Amaravati : ఓ టీవీ చానల్ డిబేట్‌లో అమరావతి మహిళల్ని వేశ్యలుగా అభివర్ణించిన వారిపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో మూడు రోజుల్లోగా చెప్పాలని జాతీయ మహిళా కమిషన్ ఏపీ డీజీపీని ఆదేశించింది. ఈ అంశాన్ని జాతీయ మహిళా కమిషన్ చైర్మన్ విజయ రహత్కర్ సుమోటోగా తీసుకున్నారు. కృష్ణంరాజు చేసిన వ్యాఖ్యలపై మీడియాలో వచ్చిన వార్తలతో ఈ చర్యలు తీసుకున్నారు. మూడు రోజుల్లో కృష్ణంరాజును అరెస్టు చేయడానికి పోలీసులు ప్రయత్నించే అవకాశం ఉంది.
అసలేం జరిగిందంటే ?
వైసీపీ అధినేత జగన్ కుటుంబానికి చెందిన సాక్షి టీవీలో జరిగిన చర్చా కార్యక్రమంలో కృష్ణంరాజు అనే రాజకీయ విశ్లేషకుడు, చంద్రబాబు నాయుడు అమరావతిని "దేవతల రాజధాని" అని పిలవడాన్ని విమర్శించారు. ఈ సందర్భంగా అది దేవతల రాజధాని కాదని "వేశ్యల రాజధాని" అని వ్యాఖ్యానించారు. ఈ ప్రాంతంలో సెక్స్ వర్కర్లు, హెచ్‌ఐవీ బాధితులు ఎక్కువగా ఉన్నారని, దీనిని ఒక స్వచ్ఛంద సంస్థ నివేదిక ఆధారంగా చెప్పారు. సాక్షి టీవీ చర్చను నిర్వహించిన కొమ్మినేని శ్రీనివాసరావు, ఈ వ్యాఖ్యలకు సంబంధించి టైమ్స్ ఆఫ్ ఇండియా కథనాన్ని ఆధారంగా చూపారు, ఇందులో ఆంధ్రప్రదేశ్‌లో సెక్స్ వర్కర్ల సంఖ్య ఎక్కువగా ఉందని పేర్కొన్నారు. కానీ అందులో అసలు అమరావతి ప్రస్తావనే లేదని చెబుతున్నారు.
ఈ వ్యాఖ్యలు అమరావతి ప్రాంతంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, రెడ్డి, కమ్మ, కాపు వంటి అన్ని సామాజిక వర్గాల మహిళలను అవమానించాయని, రాజధాని ప్రాంతంపై విషపూరిత ప్రచారంగా అన్ని వర్గాల ప్రజలు భావిస్తున్నారు. . టీడీపీ నాయకత్వం, ప్రజలు ఈ వ్యాఖ్యలను ఖండిస్తూ నిరసనలు చేపట్టారు. చట్టపరమైన చర్యలను డిమాండ్ చేశారు. ఈ వివాదం అమరావతి రాజధాని అంశాన్ని మరింత రాజకీయంగా సున్నితమైన అంశంగా మార్చింది,.
2014లో ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత, అమరావతిని రాష్ట్ర రాజధానిగా ఎన్నుకున్నారు. 2019లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానుల ప్రతిపాదనను ముందుకు తెచ్చారు. ఈ నిర్ణయం అమరావతిని రాజధానిగా కొనసాగించాలని కోరుకున్న రైతులు, ప్రజల నుండి తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంది, దీనితో 2019-2024 మధ్య అమరావతి ఉద్యమం జరిగింది. గత ఎన్నికల్లో అమరావతి రాజధాని నినాదంతో ఎన్నికలకు వెళ్లిన టీడీపీ ఘన విజయం సాధించింది. అయితే వైసీపీ మాత్రం అమరావతిని పరోక్షంగా వ్యతిరేకిస్తోంది.
ప్రస్తుతం కొమ్మినేని శ్రీనివాసరావును అరెస్టు చేయగా.. అసుల వ్యాఖ్యలు చేసిన కృష్ణంరాజు పరారీలో ఉన్నారు. ఆయనను వైసీపీ నేతుల దాచి పెడుతున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. అయితే ఆయన ఆజ్ఞాతంలో ఉండి తన వాదన సమర్థించుకుంటున్నారు. ఎక్కడో రెయిడింగ్ జరిగితే .. అది అందరికీ వర్తింపు చేస్తూ.. తాను చెప్పింది కరెక్టేనని వాదిస్తున్నారు.కానీ పోలీసులకు అందుబాటులోకి రావడం లేదు. ఆయనను కూడా అరెస్టు చేసి ... జాతీయ మహిళా కమిషన్ ను నివేదిక పంపనున్నారు. ఇప్పటికే కొమ్మినేని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.