నెల్లూరు నగరం మాగుంట లేఅవుట్ లోని నక్షత్ర స్కూల్ లో ఓ అమ్మాయి తల్లి గొడవ చేసింది. స్కూల్ యాజమాన్యం తమకు క్షమాపణ చెప్పాలని ఆమె డిమాండ్ చేసింది. స్కూల్ తో తన పాప కాపీ కొట్టిందనే నెపంతో టీచర్, వ్యాన్ డ్రైవర్ అసభ్యంగా ప్రవర్తించారని, తన కుమార్తెకు న్యాయం చేయాలని ఆమె స్కూల్ ముందు ఆందోళనకు దిగారు. కరస్పాండెంట్ కారు కదలనీయకుండా రోడ్డుపైనే కూర్చున్నారు. తన కూతురితో స్కూల్ లో టీచర్, వ్యాన్ డ్రైవర్ అసభ్యంగా ప్రవర్తించాడని వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు.




ఇక స్కూల్ యాజమాన్యం వాదన మరోలా ఉంది. విద్యార్థిని పరీక్షల్లో స్లిప్పులు పెట్టిందని, ఆ విషయం తల్లికి కూడా తెలుసని, కావాలనే ఇప్పుడు రాద్ధాంతం చేస్తోందని స్కూల్ కరస్పాండెంట్ చెబుతున్నారు. విద్యార్థినికి క్రమశిక్షణ నేర్పడమే తప్పా అని కరస్పాండెంట్ ప్రశ్నిస్తున్నారు. తాము క్షమాపణ చెప్పే ప్రసక్తే లేదని అంటున్నారామె.




ఇటీవలే నెల్లూరులో ఒవెల్ స్కూల్ లో ఇలాంటి ఘటన జరిగింది. నాలుగో తరగతి చదివే చిన్నారిపై స్కూల్ పీఆర్వో లైంగిక దాడికి పాల్పడ్డాడు. అయితే ఆ ఘటనలో యాజమాన్యం కూడా తప్పు ఒప్పుకుంది. సదరు పీఆర్వో కూడా తప్పు ఒప్పుకోవడంతో అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోక్సో చట్టంకింద అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించారు. ఆ తర్వాత స్కూల్ పై క్రమశిక్షణ చర్యలు తీసుకున్నారు. స్కూల్ ని మూసివేసేలా డీఈవో ఆదేశాలిచ్చారు. కానీ స్కూల్ మూసివేస్తే ఇతర విద్యార్థులకు ఇబ్బందులు ఎదురవుతాయనే మానవతా దృక్పథంతో తర్వాత స్కూల్ తిరిగి ప్రారంభించుకునేలా ఆదేశాలిచ్చారు అధికారులు.


తాజాగా నక్షత్ర స్కూల్ లో కూడా ఇలాంటి ఘటనే జరిగిందని తెలిసే సరికి నెల్లూరులో పేరెంట్స్ ఆందోళన పడ్డారు. స్కూల్ కి ఆడపిల్లల్ని పంపించే తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు. అయితే ఇక్కడ నక్షత్ర స్కూల్ లో జరిగిన ఘటన పూర్వాపరాలు పూర్తిగా వెలుగులోకి రావాల్సి ఉంది. తన కుమార్తెను వేధించారని, అసభ్యంగా మాట్లాడారని ఆమె తల్లి ఆరోపిస్తోంది. తాము వీధినపడాలని రాలేదని, తమకు న్యాయం చేయాలని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకూడదని అంటుందామె. అయితే అదే సమయంలో యాజమాన్యం మాత్రం అసలు తమ తప్పేమీ లేదంటోంది. విద్యార్థిన కాపీకొడుతూ పట్టుబడే సరికి ఆ విషయాన్ని ఆమె తల్లికి తెలియజెప్పామని, కానీ కావాలనే తమపై నిందలు వేస్తూ ఆమె స్కూల్ ముందు గొడవ చేస్తోందని యాజమాన్యం ఆరోపిస్తోంది.


ప్రస్తుతం పోలీసులు ఈ ఘటనపై విచారణ జరుపుతున్నారు. స్కూల్ యాజమాన్యం విద్యార్థిని తల్లిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదుపై, ఈ ఘటనపై పోలీసులు ఇంకా అధికారికంగా ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదు. అయితే నెల్లూరులో ఇలాంటి వరుస సంఘటనలు జరగడం మాత్రం విచారకరం. స్కూల్ లో విద్యార్థినుల భద్రతను ప్రశ్నించే అంశాలివి. ఈ ఘటనలో విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు బాధితులు.