Andhra Pradesh News: తిరుపతి నియోజకవర్గం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశం అవుతోంది. వైసీపీ నాయకులు చేస్తున్న హడావిడి ఒక వైపు... టీడీపీ, జనసేన నాయకులు లోకల్- నాన్ లోకల్ పోరాటంతో Tirupati Assembly constituency రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి.
42 సంవత్సరాలలో తొలిసారి
తెలుగు ప్రజలకు ఎంతో ఇష్టమైన దివంగత నందమూరి తారక రామారావు (Sr NTR) 1982లో తెలుగు దేశం పార్టీ నుంచి స్థాపించారు. అప్పటి కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా టీడీపీ (TDP) పార్టీ తిరుపతి వేదికగా పురుడు పోసుకుంది. ఆనాడు ఎన్టీఆర్ తిరుపతి నుంచి పోటీ చేసి అత్యధిక మెజార్టీతో గెలుపొందారు. నాటి నుంచి నేటి వరకు సుమారు 42 సంవత్సరాల నుంచి తిరుపతి టీడీపీ కంచుకోటగా ఉంంది. ఈసారి జరగనున్న ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ, జనసేన కలిసి పోటీ చేయడంతో తిరుపతి ఎమ్మెల్యే సీటు జనసేనకు, ఎంపీ సీటు బీజేపీకి కేటాయించారు. దీంతో టీడీపీ పార్టీ పుట్టిన తరువాత తిరుపతిలో తొలిసారి సైకిల్ గుర్తు లేకుండా ఎన్నికలు జరుగుతున్నాయి.
జనసేన పోరాటం...
తిరుపతిలో గత ఐదు సంవత్సరాలుగా టీడీపీ తరపున సుగుణమ్మ, నరసింహ యాదవ్, జనసేన నుంచి కిరణ్ రాయల్, పసుపులేటి హరిప్రసాద్, రాజారెడ్డి ప్రజా సమస్యలపై నిరంతరం ప్రశ్నిస్తూ వచ్చారు. అధికార పార్టీ నుంచి కేసులు ఎదుర్కొని జైలు పాలయ్యారు. ఈ క్రమంలో తిరుపతి సీటు చిత్తూరు ఎమ్మెల్యే (వైసీపీ) నుంచి ఇటీవల జనసేన తీర్థం పుచ్చుకున్న ఆరని శ్రీనివాసులుకు కేటాయించారు. లోకల్ వ్యక్తులకు కాదని నాన్ లోకల్ అంటూ తమ అసంతృప్తి స్వరం వినిపించారు. దీంతో పార్టీ అధిష్టానం జిల్లా నాయకులను పిలిచి సర్దిచెప్పే ప్రయత్నం చేసింది. ఇది జరిగి రెండు రోజులు గడుస్తున్నా, ఇంకా తిరుపతిలో జనసేన నాయకులు శ్రీనివాసులను కలవడం లేదు.
మరో వైపు టీడీపీ నాయకులు లోకల్ వ్యక్తులకు ఇస్తేనే పని చేస్తామని.. లేకపోతే చేయని చెబుతున్నారు. అయితే నారా లోకేష్ ఆరని శ్రీనివాసులతో తిరుమల పర్యటనలో మాట్లాడడంతో సర్దిచెప్పే ప్రయత్నం చేస్తారనే ప్రచారం జరుగుతోంది. మరోవైపు అభ్యర్థి ఆరని శ్రీనివాసులు బీజేపీ నాయకులను కలుస్తూ వస్తున్నారు. జనసేన, టీడీపీ నాయకులు మాత్రం తిరుపతి లాంటి ప్రాంతంలో లోకల్ వ్యక్తికి ఇవ్వాలనే తొలుత చేసిన ప్రచారం జనాల్లోకి బలంగా వెళ్లింది. దానినే ప్రతిపక్షం ఆయుధంగా తీసుకుంది.
వైసీపీ ప్రచారం ప్రారంభం
రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలకు ఇంకా 50 రోజుల గడువు ఉండడంతో అన్ని పార్టీల వారు ఇంకా ప్రచారం లోకి వెళ్లలేదు. కానీ తిరుపతి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి భూమన అభినయ్ రెడ్డి ప్రచారం ప్రారంభించారు. నగరంలోని అన్ని వర్గాల వారిని కలిసి మద్దతు ఇప్పటికే కోరగా.. ప్రచారం ప్రారంభించి ప్రజల్లోకి వెళ్తున్నారు. కూటమి నుంచి నాయకులు కలిసి వెళ్లకపోతే ఆరని శ్రీనివాసుల గెలుపు నల్లేరు మీద నడక అన్న చందంగా తయారయ్యే అవకాశం ఉంది. రాష్ట్ర అధినేతలు పార్టీ బలోపేతం చేసే దిశగా చర్యలు తీసుకోవాలని, స్ధానిక నాయకులతో పని లేకుండా పార్టీ ఆదేశిస్తే ఎవరికైనా పని చేస్తామని పార్టీ క్యాడర్, కార్యకర్తలు అంటున్నారు.