Guntur Politics: రాజకీయంగానూ, వాణిజ్య పరంగానూ ముందంజలో ఉండే గుంటూరు జిల్లాలో ఎన్నికలంటేనే కోట్లతో వ్యవహారం ముడిపడి ఉంటుంది. ప్రధాన పార్టీ నుంచి టిక్కెట్ దక్కాలే గానీ... కోట్లు ఖర్చుపెట్టేందుకు క్యూలో ఉంటారు. అలాంటిది వరుసగా టిక్కెట్లు దక్కించుకుని పోటీలో ఉన్న నేతల ఆస్తుల వివరాలు ఒకసారి చూసేద్దామా...
నారా లోకేశ్ ఆస్తులు
గుంటూరు జిల్లాలోనే కాదు.. రాష్ట్రవ్యాప్తంగా అందరూ ఆతృతగా ఎదురుచూస్తున్న ఫలితం ఏదైనా ఉందంటే అది మంగళగిరి (Mangalagiri) నియోజకవర్గం. ఎందుకంటే ఇక్కడి నుంచి తెలుగుదేశం అధినేత చంద్రబాబు(Chandrababu) తనయుడు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్(Nara Lokesh) రెండోసారి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. గత ఎన్నికల్లో ఓటమిపాలైన ఆయన ఈసారి గెలుపై ధీమాగా ఉన్నారు. ఆర్థికంగా ఆయన్ను ఢీకొట్టే అభ్యర్థి జిల్లాలోనే లేడని చెప్పాలి. ఒకసారి లోకేశ్‌ ఆస్తులు వివరాలు చూద్దాం. మార్కెట్ విలువ ప్రకారం ఆయన ఆస్తులు 373 కోట్లు కాగా.... అప్పులు 10 కోట్లు వరకు ఉన్నాయి. వివిధ బ్యాంకుల్లో బాండ్ల రూపంలో మూడున్నర కోట్లు ఉండగా.... వివిధ కంపెనీల్లో ఉన్న షేర్ల విలువ 255 కోట్లుపైగానే ఉంది. పర్సనల్ లోన్ అడ్వాన్స్‌ మరో ఎనిమిదిన్నర కోట్లు తీసుకున్నారు.


లోకేశ్(Lokesh) పేరిట ఫోర్డ్ ఫియిస్టా, రెండు పార్చునర్ కార్లు ఉన్నాయి. అలాగే బంగారం, వజ్రాభరణాల విలువ దాదాపు 2 కోట్ల రూపాయల వరకు ఉంది. మొత్తంగా ఆయన చరాస్తుల విలువ 271 కోట్లకు పైగానే ఉంది. హైదరాబాద్ మదీనాగూడలో 5 ఎకరాల వ్యవసాయ భూమి ఉండగా...దీని విలువ 47 కోట్లు పైమాటే. హైదరాబాద్‌(Hyderabad)లోని జూబ్లీహిల్స్‌, మాదాపూర్, మణికొండలో ఉన్న స్థలాల విలువ మరో 30 కోట్లు వరకు ఉంది. చెన్నైలో ఐదు కోట్ల విలువైన  కమర్షియల్ బిల్డింగ్ ఉండగా..జూబ్లీహిల్స్‌లో 20 కోట్ల విలువైన ఇల్లు ఉంది. మొత్తం స్థిరాస్తుల విలువ 101 కోట్లు ఉన్నట్లు ఆయన 2019లో ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్‌లో తెలిపారు.  మొత్తం స్థిర, చరాస్తులు కలిపి లోకేశ్ ఆస్తి విలువ 373 కోట్లు ఉంది. అలాగే ఆయన వివిధ బ్యాంకుల నుంచి తీసుకున్న అప్పులు తొమ్మిదిన్నర కోట్లు వరకు ఉన్నాయి. 



టీడీపీ నేతల ఆస్తులు
తెలుగుదేశం సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్ర(Dhulipalla Narendra Kumar )కు ఏడున్నర కోట్ల ఆస్తి ఉండగా.... దాదాపు మూడుకోట్లు వరకు అప్పులు ఉన్నాయి. వివిధ బ్యాంకుల్లో ఉన్న క్యాష్‌, బాండ్లు, డిపాజిట్లు ,కార్లు, బంగారం విలువ కలిపి మొత్తం చరాస్తులు 3 కోట్ల 20 లక్షలకు పైమాటే ఉన్నాయి. గుంటూరు జిల్లాలో వివిధ చోట్ల ఉన్న వ్యవసాయ భూముల విలువ కోటిన్నర వరకు ఉండగా.. గుంటూరులో ఉన్న మూడు ఇల్లు విలువ మరో మూడు కోట్ల వరకు ఉంది. అలాగే వివిధ బ్యాంకుల నుంచి నరేంద్ర తీసుకున్న అప్పుల విలువ సైతం 2.78 కోట్లు వరకు ఉంది.




