Nellore arogya Idly : దోశల్లో రకరకాలు ఉంటాయి. సాదా దోశ, రవ్వదోశ, మసాలా దోశ, కారం దోశ, నెయ్యి దోశ, ఇలా చాలా రకాలుంటాయి. కానీ ఇడ్లీలో రకాలు మీరెప్పుడైనా చూశారా, పోనీ విన్నారా ? అసలు ఇడ్లీలో ఎన్నిరకాలుంటాయో తెలియాలంటే మాత్రం నెల్లూరు రావాల్సిందే. నెల్లూరులోని ఆరోగ్య ఇడ్లీస్ హోటల్ కి వెళ్లాల్సిందే.
8 రకాల ఇడ్లీలు
ఇడ్లీ చాలా డెడ్లీ టిఫిన్ అని పెదవి విరుస్తారు చాలా మంది. కానీ ఆరోగ్యం అనే కాన్సెప్ట్ ని మిక్స్ చేసి ఇడ్లీ తయారు చేస్తే కచ్చితంగా అందరికీ నోరూరుతుంది. ఇలాంటి ఇడ్లీనే ఇప్పుడు నెల్లూరులో అందుబాటులో ఉంది. నెల్లూరు నగరంలోని చిల్డ్రన్స్ పార్క్ సెంటర్లో ఆరోగ్య ఇడ్లీస్ పేరుతో ఓ హోటల్ ఉంది. అందులో 8 రకాల ఇడ్లీలు అందుబాటులో ఉంటాయి. ప్లెయిన్ ఇడ్లీ, రాగి ఇడ్లీ, జొన్న ఇడ్లీ, నవధాన్యాల ఇడ్లీ, నల్లబియ్యం ఇడ్లీ.. ఇలా దాదాపు 8 రకాల ఇడ్లీ తయారు చేస్తుంటారు.
ఇడ్లీ లేబరేటరీ
కరోనా తర్వాత ప్రజల్లో ఆరోగ్యంపై శ్రద్ధ పెరగడం వల్లే తనకు ఈ ఆలోచన వచ్చిందని చెబుతున్నాడు హోటల్ నిర్వాహకుడు భరత్. నల్లబియ్యం ఇడ్లీ డయాబెటిక్ రోగులకు ఉపయోగపడుతుందని, రాగి ఇడ్లీతో బోన్ డెన్సిటీ పెరుగుతుందని, పిల్లలు వెజిటబుల్ ఇడ్లీని ఇష్టపడతారని చెబుతున్నారు. యూత్ కోసం ఇదే వెరైటీలతో దోశలు కూడా వేస్తున్నామని చెబుతున్నారు. రాగి దోశ, జొన్నదోశ, ఇలా రకరకాల ఎక్స్పెర్మెంట్లు చేస్తున్నారు భరత్. ముందుగా ఇంటిలో ఈ ప్రయోగాలు చేసి, ఆ తర్వాత హోటల్ లో దాన్ని అమలు చేస్తున్నారట. అంటే ఒక రకంగా ఇది ఇడ్లీ లేబరేటరీ అని చెప్పొచ్చు.
ధర తక్కువే!
వెరైటీ ఇడ్లీ అయినా కూడా దాని రేటు 15 రూపాయలు మాత్రమే తీసుకుంటున్నారు. దాదాపుగా వచ్చిన కస్టమర్లే తిరిగి రిపీట్ అవుతుంటారని, ఒకసారి అలవాటు పడితే కచ్చితంగా తిరిగి తమ వద్దకే వస్తుంటారని చెబుతున్నారు. ఇడ్లీలోకి పల్లీ చట్నీ, అల్లం చట్నీ, టమోటా చట్నీ, మినీ ఇడ్లీలో నెయ్యి వేసి ఇస్తారు. జొమాటో, స్విగ్గీ నుంచి కూడా ఆర్డర్లు వస్తుంటాయి. అసలు ఇడ్లీలో ఇన్ని రకాలుంటాయా అని ఆశ్చర్యపోకండి. ఇదేదో వెరైటీకోసం చేసిన ప్రయత్నం కాదు, ప్రతి నిత్యం అన్ని రకాల ఇడ్లీలు ఇక్కడ అందుబాటులో ఉంటాయి. వాటితో ఆరోగ్యం ఎలా మెరుగుపరుచుకోవాలో చెబుతున్నారు హోటల్ నిర్వాహకులు. పోనీ రెసిపీ తెలుసుకుని మీరే ఇంట్లో తయారు చేసుకోవాలనుకుంటున్నారా..? దానికైనా ఈ హోటల్ కి ఓసారి వచ్చి వెళ్లాల్సిందే.