Atmakur Bypoll : నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఉప ఎన్నికల్లో వైసీపీ ఘన విజయం సాధిస్తుందని మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కాకాణి గోవర్ధన్ రెడ్డి స్పష్టం చేశారు. ఎన్నికల ప్రచారం చివరి రోజున మంత్రులు ఆత్మకూరులో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఆత్మకూరులో వైఎస్సార్సీపీ అభ్యర్థి విక్రమ్ రెడ్డి ఘనవిజయం సాధించబోతున్నారని ధీమా వ్యక్తం చేశారు. 95 శాతం హామీలను సీఎం వైఎస్ జగన్ అమలు చేయటంతో జనం సంతోషంగా ఉన్నారని అన్నారు. పార్టీలకతీతంగా ముఖ్యమంత్రిని ప్రజలు అభిమానిస్తున్నారని చెప్పారు. మేకపాటి గౌతం రెడ్డి పట్ల ఆత్మకూరు వాసులకు అపారమైన గౌరవం ఉందన్నారు. విక్రమ్ రెడ్డికి భారీ మెజారిటీ ఇచ్చి గౌతం రెడ్డికి నివాళులు అర్పించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. బీజేపీ పరువు కాపాడుకొనేందుకు పోరాడుతోందన్నారు. అసత్య ఆరోపణలతో లబ్ది ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. కమలనాథులకు మరోసారి భంగపాటు తప్పదన్నారు మంత్రులు.
గెలుపు ఏకపక్షమే
సీఎం జగన్ ఆత్మకూరు ప్రజలకు ఓ లేఖ రాశారు. వైసీపీ ప్రభుత్వం ఏం చేసిందో స్పష్టం చేశారు. మేం ఏంచేశామో ప్రజలకు చెప్పగలం. కానీ బీజేపీ అలా చెప్పలేక నెగిటివ్ గా వెళ్తుంది. వైసీపీ ప్రభుత్వం రూ. 1.43 లక్షల కోట్లు సంక్షేమ పథకాల ద్వారా అందించాం. రాష్ట్రంలో ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారు. సచివాలయ, వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చారు. వీటి ద్వారా ప్రజలకు నేరుగా సేవలు అందుతున్నాయి. వైసీపీ ప్రభుత్వం సామాజిక న్యాయాన్ని అమలు చేస్తుంది. అన్ని వ్యవస్థల్లో సామాజిక న్యాయం పాటించిన ఏకైన ప్రభుత్వం వైసీపీ. ఆత్మకూరులో వైసీపీ గెలుపు ఏకపక్షమే- కాకాణి గోవర్ధన్ రెడ్డి, రాష్ట్ర మంత్రి
వైసీపీ ఘనవిజయం
ఆత్మకూరు ఉపఎన్నికలో వైసీపీ ఘనవిజయం సాధిస్తుంది. దీనికి రెండు కారణాలు ఉన్నాయి. గౌతంరెడ్డి అకాల మరణం విచారకరం. అయితే గౌతంరెడ్డి కుటుంబంలోనే వ్యక్తినే ఎన్నికల్లో నిలబెట్టారు. రాష్ట్రం ఆర్థిక పరంగా ఎన్నో ఒడిదొడుకులను ఎదుర్కొంటుంది. ఎన్నడూ లేనంతగా కరోనా వల్ల ఆర్థికంగా ఇబ్బందులు వచ్చాయి. అయినా క్యాలెండర్ ప్రకారం సంక్షేమ పథకాలు అమలు చేసిన వ్యక్తి సీఎం జగన్. ఆయనపై అభిమానంతో ప్రజలు వైసీపీని భారీ మెజారిటీతో గెలిపిస్తారన్నారు. - పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రాష్ట్ర మంత్రి
Also Read : Atmakur YSRCP Tension : పోటీ లేని ఆత్మకూరులోనూ సర్వశక్తులు ఒడ్డుతున్న వైఎస్ఆర్‌సీపీ ! మెజార్టీ కోసమేనా ?
Also Read : Atmakur Bypoll : వైసీపీ నైతికంగా ఓడిపోయింది, ఓటర్లను వాలంటీర్లు ప్రలోభపెడుతున్నారు - సోము వీర్రాజు