Sarvepalli Constituency: ఉమ్మడి నెల్లూరు జిల్లాలో అటు వైసీపీ, ఇటు కూటమి అన్ని స్థానాలకు అభ్యర్థుల్ని ప్రకటించాయి. ప్రత్యర్థులెవరనే అంచనాలు వేసుకుని అందరు నాయకులు బరిలో దిగారు, ప్రచారం మొదలు పెట్టారు. వీటిలో సర్వేపల్లి నియోజకవర్గం ఒకటే కాస్త ప్రత్యేకత సంతరించుకుంది. 2019లో ఇక్కడ ముఖాముఖి తలపడిన కాకాణి గోవర్దన్ రెడ్డి, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మరోసారి పోటీకి సిద్ధమయ్యారు. ఆ మాటకొస్తే 2014లో కూడా వారే ఆ నియోజకవర్గంలో ప్రత్యర్థులు. ఇలా పాతవారే మళ్లీ ప్రత్యర్థులు కావడం ఈ నియోజకవర్గం ప్రత్యేకత. జిల్లాలోని మిగతా ఏ నియోజకవర్గంలోనూ ఇలాంటి సందర్భం రాలేదు. రాష్ట్రవ్యాప్తంగా కూడా చాలా తక్కువ స్థానాల్లోనే ఇలా పాత ప్రత్యర్థులు రిపీట్ అయ్యారు. అలాంటి వాటిలో సర్వేపల్లి ఒకటి కావడం విశేషం.
మంత్రి పదవుల స్పెషల్..
2014లో వైసీపీ తరపున కాకాణి గోవర్దన్ రెడ్డి సర్వేపల్లి నుంచి గెలిచారు. టీడీపీ అభ్యర్థిగా ఆయన చేతిలో ఓడిపోయిన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి అనూహ్యంగా ఎమ్మెల్సీ అవకాశం లభించింది. ఎమ్మెల్సీగా ఉన్న ఆయనకు వ్యవసాయ శాఖ మంత్రి పదవి ఇచ్చారు చంద్రబాబు. 2019లో మళ్లీ వారిద్దరే పోటీ పడ్డారు. ఈసారి కూడా ఇక్కడ సోమిరెడ్డిపై కాకాణి విజయం సాధించారు. విశేషం ఏంటంటే.. జగన్ రెండో విడతలో కాకాణికి మంత్రి పదవి ఇచ్చారు. ఆయనకు కూడా వ్యవసాయ శాఖ దక్కడం మరో విశేషం. ఇక 2024లో ఎలాంటి ఫలితాలు వస్తాయనేది ఆసక్తిగా మారింది. 2019లో మంత్రి హోదాలో సోమిరెడ్డి పోటీ చేస్తే, 2024లో మంత్రి హోదాలో కాకాణి బరిలో దిగుతున్నారు. ఈసారి ఎవరు గెలిచినా.. అదే పార్టీ అధికారంలోకి వస్తే వారికి మళ్లీ మంత్రి పదవి గ్యారెంటీ అనే ప్రచారం మాత్రం జోరుగా సాగుతోంది.
నెల్లూరులో మిగతా నియోజకవర్గాల్లో ఇలా..
ఇక నెల్లూరు జిల్లాలోని మిగతా నియోజకవర్గాల విషయానికొస్తే.. నెల్లూరు సిటీలో టీడీపీ అభ్యర్థి నారాయణ మళ్లీ తన అదృష్టాన్ని పరీక్షించుకోడానికి సిద్ధపడగా, సిట్టింగ్ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ ని కాదని నెల్లూరు డిప్యూటీ మేయర్ ఖలీల్ ని ఇక్కడ అభ్యర్థిగా ప్రకటించారు సీఎం జగన్. రూరల్ నియోజకవర్గంలో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వైసీపీ నుంచి టీడీపీ వైపు వచ్చి అదే స్థానానికి పోటీ చేస్తున్నారు. ఇక వైసీపీ తరపున ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి పోటీ చేయడం విశేషం. ఇలా ఇక్కడ కూడా ప్రత్యర్థులు కొత్తవారే. కోవూరులో సిట్టింగ్ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి బరిలో దిగగా, టీడీపీ అభ్యర్థిని మార్చింది. వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ఇక్కడ టీడీపీ తరపున పోటీ చేస్తున్నారు. కావలిలో కూడా వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేకి అవకాశం ఇవ్వగా, టీడీపీ మాత్రం అభ్యర్థిని మార్చింది. ఉదయగిరిలో ఇరు పార్టీలు అభ్యర్థుల్ని మార్చేశాయి. ఆత్మకూరులో 2019లో వైసీపీ తరపున మేకపాటి గౌతమ్ రెడ్డి గెలిచి మంత్రి పదవి సాధించారు. ఆయన అకాల మరణంతో ఉప ఎన్నికల్లో ఆయన తమ్ముడు విక్రమ్ రెడ్డి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. టీడీపీ ఇక్కడ ఆనం రామనారాయణ రెడ్డిని బరిలో దింపింది. ఇలా ఇక్కడ ఇద్దరు అభ్యర్థులు కొత్తవారే.
గూడూరులో వైసీపీ ఎమ్మెల్యే బీజేపీలో చేరి తిరుపతి లోక్ సభకు పోటీ చేస్తుండగా.. అక్కడ ఎమ్మెల్సీ మేరిగ మురళిని వైసీపీ తెరపైకి తెచ్చింది. ఆయనకు పోటీగా టీడీపీ నుంచి గతంలో ఓడిపోయిన పాశిం సునీల్ కుమార్ పోటీ చేస్తున్నారు. ఇక్కడ టీడీపీ అభ్యర్థి పాతవారే అయినా, వైసీపీ మాత్రం అభ్యర్థిని మార్చింది. వెంకటగిరిలో రెండు పార్టీల తరపున పోటీ చేస్తున్న ఇద్దరూ కొత్తవారే కావడం విశేషం. సూళ్లూరుపేటలో సిట్టింగ్ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య వైసీపీ తరపున పోటీ చేస్తుండగా, టీడీపీ మాత్రం నెలవల విజయశ్రీకి అవకాశమిచ్చింది.
మొత్తమ్మీద సర్వేపల్లి నియోజకవర్గం మాత్రం సంథింగ్ స్పెషల్ అనిపించుకుంటోంది. పాత ప్రత్యర్థుల మధ్య కొత్తపోరు ఈసారి మరింత ఆసక్తికరంగా సాగే అవకాశముంది. కాకాణి గెలిస్తే.. అదే అభ్యర్థిపై వరుసగా మూడుసార్లు హ్యాట్రిక్ సాధించిన ఘనత ఆయనకు దక్కుతుంది. సోమిరెడ్డి గెలిస్తే మాత్రం వరుస ఓటములకు చెక్ పెట్టిన నాయకుడు అవుతారు.