Nellore Tunnel Aquarium : అక్వేరియంలో మహా అయితే రెండు మూడు రకాల చేపలుంటాయి, ఇంకా పెద్ద అక్వేరియం అయితే ఓ పది రకాల చేపల్ని పెంచుతారు. కానీ ఇక్కడ 150 రకాల చేపల్ని ఒకేసారి ప్రదర్శనకు పెట్టారు. అది కూడా టన్నెల్ లాంటి నిర్మాణంలో చేపలు మనపై నుంచి కదులుతున్నట్టు, మన పక్కనుంచి వెళ్తున్నట్టు ఉన్న అనుభూతిని కలిగిస్తూ నెల్లూరు వాసులకు సరికొత్త అనుభూతి మిగిల్చేందుకు ఈ ఎగ్జిబిషన్ పెట్టారు.
తొలి అండర్ వాటర్ ఎక్స్ పో
రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇదే తొలి అండర్ వాటర్ టన్నెల్ ఎక్స్ పో అంటున్నారు నిర్వాహకులు. ఇప్పటి వరకూ సింగపూర్, మలేసియా, దుబాయ్ లో ఇలాంటి అక్వేరియంలు ఉండేవని, ఇప్పుడిది తొలిసారిగా నెల్లూరులో ఏర్పాటు చేశామని అంటున్నారు. అమెజాన్ లోని ఫిష్, జెల్లీ ఫిష్, హనీమూన్ ఫిష్.. ఇలా ఇక్కడ 150 రకాల చేపలున్నాయి. వీటిని వేర్వేరుగా పార్టీషియన్లు చేసిన అండర్ వాటర్ టన్నెల్ లో ఉంచారు. ఈ చేపలు ఏం తింటాయో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. ప్రతి రోజూ ఈ చేపలకోసం 30కేజీల చికెన్, 5కేజీల ప్రాన్స్ ఆహారంగా అందిస్తారు. చిన్న చిన్న చేపల్ని కూడా వీటికి ఆహారంగా పెడతారు. 18మంది పనివాళ్లు, రేయింబవళ్లు వీటిని కాపాడుతుంటారు. ప్రతిరోజూ నీళ్లు మార్చడం, ఆక్సిజన్ లెవల్స్ సరిచూడటం వంటివి చేస్తుంటారు.
కేరళలో ఎక్కువగా
నెల్లూరులోని కేవీఆర్ పెట్రోల్ బంక్ సమీపంలో ఈ అక్వేరియంతోపాటు భారీ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. ప్రతిరోజూ సాయంత్రం 3 గంటలనుంచి అక్వేరియంలోకి సందర్శకులను అనుమతిస్తున్నారు. ఉదయం మొత్తం దీని మెయింటెనెన్స్ కి, చేపలకు ఆహారం ఇవ్వడానికి సరిపోతుందని అంటున్నారు నిర్వాహకులు. ఇలాంటి అక్వేరియంలు ఎక్కువగా కేరళలో ఉంటాయని, కేరళనుంచి కూడా కొన్ని చేపల్ని ఇక్కడకు తీసుకొచ్చామని చెబుతున్నారు. విదేశాలనుంచి కూడా కొన్ని చేపల్ని తెచ్చారు. అమెజాన్ ప్రాంతంలో మాత్రమే కనపడే అమెజాన్ ఫిష్ ఈ అక్వేరియంకు స్పెషల్ అట్రాక్షన్. చేపలు, నోరు, కళ్లు... అసలు ఏమాత్రం బయటకు కనపడని హనీమూన్ ఫిష్ కూడా ఇక్కడ ప్రత్యేకత. మొత్తానికి నెల్లూరీయులకు ఈ అండర్ వాటర్ టన్నెల్.. సరికొత్త అనుభూతిని కలిగిస్తోంది.
ఆసక్తి చూపుతున్న పిల్లలు
అండర్ వాటర్ టన్నెల్ అక్వేరియాన్ని చూసేందుకు పిల్లలు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. గతంలో వారు ఎక్కడా చూడని చేపలు, భవిష్యత్తులో చూడలేని చేపల్ని కూడా ఇక్కడ ఒకేసారి చూడొచ్చు. గతంలో అక్వేరియంలు చూసినవారు కూడా ఈ టన్నెల్ ఆకారంలో ఉన్న అక్వేరియంలో నడచి వెళ్తూ, తమ పైనుంచి చేపలు వెళ్తున్నట్టు, పక్కనుంచి తమతోపాటు ప్రయాణిస్తున్నట్టు ఉన్న అనుభూతితో మైమరచిపోతున్నారు.
Also Read : Somireddy : ఏపీలో వైసీపీయేతర ప్రభుత్వం, పవన్ కల్యాణ్ కి సోమిరెడ్డి సపోర్ట్
Also Read : అక్టోబర్‌లో తిరుమల వెళ్లాలనే ప్లాన్ ఉందా- ముందు ఈ పని చేయండి