Chandrababu : ఎన్టీఆర్ వెనకబడిన వర్గాలను ముందుకు నడిపించారని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. నెల్లూరు జిల్లాలో పర్యటిస్తున్న చంద్రబాబు.. కావలిలో ఇదేం ఖర్మ బీసీలకు కార్యక్రమంలో పాల్గొన్నారు. టీడీపీ అధికారంలోకి రాకముందు బీసీలను కేవలం ఓటర్లుగానే చూశారన్నారు. ఎన్టీఆర్ హయాంలో వెనకపడ్డ వర్గాలకు పెద్దపీట వేశారన్నారు. బీసీలకు టీడీపీ ఎప్పుడూ ఉన్నతమైన పదవులు ఇచ్చిందని గుర్తుచేశారు. రాష్ట్రంలో 50 శాతం ఉన్న బీసీలకు 34 శాతం రిజర్వేషన్ అమలుచేస్తే సీఎం జగన్ దానిని 24 శాతానికి తగ్గించారని ఆరోపించారు.  సీఎం అయిన వెంటనే బీసీల అభివృద్ధికే మొదటి సంతకం చేస్తానని చంద్రబాబు స్పష్టం చేశారు. నీతి నిజాయితీ కలిగిన మాజీ మంత్రి కొల్లు రవీంద్రపై అక్రమంగా కేసులుపెట్టి పైశాచిక ఆనందం పొందారని ఆగ్రహం వ్యక్తం చేశారు.  






బీసీల సంక్షేమంపై తొలి సంతకం 


టీడీపీ అధికారంలోకి వస్తే బీసీల సంక్షేమ అంశంపై తొలి సంతకం పెడతానని  అధినేత చంద్రబాబు వెల్లడించారు. సీఎం జగన్‌కు బీసీలు రిటర్న్‌గిఫ్ట్‌ ఇచ్చే రోజు దగ్గర్లోనే ఉందన్నారు. బీసీల కులవృత్తులను సీఎం జగన్ కించపరుస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు. రజకులు దుస్తుల తరహాలోనే జగన్‌ను ఉతికి ఉతికి ఆరేయాలన్నారు.  రజకులకు ఆధునిక పరికరాలు ఇచ్చి కులవృత్తుల గౌరవం కాపాడామని చంద్రబాబు స్పష్టం చేశారు. బీసీ సంక్షేమంపై శ్వేతపత్రం విడుదల చేయాలన్నారు. బీసీల సంక్షేమంపై చర్చకు జగన్‌ సిద్ధమా? అని చంద్రబాబు సవాల్‌ చేశారు. చేపలు ఇచ్చి చేతులు దులుపుకోవడం కాదని, వలలిచ్చి చేపలు పట్టడం నేర్పిస్తే జీవితాంతం బతుకుతారనేది టీడీపీ సిద్ధాంతమన్నారు.  


నిన్న కావలి సభలో 


చంద్రబాబు నెల్లూరు జిల్లా పర్యటన రెండోరోజు(గురువారం) కూడా జనసందోహం మధ్య కొనసాగింది. తొలిరోజు కందుకూరులో జరిగిన దుర్ఘటన తర్వాత రెండోరోజు, మృతుల అంత్యక్రియల్లో చంద్రబాబు పాల్గొన్నారు. వారి కుటుంబాలకు ఆర్థిక సాయం అందించారు. అనంతరం ఆయన జిల్లాలో తన యాత్ర కొనసాగించారు. రెండోరోజు కావలి నియోజకవర్గంలో చంద్రబాబు పర్యటన కొనసాగింది.  కందుకూరు విషాదం తర్వాత చంద్రబాబు కావలిలో తన ప్రసంగంతో ఆకట్టుకున్నారు. కావలి సెంటర్లో నిలబడి ఎమ్మెల్యేకి హెచ్చరికలు జారీ చేస్తున్నానన్నారు. కావలిలో గతంలో తెలుగుదేశం సానుభూతిపరుడు చనిపోయారని, ఇటీవల మరో యువకుడు ఆత్మహత్యాయత్నం చేశాడని గుర్తు చేశారు. ప్రజలంతా భయపడిపోయారని అన్నారు. కావలి ఎమ్మెల్యే రౌడీయిజం తమ దగ్గర కుదరదని అన్నారు. ఖబడ్దార్ ఎమ్మెల్యే అని అన్నారు. రౌడీయిజం తోక కట్ చేస్తామన్నారు. ఒళ్లు మదమెక్కి ఇష్టానుసారంగా తయారయ్యారన్నారు.  తన పరిపాలనలో ఎక్కడైనా తమవారు తప్పుచేస్తే తాట తీశానని అన్నారు. ఇప్పుడంతా సైకో దగ్గర పనిచేస్తున్నారని చెప్పారు. రాష్ట్రాన్ని కాపాడుకోవాలి. అప్పటి వరకూ మనం పోరాడాలి తమ్ముళ్లూ అని పిలుపునిచ్చారు. 


సాయంత్రమైతే మందుబాబులకు తానే గుర్తొస్తానని, తాను అధికారంలోకి వస్తే మంచి బ్రాండ్లు అందుబాటులోకి వస్తాయని, రేట్లు తగ్గుతాయని మందుబాబులు అనుకుంటుంటారని చెప్పారు. చంద్రబాబుతో పాటు స్థానిక నాయకులు ఈ రోడ్ షో, బహిరంగ సభలో పాల్గొన్నారు. చంద్రబాబు ప్రసంగం మధ్యలో ఓ చిన్నారి మాట్లాడి అందర్నీ ఆకట్టుకున్నారు. కందుకూరులో జరిగినది దురదృష్టకరమైన సంఘటన అన్నారు చంద్రబాబు. కందుకూరు సభలో నా ఆత్మ బంధువులు చనిపోయారని అన్నారాయన. త్యాగమూర్తుల రుణం తీర్చుకుంటానని చెప్పారు. బాధిత కుటుంబాలకు పార్టీ పరంగా ఆర్థిక సాయం చేశామని, మృతుల కుటుంబ సభ్యులకు పార్టీ అండగా ఉంటుందని స్పష్టం చేశారు.