AP Road Accidents : కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలం ధర్మవరం జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం జరిగింది. రెండు లారీలు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు సజీవదహనం అయ్యారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. అతడ్ని ఆసుపత్రికి తరలిస్తుండగా మరణించాడు. ధర్మవరం జాతీయ రహదారిపై ఉన్న హెచ్.పి పెట్రోల్ బంక్ వద్ద ఈ ఘటన జరిగింది. ఎర్రవరం నుంచి విశాఖపట్నం వైపుగా వెళ్తోన్న ఇసుక లారీ అదుపుతప్పి డివైడర్ దాటి ఎదురుగా వస్తోన్న మరొక లారీని ఢీకొట్టింది. ప్రమాద ఘటనలో లారీ క్యాబిన్ నుంచి మంటలు చెలరేగాయి. రెండు లారీలలో ఉన్న ఇద్దరు డ్రైవర్లు ఒక క్లీనర్ సజీవ దహనం అయ్యారు. రెండు లారీలు ఢీకొనడంతో క్యాబిన్ లోంచి చెలరేగిన మంటలు చెలరేగి ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు అంటున్నారు. 


అసలేం జరిగింది? 


కాకినాడ జిల్లాలో ప్రత్తిపాడు మండలం ధర్మవరం సమీపంలో జాతీయ రహదారిపై రెండు లారీలు ఢీకొని మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంతో ఒక్కసారిగా లారీల క్యాబిన్‌లో మంటలు వ్యాపించాయి. దీంతో క్యాబిన్‌లో చిక్కుకున్న ఇద్దరు డ్రైవర్లు, క్లీనర్ ఘటనాస్థలిలో సజీవ దహనం అయ్యారు. మరొకరిని ఆసుప్రతికి తరలిస్తుండగా మార్గ మధ్యలో ప్రాణాలు కోల్పోయారు. మొత్తం నలుగురు మరణించినట్లు తెలుస్తోంది. ఈ ఘటన సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపుచేశారు. డ్రైవర్‌ నిద్రమత్తు కారణంగా ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు చెబుతున్నారు. రాజమండ్రి నుంచి విశాఖపట్నం వైపుగా వెళ్తోన్న ఇసుక లారీ అదుపుతప్పి డివైడర్ దాటి మరొక లారీని ఢీ కొట్టింది. రెండు లారీలు వేగంగా ఒకదానిని మరొకటి ఢీకొట్టడంతో ఒకదానికొకటి ఇరుక్కుపోయాయి. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే మృతుల వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఈ ప్రమాదంతో కొద్దిసేపు జాతీయరహదారిపై వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది.  



పలమనేరులో బస్సు ప్రమాదం 


 చిత్తూరు జిల్లాలో బెంగళూరు నుంచి విజయవాడ వెళ్తోన్న బస్సు ప్రమాదానికి గురైంది. హెచ్‌బీ ట్రావెల్స్‌ బస్సు  పలమనేరు సమీపంలోని కెట్లపాలెం వద్ద జాతీయ రహదారిపై గురువారం అర్ధరాత్రి 12 గంటల తర్వాత బోల్తా పడింది.  బస్సు ప్రమాదానికి డ్రైవర్‌ నిద్రమత్తే కారణమని పోలీసులు వెల్లడించారు. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, 20 మంది వరకు గాయపడినట్లు తెలుస్తోంది. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను వెంటనే పలమనేరు ఏరియా ఆస్పత్రికి తరలించారు. బస్సు ప్రమాదం ఎలా జరిగిందన్న దానిపై విచారణ చేసి మిగతా వివరాలు వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు.


ఒడిశాలో రోడ్డు ప్రమాదం


ఒడిశా రాష్ట్రం ఖుర్దా రోడ్డు జాతీయ రహదారిపై గురువారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని వెనక నుంచి వేగంగా కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. గురువారం తెల్లవారుజామున ఐదు గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. ఈ విషాద సంఘటనలో విశాఖకు చెందిన నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. రోడ్డు ప్రమాదంలో విశాఖ బీచ్ రోడ్డు ప్రాంతానికి చెందిన బ్యూటీషియన్ మారియా ఖాన్(24), విశాలాక్షి నగర్ ప్రాంతానికి చెందిన రాఖి(45), ఫోటోగ్రాఫర్ కబీర్ తో పాటు మరో వ్యక్తి చనిపోయినట్లు ప్రాథమిక సమాచారం. ఈ నలుగురు భువనేశ్వర్ లోని ఓ వివాహానికి వెళుతుండగా ఈ దుర్ఘటన జరిగినట్లు  తెలుస్తోంది. ప్రమాదం గురించి తెలిసిన వెంటనే మృతుల బంధువులు స్నేహితులు హుటాహుటిన ఒడిశాకు బయలుదేరి వెళ్లారు.