రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులు ఆందోళనలు చేస్తున్నారు. ప్రభుత్వం ప్రొబేషన్ డిక్లేర్ చేయకపోవడంతో గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులు నిరసనలు చేస్తున్నారు. ఇప్పటికే 3 నెలలు తమ ప్రొబేషన్ వెనక్కిపోయిందని, ప్రభుత్వం మరో 6 నెలలు పొడిగించేందుకు ప్రయత్నిస్తోందని అంటున్నారు. తమకు న్యాయం చేయాలంటూ ఆందోళనబాటపట్టారు. తాజాగా సచివాలయాల ఉద్యోగులను ఉద్దేశించి నెల్లూరు జిల్లా వ్యవసాయశాఖ జేడీ సంచలన ఆరోపణలు చేశారు. సచివాలయ ఉద్యోగాలు తాత్కాలికం అని, ఏ రోజైనా తీసేయొచ్చన్నారు. ఇంకా కాలేజీ సూడెంట్స్ మాదిరి ఆవేశంతో ఆందోళనలకు దిగడం సరికాదన్నారు. 


Also Read: తగ్గేదే లే... జీతాలపెంపు కోసం రోడ్డెక్కిన సచివాలయ ఉద్యోగులు..


ఇంకా కాలేజీ స్టూడెంట్స్ అనుకుంటున్నారా?


నెల్లూరు జిల్లా కోవూరు పశుసంవర్ధక శాఖ కార్యాలయంలో కృత్రిమ గర్భధారణ పరికరాల పంపిణీ కార్యక్రమం జరిగింది. దీనిపై ఒకరోజు శిక్షణా కార్యక్రమం కూడా నిర్వహించారు. అయితే ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ జేడీ మహేశ్వరుడు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. సచివాలయ వెటర్నరీ అసిస్టెంట్ లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వారిని ఉద్దేశించి జిల్లా వ్యవసాయ శాఖ జేడీ సంచలన వ్యాఖ్యలు చేశారు. సచివాలయ ఉద్యోగుల నిరసనలో మీరెందుకు పాల్గొన్నారంటూ ప్రశ్నించారు. మీరు టెంపరరీ ఎంప్లాయిస్.. ఏరోజైనా తీసేయొచ్చు. అసలు మిమ్మల్ని ధర్నాలో ఎవరు పాల్గొనమన్నారు అని ప్రశ్నించారు. నాలుగేళ్లుగా తాము పీఆర్సీ కోసం వేచి చూశామని, ఆరు నెలలు ప్రొబేషన్ ఆలస్యమైతే అంత గొడవ ఎందుకని అడిగారు. ప్రొబేషన్ డిక్లేర్ చేసినా కూడా అక్టోబర్ నుంచే జీతాలు పెంచి ఇచ్చే అవకాశం ఉంది కదా, ఎందుకు అర్థం చేసుకోరు అంటూ క్లాస్ తీసుకున్నారు. ఇంకా కాలేజీలోనే ఉన్నట్టు ప్రవర్తించడం సరికాదని హితవు పలికారు. 


Also Read: మరో లేఖాస్త్రం సంధించిన ముద్రగడ... ఈసారి వాళ్లకు స్ట్రాంగ్ కౌంటర్...


మీరే నష్టపోతారు : అజయ్ జైన్


గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులందరూ ఎలాంటి నిరసనలు చేపట్టకుండా వెంటనే విధులకు హాజరు కావాలని గ్రామ, వార్డు సచివాలయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్‌ జైన్‌ చెప్పారు. నెల్లూరు జిల్లా కలెక్టరేట్ లో హౌసింగ్ డిపార్ట్ మెంట్ పై సమీక్ష నిర్వహించిన ఆయనకు.. సచివాలయ ఉద్యోగులు తమ సమస్యలు చెప్పుకున్నారు. ఈ క్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. పదకొండు శాఖలతో అనుబంధం కలిగిన విభాగాలు ఉన్నందున ప్రొబేషన్ డిక్లరేషన్ ప్రక్రియ కాస్త ఆలస్యమైందని ఆయన చెప్పారు. రాష్ట్రంలో అన్ని అర్హతలు కలిగిన వారు 60 వేల మంది ఉన్నట్లు ఇప్పటికే గుర్తించామని, మిగతావారు కూడా అర్హత సాధించిన వెంటనే ప్రొబేషన్ డిక్లేర్ చేస్తామన్నారు. ఇబ్బందులు తలెత్తుతాయని సచివాలయ ఉద్యోగులు భావించాల్సిన అవసరం లేదన్నారు. కొందరు ఉద్దేశపూర్వకంగా సచివాలయ ఉద్యోగులను రెచ్చ గొడుతున్నారని, అపోహలు సృష్టించాలని చూస్తున్నారని, వారి మాటలను నమ్మి మోసపోవద్దని హితవు పలికారు.


Also Read: రాష్ట్రంలో నైట్ కర్ఫ్యూ వాయిదా.... ఈ నెల 18 నుంచి కర్ఫ్యూ అమలు... ఆంక్షల ఉత్తర్వుల్లో సవరణ చేసిన ప్రభుత్వం


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి