Nara Rammurthy Naidu Last Rites Completed: ఏపీ సీఎం చంద్రబాబు సోదరుడు నారా రామ్మూర్తినాయుడు (Rammurthy Naidu) అంత్యక్రియలు ఆదివారం పూర్తయ్యాయి. ఆయన స్వగ్రామం తిరుపతి జిల్లా నారావారిపల్లెలో (Naravaripalle) ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. సీఎం చంద్రబాబు (CM Chandrababu), మంత్రి లోకేశ్, రామ్మూర్తినాయుడు తనయుడు, సినీ నటుడు నారా రోహిత్, గిరీష్ ఇతర కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. తల్లిదండ్రుల అంత్యక్రియలు నిర్వహించిన చోటే రామ్మూర్తినాయుడి అంత్యక్రియలు నిర్వహించారు. అంతిమయాత్రలో సోదరుడి పాడెను సీఎం చంద్రబాబు మోశారు. అంతకుముందు రామ్మూర్తి భౌతిక కాయానికి మహారాష్ట్ర గవర్నర్ రాధాకృష్ణన్, చంద్రబాబు, భువనేశ్వరి, లోకేశ్, బ్రాహ్మణి, దేవాన్ష్ నివాళులర్పించారు. అలాగే, టీడీపీ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు రామ్మూర్తి పార్థీవ దేహానికి నివాళులు అర్పించారు. సినీ నటుడు మోహన్ బాబు, మంచు మనోజ్, సినీ నిర్మాత ఎన్వీ ప్రసాద్ తదితరులు భౌతిక కాయానికి అంజలి ఘటించారు.
కొంతకాలంగా అనారోగ్యంతో బాధ పడుతోన్న రామ్మూర్తినాయుడు హైదరాబాద్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం కన్నుమూశారు. అనంతరం ఆయన పార్థీవదేహాన్ని స్వగ్రామం నారావారిపల్లెకు తరలించారు. ఆదివారం ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు.
నారా రామ్మూర్తినాయుడు 1952లో ఖర్జూరనాయుడు, అమ్మణ్ణమ్మ దంపతులకు జన్మించారు. సీఎం చంద్రబాబు ఆయన సోదరుడు. రామ్మూర్తినాయుడు ఎస్వీ ఆర్ట్స్ డిగ్రీ కళాశాలలో బీఏ చేశారు. 1992 నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లో యాక్టివ్‌గా ఉన్నారు. 1994లో టీడీపీ తరఫున చంద్రగిరి నుంచి పోటీ చేసి గెలుపొందారు. 1999 అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైన తర్వాత రాజకీయంగా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. 2003లో అప్పటి కాంగ్రెస్ అధినేత్రి సోనియా సమక్షంలో ఆ పార్టీలో చేరారు. ఆ తర్వాత 2004లో శ్రీకాళహస్తి నుంచి పోటీ చేయాలని కాంగ్రెస్ అధిష్టానం ఆదేశించగా ఆ పార్టీతో విభేదించారు. అనంతరం చంద్రగిరి నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత ఆయనకు అనారోగ్య సమస్యలు తలెత్తాయి.