భారత దేశం వ్యాక్సినేషన్ లో 100కోట్ల మార్కు దాటింది. అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో కలిపి 100కోట్ల వ్యాక్సిన్ డోసుల్ని ప్రభుత్వం పంపిణీ చేసింది. ఈ సందర్భంగా వివిధ రాష్ట్రాల్లో మంచి ఫలితాలు నమోదు చేసిన జిల్లాలను కేంద్రం గుర్తించింది. ఏపీ నుంచి ఆ అరుదైన ఘనతను నెల్లూరు జిల్లా సొంతం చేసుకుంది. ఏపీలో అత్యథిక టీకా డోసులు పంపిణీ చేసిన జిల్లాగా నెల్లూరు ఘనత సాధించింది. నూరు శాతానికి పైగా నెల్లూరు జిల్లాలో తొలిడోసు టీకాల పంపిణీ పూర్తి కావడం విశేషం. 2011 జనాభా లెక్కల ప్రకారం జిల్లా జనాభాలో 18 సంవత్సరాల పైబడిన వయోజనుల సంఖ్యను మించి టీకా పంపిణీ పూర్తి కావడంతో 103.3 శాతం టీకాలు పంపిణీ అయినట్టు తేలింది. 


దేశవ్యాప్తంగా జనవరి 16న వ్యాక్సినేషన్ ప్రక్రియ మొదలు కాగా.. నెల్లూరు జిల్లాలో కూడా తొలుత హెల్త్ కేర్, ఫ్రంట్ లైన్ వర్కర్లకు టీకా పంపిణీ మొదలు పెట్టారు. 2011 జనాభా లెక్కల ప్రకారం జిల్లాలో వయోజనుల సంఖ్య 19,57,426 కాగా.. ఇప్పటి వరకూ 20,16,778మందికి తొలిడోసు టీకా పంపిణీ చేశారు. దీంతో టీకా పంపిణీ శాతం 103.3కి చేరుకుంది. సెకండ్ డోస్ లో కూడా నెల్లూరు జిల్లా రికార్డు స్థాయి సంఖ్యను చేరుకుంది. ఇప్పటి వరకూ 12,62,338మందికి రెండో డోసు వేశారు జిల్లా అధికారులు. జిల్లాలో ఆరు సార్లు స్పెషల్ వ్యాక్సినేషన్ డ్రైవ్ లు నిర్వహించారు. 


నెల్లూరు జిల్లాలోని 14 సచివాలయాల పరిధిలో వయోజనులకు నూటికి నూరుశాతం వ్యాక్సినేషన్ గతంలోనే పూర్తయింది. దీంతో ఆయా సచివాలయాల అధికారులను కలెక్టర్ చక్రధర్ బాబు సన్మానించారు. ఆరోగ్య సిబ్బంది చొరవతోపాటు, రెవెన్యూ సిబ్బంది ప్రచారం, సమన్వయం వల్లే ఈ ఘనత సాధించినట్టు చెబుతున్నారు ఉన్నతాధికారులు. సచివాలయ వ్యవస్థను పూర్తిగా ఉపయోగించుకోవడం వల్ల అనుకున్న లక్ష్యాన్ని ముందుగానే సాధించామని చెబుతున్నారు అదికారులు. అంతే కాకుండా వలస వెళ్తున్న వారిని  కూడా గుర్తించి శని, ఆదివారాల్లో అలాంటి వారందరికోసం ప్రత్యేకంగా వ్యాక్సినేషన్ డ్రైవ్ చేపట్టినట్టు తెలిపారు. 


నెల్లూరు జిల్లాలో పంపిణీ చేసిన వ్యాక్సిన్ డోసుల వివరాలు.. 
పంపిణీ అయిన మొత్తం డోసులు: 32,79,116
ఫస్ట్ డోస్: 20,16,778
సెకండ్ డోస్: 12,62,338
18నుంచి 44ఏళ్ల లోపు:  15,00,195
45 - 60ఏళ్లలోపు:  12,10,010
పురుషులు: 15,41,350
స్త్రీలు: 17,36,970


Also Read: Congress: 100 కోట్ల డోసులా..సెప్టెంబర్‌లోనే చైనా 200 కోట్లు క్రాస్ చేసింది: కాంగ్రెస్


Also Read: PM Modi Speech Highlights: వ్యాక్సినేషన్‌లో భారత్ 100 కోట్ల మార్క్.. ప్రపంచ దేశాలు షాక్: మోదీ


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి