కరోనా లాక్ డౌన్ టైమ్ లో వలస కార్మికులకు సాయం అందించిన సోనూ సూద్.. ఇప్పుడు నెల్లూరు జిల్లావాసులకు అండగా నిలబడ్డారు. దాదాపు 2 వేల కుటుంబాలకు ఆయన నిత్యావసరాలు పంపించారు. ప్లాస్టిక్ బకెట్, చాప, దుప్పట్లు, ఇతర నిత్యావసరాలను అందించారు. కోవూరు మండలంలో ఇళ్లు కోల్పోయిన బాధితులకు సోనూ సూద్ ఛారిటబుల్ ఫౌండేషన్ ప్రతినిధులు, సాయాన్ని అందించారు. స్థానిక నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 


ఇటీవల వర్షాలకు నెల్లూరు జిల్లాలో దాదాపు 10 మండలాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇళ్లు కోల్పోయారు, పంట నష్టం జరిగింది. ఉపాధి కోల్పోవడంతో చాలామంది రోజుకూలీలు ఆర్థికంగా ఇబ్బందిపడ్డారు. వారందరికీ ఇప్పుడు ఆర్థిక సాయం చేసేందుకు పలు స్వచ్ఛంద సంస్థలు ముందుకొస్తున్నాయి. సినీ నటుడు సోనూ సూద్ కూడా తనవంతుగా నెల్లూరు జిల్లాలోని బాధితులకు అండగా నిలిచారు. నేరుగా తన సాయాన్ని నెల్లూరు జిల్లాకు పంపించారు. 


నెల్లూరు జిల్లాతో అనుబంధం.. 
నెల్లూరు జిల్లాకు సోనూసూద్ కి మంచి అనుబంధం ఉంది. గతంలో నెల్లూరు జిల్లా ఆత్మకూరు ప్రభుత్వ ఆస్పత్రికి ఓ ఆక్సిజన్ ప్లాంట్ ని ఉచితంగా అందజేశారు సోనూసూద్. కరోనా సమయంలో కూడా నెల్లూరు జిల్లా వాసులకు ఆయన సాయాన్ని అందచేశారు. తాజాగా వరద బాధితులను కూడా ఆయన ఆదుకున్నారు. సోనూసూద్ ఛారిటబుల్ ఫౌండేషన్ ప్రతినిధులు నెల్లూరు జిల్లాలో జరిగిన వరద నష్టాన్ని ఫోన్ ద్వారా తెలియజేయడంతో ఆయన వెంటనే స్పందించారు. 


గొప్ప మనసున్న సోనూ సూద్.. 
ఇటీవలే నెల్లూరు జిల్లా కోవూరు ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి తెలుగు సినీ నటీనటులపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ప్రజల అభిమానంతో కోట్ల రూపాయలు సంపాదించిన హీరోలు, వరదల సాయంలో కనీసం సాయం చేయడానికి ముందుకు రావడంలేదని అన్నారు. గతంలో ఎన్టీఆర్, ఏఎన్నార్ వరదల సమయంలో ప్రజలకు సాయం చేసేవారని గుర్తు చేశారు. ఈ తరం నటీనటులు ప్రజలను మరచిపోయారని, కోట్లు సంపాదిస్తున్నా కనీసం అందులో ఎంతో కొంత ఇలాంటి విపత్తుల సమయంలో అయినా పంచిపెట్టడంలేదని అన్నారు. అయితే తెలుగు వారు కాకపోయినా సోనూ సూద్ తెలుగు సినిమా ఇండస్ట్రీ తరపున తొలి అడుగు వేశారన్నారు. తన సాయాన్ని పంపించారని తెలిపారు. 


దాదాపు 2వేల కుటుంబాలకు సరిపడా బకెట్లు, చాపలు, బెడ్ షీట్లు.. లారీలో పంపించారు సోనూ సూద్. కోవూరు మండలంలోని స్టౌబిడి కాలనీ, వారధి సెంటర్. సాలుచింతల ప్రాంతాల్లో సోనూ సూద్ పంపించిన సాయాన్ని పేదలకు అందించారు సోనూసూద్ ఛారిటబుల్ ట్రస్ట్ ప్రతినిధులు. సాయం అందుకున్న బాధితులు సోనూ సూద్ కి కృతజ్ఞతలు తెలిపారు.