Kakinada News : కాకినాడ జిల్లా తాళ్లరేవు కేశవపురం పోస్ట్ మాస్టర్ సుబ్రహ్మణ్యం ఘరానా మోసానికి పాల్పడ్డాడు. గ్రామస్తులు కూలి పనులు చేసుకుని కూడబెట్టుకుని పోస్ట్ ఆఫీస్ లో డిపాజిట్ చేసుకున్నారు. ఈ డిపాజిట్ నగదు లక్షల రూపాయలతో పోస్ట్ మాస్టర్ ఉడాయించాడు. విషయం తెలుసుకున్న బాధితులు కేశవపురం పోస్ట్ ఆఫీస్ కు చేరుకుని లబోదిబో మంటున్నారు. 


అసలేం జరిగింది?  


కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళ్లరేవు మండల పరిధిలోని కేశవపురం పోస్టాఫీసులో పనిచేస్తున్న పోస్టుమాస్టర్ సీహెచ్ సుబ్రహ్మణ్యం నాలుగు రోజులుగా కనిపించకుండా పోవడంతో ఖాతాదారులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. రెక్కలు ముక్కలు చేసుకుని సంపాదించిన సొమ్ము పోస్టాఫీసులో దాచుకున్నారు గ్రామస్తులు. పోస్టుమాస్టర్ ఆ డబ్బుతో పరారీ అయ్యాడని తెలియడంతో బాధితులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. మండల కేంద్రమైన తాళ్లరేవు పంచాయతీలోగల కేశవపురం పోస్టాఫీసులో సుమారు 600 మందికి పైగా ఖాతాదారులు ఉన్నారు. ఎస్బీ అకౌంట్ తో పాటు ఫిక్సిడ్ డిపాజిట్లు, ఆర్పీఎల్ఎస్ఐ, సుకన్య తదితర పథకాల ద్వారా లావాదేవీలు జరుపుతుంటారు. ఈ శాఖ తాళ్లరేవు సబ్ పోస్టాఫీసుకు అనుబంధంగా పనిచేస్తుంటుంది. 


విచారణలో బయటపడ్డ మోసాలు 


అయితే ఇక్కడ పోస్టుమాస్టర్ గా పనిచేస్తున్న సీహెచ్ సుబ్రహ్మణ్యం ఈ నెల 5వ తేదీ నుంచి కార్యాలయానికి రాకపోవడం, తాళాలు వేసి ఉండడంతో సంబంధిత శాఖ అధికారులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో కాకినాడ సౌత్ పోస్టల్ ఇన్స్పెక్టర్ ఎస్.సూర్యప్రకాష్ విచారణ చేపట్టారు. ఈ విచారణలో సుబ్రహ్మణ్యం చేసిన పలు అక్రమాలు బయటపడ్డాయి. నకిలీ ఓచర్లతోపాటు తెల్ల కాగితంపై చేతితో రాసిన బిల్లులు ఉండడాన్ని గుర్తించారు. దీంతో ఖాతాదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పోస్టాఫీసు ఉన్నతాధికారులు స్పందించి ఖాతాదారులకు న్యాయం చేయాలని, తమ సొమ్ముకు భరోసా కల్పించాలని ఖాతాదారులు డిమాండ్ చేస్తున్నారు.


గోల్డ్ లోన్ పేరుతో ఘరానా మోసం


పోస్టాఫీసులో గోల్డ్ లోన్ సౌకర్యం లేదు. అయితే పరారైన పోస్టుమాస్టర్ సుబ్రహ్మణ్యం గోల్డ్ లోన్ కూడా ఇచ్చి జనాలను మోసగించిన వైనం బయటపడింది. స్థానిక రత్సవారిపేట గ్రామానికి చెందిన బొక్కా వెంకటలక్ష్మి నుంచి 24 గ్రాముల బరువైన చైన్, సూత్రాలను తాకట్టు పెట్టుకుని రూ.65 వేలు మంజూరు చేశాడు. అది కూడా కేవలం ఒక మామూలు పేపరు మీద రాసి సంతకంపెట్టి, పోస్టాఫీసుకు సంబంధంలేని తన సొంత స్టాంపు వేసి ఇచ్చాడు. నగల విలువ సుమారు రూ.1,20,000 ఉంటుందని, ప్రతి నెలా వడ్డీ చెల్లిస్తున్నానని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది.