ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి మేకతోటి సుచరిత ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గం అయిన గుంటూరు జిల్లా పత్తిపాడు నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. గతంలోనూ ఆమె అక్కడి నుంచే ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే ప్రస్తుతం ఆమె రిజర్వేషన్లు దుర్వినియోగం చేశారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఓ టీవీ ఇంటర్యూలో తాను క్రిస్టియన్‌ను అని.. తన కుటుంబం అంతా మతం మారిందని ఆమె చెప్పుకున్నారు. అయితే నిబంధనల ప్రకారం మతం మరిన ఎస్సీలకు రిజర్వేషన్లు వర్తించవు. ఈ కారణంగా సుచరిత టీవీ ఇంటర్యూలో చెప్పిన దాన్ని బట్టి లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం జాతీయ ఎస్సీ కమిషన్‌కు ఫిర్యాదు చేసింది. దీంతో వారం రోజుల్లోగా వివరాలు పంపాలని జాతీయ ఎస్సీ కమిషన్ గుంటూరు జిల్లా కలెక్టర్ ను ఆదేశించింది. ఇప్పుడీ విషయం ఏపీ రాజకీయవర్గాల్లో చర్చనీయాంశం అయింది.
అయితే ఇలా మతం మారి ఎస్సీ రిజర్వేషన్‌ను దుర్వియోగం చేశారనే ఆరోపణలతో విచారణ ఎదుర్కొన్న వారిలో సుచరిత మొదటి వారు కాదు. 2019లోనే తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవిపై ఇలాంటి ఆరోపణలే వచ్చాయి. ఆమె కూడా తాను క్రిస్టియన్‌ను అని.. తన భర్త కాపు సామాజికవర్గం వారని టీవీ ఇంటర్యూల్లో చెప్పుకున్నారు. దీంతో నేరుగా రాష్ట్రపతి భవన్‌కు ఫిర్యాదు చేశారు. రాష్ట్రపతి కూడా విచారణకు ఆదేశించారు. ఎమ్మెల్యే శ్రీదేవి అఫడవిట్ దాఖలులో లోపాలపై, ఎస్సీ రిజర్వేషన్ దుర్వినియోగంపై వచ్చిన అభియోగాలపై పూర్తి విచారణ జరిపించాల్సిందిగా ఏపీ చీఫ్ సెక్రటరీకి ఆదేశాలు జారీ చేశారు. ఆమె ఎన్నికపై లీగల్ రైట్స్ ప్రొటక్షన్ ఫోరం కోర్టులో కూడా పిటిషన్ వేసింది.అయితే రాష్ట్రపతి ఆదేశాల మేరకు చీఫ్ సెక్రటరీ నివేదిక పంపారో లేదో స్పష్టత లేదు. ఆ తర్వాత ఆ కేసు సైలెంట్ అయిపోయింది.
ఆంధ్రప్రదేశ్‌లో రిజర్వుడు నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తున్న వారిలో అత్యధికులు మత మారిన క్రిస్టియన్లే ఉన్నారన్న ఆరోపణలు ఉన్నాయి. బాపట్ల ఎంపీ నందిగం సురేష్ క్రిస్టియన్ మత సంస్థను నడుపుతున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి . ఇతర రిజర్వుడు నియోజకవర్గాల నుంచి పోటీ చేసి గెలిచిన అనేక మంది క్రైస్తవ మతాన్ని ఆచరిస్తారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇలాంటి వారిపై కొన్ని సంస్థలు ఫిర్యాదులు చేయడం... రాష్ట్రపతి భవన్ లేదా జాతీయ ఎస్సీ కమిషన్ విచారణ చేయడం సహజంగానే జరుగుతూ ఉంటుంది. కానీ ఆ నివేదికలు బయటకు రావు. ఒక వేళ తప్పనిసరిగా ఇవ్వాల్సి వచ్చినా అధికారంలో ఉంటారు కాబట్టి వారికే అనుకూలంగా నివేదికలు ఇస్తారని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అందుకే ఇప్పటి వరకు ఎవరి పదవికి వచ్చిన గండం లేదు. ఏపీ హోంమంత్రికీ గుంటూరు కలెక్టర్ వ్యతిరేక నివేదిక ఇస్తారని ఎవరూ ఊహించలేరు కూడా..!