు ఏం నిర్ణయం తీసుకుంటారో చూడాలని కోటంరెడ్డి అన్నారు. అధికారానికి దూరంగా ఉన్నా, తనను అభిమానించి సర్పంచులు, ఎంపీటీసీలు, కోఆప్షన్ సభ్యులు తన వెంట నిలబడ్డారన్నారు. తన పోరాటాల్లో కూడా అండగా ఉంటామని హామీ ఇస్తానంటున్నందుకు ధన్యవాదాలు అన్నారు. మెజారిటీ కార్పొరేటర్లు, సర్పంచులు తనతో లేరని, ఇప్పుడు తనతో ఉన్న ప్రతీ కార్యకర్త, నాయకులని కాపాడుకుంటానన్నారు. నియోజకవర్గంలో జెండాలు కట్టి, వాల్ పోస్టర్లు అంటించి రాజకీయాల్లో ఎదిగానని కోటంరెడ్డి అన్నారు. కార్యకర్తలని కాపాడుకోవాల్సిన బాధ్యత తన మీద ఉందన్నారు. కార్పొరేషన్లో ఎప్పుడు సమావేశాలు జరిగినా, తమను పిలిచానా, పిలవకపోయిన తాను, మేయర్ వెళ్తామని కోటంరెడ్డి స్పష్టం చేశారు.


మీరు చేస్తే పవిత్రం, నేను చేస్తే అపవిత్రమా? 


టీడీపీ గుర్తు మీద గెలిచి వైసీపీలో చేరిన వాళ్లను స్పీకర్ ఫార్మాట్‌లో రాజీనామా చేయించి, ఎన్నికల్లో గెలిచి అప్పుడు తన రాజీనామా గురించి మాట్లాడాలని కోటంరెడ్డి అనిల్ కుమార్ కు కౌంటర్ ఇచ్చారు. మీరు చేస్తే పవిత్రం, నేను చేస్తే అపవిత్రమా? అని ప్రశ్నించారు. తాను లేవనెత్తిన సమస్యలు పరిష్కరించమనే కోరుతున్నానన్నారు.  ఒక స్థానిక ఎమ్మెల్యేగా ప్రజా సమస్యలు లేవనెత్తాల్సిన బాధ్యత తనపై ఉందన్నారు. గణేష్ ఘాట్ అభివృద్ధి తానే చేశానని ఎప్పుడూ చెప్పలేదన్నారు. నాటి తెలుగుదేశం మంత్రులు, నాయకులందరూ కలిసి చేశారన్నారు. ఆదాల రూరల్ అభ్యర్థిని అని చెబుతూనే ఐదేళ్లకోసారి నిర్ణయం తీసుకుంటానని మాట మార్చారన్నారు. తాను ఎవరి ట్రాప్ లో పడనని, ప్రజల ట్రాప్ లో ఉంటానన్నారు. ఒక్క ఎమ్మెల్యే కోసం టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ట్రాప్ వేయాల్సిన అవసరం లేదన్నారు. టీడీపీ నుంచి పోటీ చేయాలన్నది తన ఆకాంక్ష అని తేల్చిచెప్పారు.  జూన్ తరువాత గడపగడపకు కార్యక్రమాన్ని తిరిగి ప్రారంభిస్తానని ఎమ్మెల్యే కోటంరెడ్డి వెల్లడించారు.