Chandrababu : ఉభయ గోదావరి జిల్లాల్లో టీడీపీ అధినేత చంద్రబాబు మూడో రోజు పర్యటన కొనసాగుతోంది. కొవ్వూరులో చంద్రబాబు డ్వాక్రా, అంగన్వాడీ, పొదుపు సంఘాల ప్రతినిధులతో సమావేశమయ్యారు. మహిళలతో ముఖాముఖి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చంద్రబాబు మాట్లాడుతూ జగన్ పాదయాత్రలో ముద్దులు పెడితే, ఏదో ఉద్దరిస్తారని ప్రజలు మోసపోయారన్నారు. ఇప్పుడు మహిళలను పిడిగుద్దులు గుద్దుతున్నారని ఆరోపించారు. వైసీపీ పాలనలో మహిళలకు అన్యాయం జరుగుతోందని విమర్శించారు. డ్వాక్రా సంఘాలను సీఎం జగన్ సభలకు ఉపయోగిస్తున్నారన్నారు. జగన్‌ సభల్లో చప్పట్లు కొట్టకపోతే పింఛన్ కట్, అమ్మ ఒడి కట్ చేస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు.  






మరుగుదొడ్లపై పన్ను 


సీఎం జగన్ ప్రజలకు ఇచ్చే డబ్బులకు దోచుకునే డబ్బులకు పొంతన లేదని చంద్రబాబు అన్నారు. మహిళలు రాజకీయంగా రాణించాలని చంద్రబాబు ఆకాంక్షించారు.   దిశ చట్టం అవ్వకపోయినా ఆ చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని గొప్పలు చెబుతున్నారని ఎద్దేవా చేశారు. టీడీపీ హయాంలో డ్వాక్రా మహిళలకు లబ్ధి చేకూరిందన్నారు. డ్వాక్రా సంఘాలకు రూ.5 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు ఇచ్చామని చంద్రబాబు గుర్తుచేశారు. టీడీపీ ప్రభుత్వంలో ఆడవారి ఆత్మగౌరవం కోసం మరుగుదొడ్లు ఇస్తే, వాటిపై వైసీపీ ప్రభుత్వం పన్ను వేస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. వైసీపీ పాలనలో మహిళలకు ఏం లాభం కలిగిందో ప్రజలు ఒకసారి బేరీజు వేసుకోవాలని చంద్రబాబు కోరారు.  


డ్వాక్రా సంఘాలకు పూర్వ వైభవం 
 
డ్వాక్రా సంఘాల స్వయం సాధికారత స్ఫూర్తిని సీఎం జగన్‌ తీవ్రంగా దెబ్బతీరాని చంద్రబాబు ఆరోపించారు. సీఎం మాటలు కోటలు దాటుతున్నాయి కానీ పనులు మాత్రం గడప కూడా దాటడంలేదన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక  ఇంటి ఖర్చులను మహిళలు ఒకసారి బేరీజు వేసుకోవాలన్నారు. మీ కొనుగోలు శక్తి తగ్గిందో లేదో ఆలోచన చేయాలన్నారు. కేవలం తన సభలకు హాజరు కావడం కోసమే డ్వాక్రా సంఘాలను సీఎం జగన్ వాడుకుంటున్నారన్నారు. మహిళల ఆత్మగౌరవానికి టీడీపీ మరుగుదొడ్లు కట్టిస్తే, వాటి పైనా పన్ను విధించిన ఘనత జగన్ కే దక్కుతుందన్నారు. టీడీపీ అధికారంలోకి రాగానే మళ్లీ డ్వాక్రా సంఘాలను బలోపేతం చేస్తామన్నారు. మహిళలను ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా పైకి తీసుకొచ్చేందుకు టీడీపీ కృషి చేస్తుందని  చంద్రబాబు తెలిపారు. 


ఊరికొక సైకో 


తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో చంద్రబాబు రోడ్ షో నిర్వహించారు. రాష్ట్ర భవిష్యత్తు నాశనం చేస్తున్నారని చాలా బాధగా ఉందన్నారు. ఇంత నీచమైన పాలన తన రాజకీయ జీవితంలో చూడలేదని వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. వైసీపీ పాలనలో ఊరికొక సైకోను తయారుచేస్తున్నారని మండిపడ్డారు. అమరరాజా పరిశ్రమను తెలంగాణలో పెడుతున్నారని, ఏపీ వ్యక్తి వేరే రాష్ట్రంలో పెట్టుబడి పెట్టేందుకు వెళ్లాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. పరిశ్రమలు తరలిపోతుంటే యువతకు ఉద్యోగాలు ఎలా వస్తాయని చంద్రబాబు ఆవేదన చెందారు.