Atmakur YSRCP Tension :  నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఉపఎన్నికల్లో వైఎస్ఆర్‌సీపీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని భారతీయ జనతా పార్టీ ఆరోపిస్తోంది. వైఎస్ఆర్‌సీపీ నేతలు డబ్బులు పంచుతున్న వీడియోలను విడుదల చేస్తున్నారు. వాలంటీర్ల సాయంతో అక్రమాలకు పాల్పడుతున్నారని అంటున్నారు. బీజేపీ ఏపీ అగ్రనేతలు ఈసీకి కూడా ఫిర్యాదు చేశారు. అయితే ఏ మాత్రం పోటీ లేని సునాయాసంగా గెలిచేస్తారని అనుకుంటున్న ఆత్మకూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్‌సీపీ ఎందుకు ఇంత టెన్షన్ పడుతోందనేది చాలా మందికి అర్థం కాని విషయంగా మారింది. లక్ష ఓట్ల మెజార్టీ లక్ష్యంగా పెట్టుకునే సాధారణ ఎన్నికల స్థాయిలో సన్నాహాలు చేయడం ఆత్మకూరు ఓటర్లను కూడా ఆశ్చర్య పరుస్తోంది. ఈ ప్రయత్నాల వల్ల మొత్తానికే ఏదోతేడాగా ఉందని అందుకే ఇంత కంగారు పడుతున్నారన్న అభిప్రాయం ప్రజల్లో బలపడేలా చేస్తోంది. 


ఆత్మకూరుకు ఏడుగురు మంత్రులు..  పధ్నాలుగు మంది ఎమ్మెల్యేలు !


టీడీపీ, జనసేన పోటీ నుంచి తప్పుకున్నాయి. బీజేపీ అభ్యర్థి బరిలో ఉన్నారు. బీజేపీకి కూడా స్థానికంగా అభ్యర్థి లభించకపోవడంతో నెల్లూరు సిటీకి చెందిన వ్యక్తికి టిక్కెట్ ఇచ్చారు. అయినప్పటికీ వైఎస్ఆర్‌సీపీ సీరియస్‌గా తీసుకుంది. నియోజకవర్గంలోని ఆరు మండలాలకు ఏడుగురు మంత్రులను ఇంచార్జులుగా నియమించారు. మేరుగ నాగార్జున, జోగి రమేష్, అంజాద్ బాషా, కారుమూరి నాగేశ్వరరావు, రోజా, చెల్లుబోయిన వేణుగోపాల్, నారాయణ స్వామి ఇన్చార్జులుగా మండలాల్లో ప్రచారం చేస్తున్నారు.   మంత్రులే కాదు.. మంత్రులకు తోడుగా ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. ఒక్కో మండలానికి ఇద్దరు, ముగ్గురు ఎమ్మెల్యేలను ఇంచార్జులుగా పెట్టారు. కొడాలి నాని, అనిల్ కుమార్ యాదవ్ వంటి మాజీ మంత్రులకూ బాధ్యతలిచ్చారు.  అయితే వారంతా క్షేత్ర స్థాయిలోకి వెళ్లి పార్టీ కోసం పని చేస్తున్నారు. వీరందరి హడావుడి చూసి ఆత్మకూరు నియోజకవర్గ ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. 


పోటీ లేదు...పైగా సానుభూతి.. అయినా ప్రలోభాలు !


ఆత్మకూరు నియోజకవర్గ పరంగా చూస్తే దాదాపుగా పోటీ లేనట్లే. బీజేపీకి అక్కడ సంస్థాగతంగా బలం..బలగం లేదు. కానీ మేకపాటి కుటుంబానికి గ్రామ గ్రామాన అనుచరవర్గం ఉంది. పైగా గౌతంరెడ్డి చనిపోయిన సానుభూతి ఉంది. నామినేషన్ వేసి ప్రచారం చేయకపోయినా విక్రమ్ రెడ్డి మంచి మెజార్టీతో గెలుస్తారు. కానీ వైఎస్ఆర్‌సీపీ నేతలు అలా అనుకోవడం లేదు. చివరికి డబ్బు పంపిణీ కూడా చేస్తున్నారు. ఈ వీడియోలు వైరల్ కావడంతో వైఎస్ఆర్‌సీపీకి ఇబ్బందిక పరిస్థితులు ఏర్పడ్డాయి. ప్రజావ్యతిరేకత తీవ్రంగా ఉందని అందుకే ప్రలోభాలకు సైతం గురి చేస్తున్నారని అంటున్నారు. 


నిరాసక్తంగా వైఎస్ఆర్‌సీపీ ఓటర్లు !


వైఎస్ఆర్‌సీపీ ఓటర్లు కూడా పోలింగ్ పట్ల అంత ఆసక్తిగా లేరు. ఎలా చూసినా విక్రమ్ రెడ్డే గెలుస్తారు కాబట్టి ఓటు వేసేదేముందిన్న అభిప్రాయానికి వస్తున్నారు. ఇలాంటి వారిని పోలింగ్ కేంద్రాల వద్దకు తెస్తేనే తాము అనుకున్నట్లుగా మెజార్టీ వస్తుందని వైఎస్ఆర్‌సీపీ వర్గాలు భావిస్తున్నాయి. అదే సమయంలో  ఎక్కడ చూసినా వైసీపీ నేతల మధ్య సఖ్యత లేదు. ఒక్కో గ్రామంలో మూడు, నాలుగు గ్రూపులున్నాయి. గ్రూపులన్నీ కలసి పనిచేయాలని పార్టీ గెలుపుకోసం కృషి చేయాలని చెప్పడానికే వారు ప్రాధాన్యం ఇస్తున్నారు. అయితే ఆ గ్రూపులు రకరకాల కోరికలు కోరుతున్నాయి. గ్రూపుల్లో ఎవరి రాజకీయాలు వారివే, ఎవరి నామినేటెడ్ పోస్టులు వారివే. పార్టీపై పెత్తనం ఒకరిదైతే, ఎంపీపీ మరొకరు. ఇలా ఎవరికి వారు తమ గ్రూపుల్ని మెయింటెన్ చేస్తున్నారు. ఏ వర్గానికి మేకపాటి మద్దతు ఉంటుందో వారు తప్ప ఇతరులు ఓటు వేసే పరిస్థితి లేదన్న వాదన వినిపిస్తోంది. 


లక్ష ఓట్ల మెజార్టీ దాటకపోతే ఏమవుతుంది ?


లక్ష ఓట్ల మెజార్టీని టార్గెట్ పెట్టుకున్నామని అందుకే వైఎస్ఆర్‌సీపీ నేతలు అన్నిరకాల ప్రయత్నాలు చేస్తున్నారని అంటున్నారు. అయితే లక్ష ఓట్లతో గెలిచినా.. వెయ్యి ఓట్లతో గెలిచినా అదే గెలుపు. కానీ ప్రభుత్వంపై వ్యతిరేకత లేదని చెప్పుకోవడానికి మెజార్టీ ఉపయోగపడుతుందని ఆ పార్టీ వర్గాలు కష్టపడుతున్నట్లుగా తెలుస్తోంది. అయితే పోటీ లేని ఎన్నికలో ఎంత మెజార్టీ వస్తే మాత్రం అది ప్రజావ్యతిరేకత లేదనడానికి ఎలా ఉదాహరణ అవుతుందన్న ప్రశ్నలు ఇతర పార్టీల నుంచి వస్తున్నాయి. మొత్తానికి ఆత్మకూరులో వైఎస్ఆర్‌సీపీ ప్రయత్నాలు మాత్రం ఆశ్చర్యకరంగా మారాయి.