CM Jagan : నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఉప ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి మేకపాటి విక్రమ్ రెడ్డి ఘన విజయం సాధించారు. వైసీపీ విజయం సాధించడంపై సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ట్వీట్ చేశారు. ప్రభుత్వం చేసిన మంచికి మద్దతుగా, మాజీ మంత్రి గౌతమ్‌ రెడ్డికి నివాళిగా ప్రజలు 83 వేల ఓట్ల మెజారిటీ ఇచ్చారని సీఎం జగన్ అన్నారు. విక్రమ్‌ రెడ్డిని గెలిపించిన ప్రతి ఒక్కరికీ సీఎం జగన్‌ ధన్యవాదాలు తెలిపారు. మంచి చేస్తున్న ప్రభుత్వానికి దేవుని చల్లని దీవెనలు, మీ అందరి ఆశీస్సులే శ్రీరామ రక్ష అంటూ సీఎం జగన్‌ ట్వీట్ చేశారు.






మేకపాటి విక్రమ్ రెడ్డి ఘన విజయం 


ఆత్మకూరు ఉప ఎన్నికలో వైఎస్ఆర్ సీపీ అభ్యర్థి మేకపాటి విక్రమ్‌ రెడ్డి ఘన విజయం సాధించారు. బీజేపీ అభ్యర్థిపై 82,888 ఓట్ల ఆధిక్యంతో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి గెలిచారు. పోస్టల్‌ బ్యాలెట్‌ సహా 20 రౌండ్లు పూర్తయ్యేసరికి 82,888 ఓట్ల ఆధిక్యంతో ఆయన గెలిచారు. సమీప ప్రత్యర్థి అయిన బీజేపీ అభ్యర్థి భరత్‌ కుమార్‌ డిపాజిట్‌ కోల్పోయారు. మేకపాటి విక్రమ్‌ రెడ్డికి 1,02,240 ఓట్లు రాగా బీజేపీ అభ్యర్థి భరత్‌ కుమార్‌కు 19,352 ఓట్లు వచ్చాయి. మొదటి రౌండ్ నుంచి మేకపాటి విక్రమ్‌ రెడ్డి ఆధిక్యంలోనే కొనసాగారు. ప్రధాన ప్రతిపక్షం ఏదీ బరిలో లేకపోవడంతో ఆయన గెలుపు సునాయసం అయింది. ప్రతి రౌండ్ కి మేకపాటి భారీ ఆధిక్యంలోకి దూసుకెళ్లారు. పోటీలో నిలిచిన మరే ఇతర పార్టీ అభ్యర్థి కూడా విక్రమ్‌ రెడ్డికి కనీస పోటీ కూడా ఇవ్వలేకపోయారు. పోస్టల్‌ బాలెట్‌లో 205 ఓట్లకు గానూ వైఎస్సార్‌ సీపీకి 167 ఓట్లు వచ్చాయి. దీంతో, బ్యాలెట్‌ ఓట్లలోనూ వైఎస్సార్‌ సీపీ భారీ ఆధిక్యం కనబర్చింది.


గౌతమ్ రెడ్డి హఠాన్మరణం  


రాష్ట్ర పరిశ్రమ శాఖ మంత్రిగా ఉన్న మేకపాటి గౌతమ్‌ రెడ్డి గుండెపోటుతో హఠాత్తుగా చనిపోవడంతో ఆత్మకూరుకు ఉపఎన్నికలు వచ్చాయి. వైఎస్సార్‌ సీపీ అభ్యర్థిగా మేకపాటి గౌతమ్ రెడ్డి సోదరుడు అయిన మేకపాటి విక్రమ్‌ రెడ్డినే నిలబెట్టారు. చనిపోయిన వ్యక్తి కుటుంబం నుంచి వ్యక్తిని నిలబెడితే తాము పోటీ నుంచి దూరంగా ఉంటామనే సెంటిమెంట్‌తో టీడీపీ దూరంగా ఈ ఉప ఎన్నికకు దూరంగా ఉంది. దీంతో వైఎస్ఆర్ సీపీ అభ్యర్థి గెలుపు అనేది చాలా సులభం అయింది. విజయం పూర్తిగా ఏకపక్షం అయిపోయింది. ఇక బీజేపీ నుంచి భరత్‌ కుమార్‌ యాదవ్‌ సహా మొత్తం 14 మంది అభ్యర్థులు ఈ ఉప ఎన్నికలో పోటీ చేశారు.