మాజీమంత్రి నక్కా ఆనందబాబు(Nakka Anand Babu)కు కేవలం కోటీ 86 లక్షల విలువైన ఆస్తులు మాత్రమే ఉండగా... అప్పులు ఏమీ లేవు. మరో సీనియర్ మాజీమంత్రి ప్రత్తిపాటి పుల్లారావు(Prathipati Pullarao)కు 42.5 కోట్ల ఆస్తులు ఉండగా... 25.34 కోట్ల అప్పు ఉంది. బ్యాంకులో క్యాష్, బాండ్లతో పాటు వివిధ సంస్థల్లో షేర్లు కలిపి మొత్తం చరాస్తులు విలువ దాదాపు 40 కోట్లు వరకు ఉంది. వివిధ చోట్ల ఉన్న వ్యవసాయ, వ్యవసాయేతర భూములు విలువ మొత్తం కలిపి మొత్తం మరో మూడుకోట్ల వరకు ఉంది. అలాగే ఆయన వివిధ బ్యాంకుల నుంచి తీసుకున్న అప్పులు 25.34 కోట్లు ఉంది. సుదీర్ఘకాలంగా రాజకీయాల్లో ఉంటున్న మాజీమంత్రి కన్నా లక్ష్మీనారాయణ(Kanna Laxmi Narayana)కు సైతం 40 కోట్ల విలువైన ఆస్తులు... రెండున్నర కోట్ల అప్పు ఉంది. వివిధ బ్యాంకుల్లో ఉన్న బాండ్లు, షేర్లు, అన్నీ కలిపి దాదాపు 3 కోట్ల విలువైన చరాస్తులు ఉన్నాయి. 2 కోట్ల విలువైన వ్యవసాయ భూములు ఉండగా...20 కోట్ల విలువైన ప్లాట్లు ఉన్నాయి. గుంటూరులో ఉన్న ఇళ్ల విలువ మరో 15 కోట్లు ఉంది. వివిధ బ్యాంకుల నుంచి తీసుకున్న అప్పు 2.25 కోట్లు ఉంది.


మరో కీలక నేత వినుకొండ మాజీఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు(G.V.Anajeneyulu) ఆస్తుల విలువ దాదాపు 88 కోట్లు ఉంది. ఆయనకు ఆరుకోట్ల రూపాయల అప్పు ఉంది. బ్యాంకుల్లో బాండ్లు, వివిధ సంస్థల్లో షేర్లు అన్నీ కలిపి  ఆయన చరాస్తులు 25 కోట్లు ఉండగా... పర్సనల్ లోన్లు మరో 17 కోట్లు తీసుకున్నారు. కోటిన్నర బంగారు ఆభరణాలు ఉండగా... మొత్తం చరాస్తుల విలువ 45 కోట్లు వరకు ఉంది. కోటిన్నర విలువైన వ్యవసాయ భూములు, 16 కోట్ల విలువైన ప్లాట్లతోపాటు హైదరాబాద్‌ ఎస్‌ఆర్‌నగర్‌లో 10 కోట్ల విలువైన కమర్షియల్ బిల్డింగ్‌లు ఉన్నాయి. హైదరాబాద్‌, వినుకొండలో మరో 15 కోట్ల విలువైన ఇల్లు ఉన్నాయి. మొత్తం స్థిరాస్తుల విలువ 42 కోట్లు ఉంది. అలాగే వివిధ బ్యాంకుల నుంచి ఆయన తీసుకున్న అప్పు ఆరుకోట్లు ఉంది.


తెలుగుదేశం మరో సీనియర్ నేత యరపతినేని శ్రీనివాసరావు(Yarapathineni Srinivasarao)కు రెండున్నర కోట్లు ఆస్తులు ఉండగా.. అనూహ్యంగా 50 కోట్లు అప్పు ఉంది. బ్యాంకు బ్యాలెన్స్‌, భూములు, ప్లాట్లు అన్నీ కలిపి రెండున్నర కోట్లు ఆస్తి ఉంది. గుంటూరు సిండికేట్ బ్యాంకులో ఆయన భార్యతో కలిపి తీసుకున్న అప్పు 49 కోట్లు ఉంది.  


