చంద్రబాబు నెల్లూరు జిల్లా పర్యటన రెండోరోజు కూడా జనసందోహం మధ్య కొనసాగింది. తొలిరోజు కందుకూరులో జరిగిన దుర్ఘటన తర్వాత రెండోరోజు, మృతుల అంత్యక్రియల్లో చంద్రబాబు పాల్గొన్నారు. వారి కుటుంబాలకు ఆర్థిక సాయం అందించారు. అనంతరం ఆయన జిల్లాలో తన యాత్ర కొనసాగించారు. రెండోరోజు కావలి నియోజకవర్గంలో చంద్రబాబు పర్యటన కొనసాగింది. రెండోరోజు భారీ పోలీసు బందోబస్తు మధ్య పర్యటనకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు.


కందుకూరు విషాదం తర్వాత చంద్రబాబు కావలిలో తన ప్రసంగంతో ఆకట్టుకున్నారు. కావలి సెంటర్లో నిలబడి ఎమ్మెల్యేకి హెచ్చరికలు జారీ చేస్తున్నానన్నారు. కావలిలో గతంలో తెలుగుదేశం సానుభూతిపరుడు చనిపోయారని, ఇటీవల మరో యువకుడు ఆత్మహత్యాయత్నం చేశాడని గుర్తు చేశారు. ప్రజలంతా భయపడిపోయారని అన్నారు. కావలి ఎమ్మెల్యే రౌడీయిజం తమ దగ్గర కుదరదని అన్నారు. ఖబడ్దార్ ఎమ్మెల్యే అని అన్నారు. రౌడీయిజం తోక కట్ చేస్తామన్నారు. ఒళ్లు మదమెక్కి ఇష్టానుసారంగా తయారయ్యారన్నారు.  తన పరిపాలనలో ఎక్కడైనా తమవారు తప్పుచేస్తే తాట తీశానని అన్నారు. ఇప్పుడంతా సైకో దగ్గర పనిచేస్తున్నారని చెప్పారు. రాష్ట్రాన్ని కాపాడుకోవాలి. అప్పటి వరకూ మనం పోరాడాలి తమ్ముళ్లూ అని పిలుపునిచ్చారు.


సాయంత్రమైతే మందుబాబులకు తానే గుర్తొస్తానని, తాను అధికారంలోకి వస్తే మంచి బ్రాండ్లు అందుబాటులోకి వస్తాయని, రేట్లు తగ్గుతాయని మందుబాబులు అనుకుంటుంటారని చెప్పారు. చంద్రబాబుతో పాటు స్థానిక నాయకులు ఈ రోడ్ షో, బహిరంగ సభలో పాల్గొన్నారు. చంద్రబాబు ప్రసంగం మధ్యలో ఓ చిన్నారి మాట్లాడి అందర్నీ ఆకట్టుకున్నారు. కందుకూరులో జరిగినది దురదృష్టకరమైన సంఘటన అన్నారు చంద్రబాబు. కందుకూరు సభలో నా ఆత్మ బంధువులు చనిపోయారని అన్నారాయన. త్యాగమూర్తుల రుణం తీర్చుకుంటానని చెప్పారు. బాధిత కుటుంబాలకు పార్టీ పరంగా ఆర్థిక సాయం చేశామని, మృతుల కుటుంబ సభ్యులకు పార్టీ అండగా ఉంటుందని స్పష్టం చేశారు. కావలి సభకు భారీగా పోలీసులు తరలి వచ్చారని, ఈరోజు ఉన్నంత మంది పోలీసులు నిన్న ఉండి ఉంటే కందుకూరులో విషాదం చోటుచేసుకునేది కాదన్నారు చంద్రబాబు.


ప్రధాని కూడా వెంటనే స్పందించి పరిహారం ప్రకటించారని చెప్పారు చంద్రబాబు. ప్రధాని మోదీ చూపిన చొరవకు కృతజ్ఞతలు తెలిపారు. సీఎం జగన్‌ కు కనీసం సంతాపం తెలిపే తీరిక లేదని మండిపడ్డారు చంద్రబాబు. ప్రధాని స్పందన చూసిన తర్వాత సీఎం జగన్ స్పందించారని గుర్తు చేశారు. కందుకూరు మృతులకు సంతాప సూచకంగా కావలి సభలో అందరూ సంఘీభావం తెలపాలని కోరారు చంద్రబాబు. మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ సభలో అందరి చేత నివాళులు అర్పించారు. బాధిత కుటుంబాలకు తానే పెద్ద దిక్కుగా ఉంటానని చంద్రబాబు చెప్పారు.


మూడోరోజు చంద్రబాబు కోవూరు నియోజకవర్గంలో పర్యటిస్తారు. కోవూరులో స్థానిక ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి చంద్రబాబుపై గతంలో తీవ్ర వ్యాఖ్యలు చేసారు. ఈ పర్యటనలో చంద్రబాబు ఆయనకు బదులిస్తారని అంటున్నారు టీడీపీ నేతలు. కావలి ఎమ్మెల్యే అరాచకాలు ఇక సాగవని, ఆయన తోక కత్తిరిస్తామని అన్నారు చంద్రబాబు. కోవూరులో కూడా ఎమ్మెల్యేపై ఆయన మండిపడే అవకాశాలున్నాయని గుర్తు చేస్తున్నారు టీడీపీ నేతలు. కోవూరులో మాజీ ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులరెడ్డి తనయుడు దినేష్ రెడ్డికి ఇప్పటికే నియోజకవర్గ బాధ్యతలు అప్పగించారు. వచ్చే దఫా ఆయనకే టికెట్ కన్ఫామ్ అంటున్నారు. కోవూరు సభలో దినేష్ రెడ్డి సహా చంద్రబాబు రోడ్ షో లో పాల్గొంటారు.