CM Jagan : రాజకీయాలంటే షూటింగ్ లు కాదని సీఎం జగన్ అన్నారు. కందుకూరు ఘటనపై సీఎం జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం నర్సీపట్నంలో పర్యటించిన సీఎం జగన్.. బహిరంగ సభలో మాట్లాడారు. నర్సీపట్నాన్ని గత పాలకులు పట్టించుకోలేదన్నారు. నర్సీపట్నంలో రూ.986 కోట్ల ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశామని చెప్పారు. చేసేదే చెబుతామని, చెప్పిందే చేస్తామని సీఎం జగన్ అన్నారు. చంద్రబాబుపై సీఎం జగన్ మండిపడ్డారు. రాష్ట్రంలో చెడిపోయిన వ్యవస్థతో యుద్ధం చేస్తున్నామన్నారు. కొందరు నిత్యం ప్రభుత్వంపై బురదజల్లడమే పనిగా పెట్టుకున్నారని మండిపడ్డారు. వచ్చే నెల నుంచి పెంచిన పింఛన్లు రూ.2750 అందిస్తున్నామన్నారు. పింఛన్లపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిబంధనల ప్రకారం ప్రతీ ఆరు నెలలకు ఒకసారి పెన్షన్ పై వెరిఫికేషన్ చేయాలన్నారు. పెన్షన్ వెరిఫికేషన్‌పై కూడా అసత్య ప్రచారం చేస్తున్నారని సీఎం జగన్ అన్నారు.
రాజకీయాలంటే షూటింగ్ కాదు
కందుకూరు ఘటనపై సీఎం జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫోటో షూట్, డ్రోన్ షాట్స్ కోసం జనం లేకపోయినా బాగా వచ్చారని చూపించేందుకు ఇరుకు రోడ్డులోకి జనాన్ని నెట్టి 8 మందిని చంపేశారని ఆరోపించారు. గోదావరి పుష్కరాల టైంలో కూడా చంద్రబాబు తన షూటింగ్ కోసం 29 మందిని బలితీసుకున్నారని విమర్శించారు. రాజకీయాలు అంటే షూటింగ్‌లు కాదన్నారు. రాజకీయం అంటే డైలాగులు, డ్రోన్ షాట్‌లు, డ్రామాలు కాదని, ప్రజలకు మంచి చేయడమని సీఎం జగన్ అన్నారు. రాజకీయం అంటే ప్రజల జీవితాల్లో మార్పులు తీసుకురావడమని సీఎం స్పష్టం చేశారు. టీడీపీ హయాంలో ఒక్క మంచి పనికూడా జరగలేదని విమర్శించారు. దత్తతండ్రిని దత్తపుత్రుడు నెత్తిన పెట్టుకుని ఊరేగుతున్నారని పవన్ కు చురకలు అంటించారు. చంద్రబాబు, పవన్ కు ఈ రాష్ట్రం కాకుంటే మరో రాష్ట్రం, ఈ భార్య కాకుంటే మరో భార్య అనే తీరులో ఉన్నారని విమర్శించారు. చంద్రబాబు పేరు చెబితే వెన్నుపోటు, మోసాలు గుర్తొస్తాయన్నారు.
చంద్రబాబు, పవన్ కు థ్యాంక్యూ
నర్సీపట్నం ప్రభుత్వ మెడికల్ కాలేజీ నిర్మాణానికి సీఎం జగన్ ఇవాళ శంకుస్థాపన చేశారు. తాండవ-ఏలేరు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్‌కు శంకుస్థాపన చేశారు సీఎం జగన్. నర్సీపట్నాన్ని అన్నివిధాలుగా అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. వైసీపీ పాలనతో రాష్ట్రంలో వచ్చిన మార్పును ప్రజలు గమనించాలన్నారు. మూడున్నరేళ్లలోనే ఉత్తరాంధ్రకు మెడికల్ కాలేజీలు తెచ్చామని తెలిపారు. ప్రజలకు ఇచ్చిన ప్రతీ హామీని నెరవేర్చామని స్పష్టం చేశారు. జనవరి 1 నుంచి రూ.2750 పెన్షన్ అమలు చేస్తామని సీఎం జగన్ తెలిపారు. పేదలకు పెన్షన్లు పెంచుతుంటే కొందరు ఓర్వలేక అసత్యాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. పింఛన్లపై కూడా దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు సభకు జనం ఎందుకొస్తారని ప్రశ్నించారు. రుణాలు మాఫీ చేస్తానని చంద్రబాబు మోసం చేసినందుకు జనం వస్తారా అని ప్రశ్నిచారు. రుణాలు పేరుతో రైతులు, డ్వాక్రా మహిళలను చంద్రబాబు మోసం చేశారని ఆరోపించారు. ఏపీకి రావాల్సిన ప్రత్యేక హోదాను ప్యాకేజీ కోసం తాకట్టుపెట్టారని విమర్శించారు. ఇంటికో ఉద్యోగం పేరుతో నిరుద్యోగులను మోసం చేశారని టీడీపీపై మండిపడ్డారు. చంద్రబాబు పాపంలో దత్తపుత్రుడు పవన్‌కు కూడా వాటా ఉందని సీఎం జగన్ ఆరోపించారు. అందుకే చంద్రబాబు, పవన్ కు థ్యాంక్యూ చెప్పాలన్నారు.
చంద్రబాబు అంటే గుర్తొచ్చేది రెండే
"రాష్ట్రంలో ఏ మంచి జరిగినా తానే చేశానని చంద్రబాబు చెప్పుకుంటాడు. సింధు బ్యాడ్మింటన్ గెలిస్తే ఆమెకు తానే బ్యాడ్మింటన్ నేర్చించానని చెప్పుకుంటారు. ఈ పెద్ద మనిషి సొంత నియోజకవర్గంలో నీళ్లు ఉండవు, వైసీపీ ప్రభుత్వం ఇస్తేనే కుప్పంలో రెవెన్యూ డివిజన్ ఇచ్చాం. ఈయన పేరు చెబితో ఒక్క సంక్షేమ పథకం కూడా గుర్తుకురాదు. చంద్రబాబును చూస్తే గుర్తొచ్చేది రెండు వెన్నుపోటు, మోసాలు. చంద్రబాబు సభకు ఎక్కువ జనం వచ్చారని చూపేందుకు ఇరుకు సందులో సభలు పెట్టి 8 మందిని చంపేశారు. "- సీఎం జగన్