వైసీపీ అభ్యర్థులేమీ తక్కువ కాదు
మంత్రి విడదల రజని(Vidadhala Rajini)కి దాదాపు 130 కోట్ల విలువైన ఆస్తి ఉండగా... అప్పులేమీ లేవు. వివిధ బ్యాంకుల్లో ఉన్న డిపాజిట్లు ఐదుకోట్లు వరకు ఉండగా.. ఎల్‌ఐసీ ఇన్స్‌రెన్స్‌ పాలసీలు మరో ఐదుకోట్లు ఉన్నాయి. మొత్తం ఆరున్నర కోట్ల చరాస్తులు ఉండగా... వ్యవసాయ భూములు, ప్లాట్లు, కార్లు ఏమీ ఆమె పేరిట లేవు. కోటిన్నర విలువ చేసే ఒక కమర్షియల్ బిల్డింగ్ ఉంది. అయితే అమెరికాలో ఆమె పేరిట ఉన్న సాప్ట్‌వేర్ సంస్థ విలువే 120 కోట్లు ఉంది. ఇండియాలో ఆమె పేరిట ఎలాంటి అప్పులు లేవు.



మాజీ హోంమంత్రి మేకతోటి సుచరిత(Sucharitha) పేరిట రెండున్నర కోట్ల విలువైన ఆస్తులు ఉండగా... 27 లక్షల అప్పులు ఉన్నాయి.
బ్యాంకులో డిపాజిట్లు, పర్సనల్‌ లోన్లు, బంగారు ఆభరణాలు కలిపి 73 లక్షల  ఆస్తి ఉంది. మరో కోటిన్నర విలువైన ప్లాట్లు,ఇల్లు  ఆమె పేరిట ఉన్నాయి.


మంత్రి అంబటి రాంబాబు(Ambati Rambabu) పేరిట 15 కోట్ల విలువైన ఆస్తులు, కోటీ 20 లక్షల విలువైన అప్పులు ఉన్నాయి. బ్యాంకులో డిపాజిట్లు, పర్సనల్ లోన్లు, కార్లు, బంగారు ఆభరణాలు అన్నీ కలిపి చరాస్తులు రెండుకోట్లు ఉండగా.... అవనిగడ్డ, సూరంపల్లిలో ఉన్న వ్యవసాయ భూముల విలువ దాదాపు 6 కోట్లు ఉంది. మరో కోటి రూపాయల విలువైన ప్లాట్లు ఉండగా... గుంటూరు, హైదరాబాద్‌లో కలిపి మరో ఆరుకోట్ల విలువైన కమర్షియల్ బిల్డింగ్‌లు ఉన్నాయి. ఇల్లుతో కలిపి మొత్తం స్థిరాస్తి విలువ 13 కోట్ల 20 లక్షలు ఉంది. వివిధ బ్యాంకుల నుంచి ఆయన తీసుకున్న అప్పు కోటీ 20 లక్షలు ఉంది.



ఉపసభాపతి కోనరఘుపతి(Kona Raghupathi)కి 28 కోట్ల విలువైన ఆస్తులు ఉండగా... 83 లక్షల అప్పు ఉంది. బ్యాంకులో డిపాజిట్లు, బాండ్లు కలిపి రెండున్నర కోట్ల ఆస్తి ఉండగా... వ్యవసాయ భూమి ఏమీ లేదు. బాపట్లలో ఒక ప్లాట్ ఉంది. అలాగే హైదరాబాద్ ఉప్పల్‌లో రెండు కమర్షియల్ బిల్డింగ్‌లు, బాపట్లలో ఒక కమర్షియల్ బిల్డింగ్ ఉంది. వీటి విలువ దాదాపు 18 కోట్ల పైమాటే. హైదరాబాద్, బాపట్లలో ఉన్న ఇళ్ల విలువ మరో 7 కోట్ల వరకు ఉంది. మొత్తం స్థిర ఆస్తుల విలువ 25 కోట్ల 72 లక్షలు ఉంది. వివిధ బ్యాంకుల నుంచి తీసుకున్న అప్పు 83 లక్షలుగా ఉంది.


గుంటూరు జిల్లాలో మరో కీలక నేత, మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి(Pinnelli Ramakrishna Reddy)కి ఆరున్నర కోట్ల ఆస్తులు ఉండగా... మూడున్నర కోట్ల అప్పు ఉంది. జనసేన కీలక నేత నాదెండ్ల మనోహర్ పేరిట 11 కోట్ల ఆస్తులు ఉండగా... అప్పులు ఏమీ లేవు. బ్యాంకు డిపాజిట్లు, బాండ్లు, కార్లు అన్నీ కలిపి నాలుగున్నర కోట్ల ఆస్తులు ఉండగా... నాలుగు కోట్ల విలువైన వ్యవసాయ భూమి ఉంది. మరో మూడు కోట్ల రూపాయల ఇల్లు ఉన్నాయి.