Lokesh Ippatam Tour :  మంగళగిరి నియోజకవర్గం ఇప్పటంలో  రోడ్డు విస్తరణ పేరుతో కూల్చివేసిన ఇళ్లను టీడీపీ నేత నారా లోకేష్ పరిశీలించారు. బాధితులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రభుత్వం తీరుపై కీలక వ్యాఖ్యలు చేశారు. పేదలు రూపాయి రూపాయి కష్టపడి సంపాదించుకున్న సొమ్ముతో కట్టుకున్న ఇళ్లను కూల్చేస్తున్నారని.. టిడిపి గెలిచిన తరువాత తాడేపల్లి ప్యాలస్ మీద నుంచి ఫ్లై ఓవర్ వేస్తాం అని ప్యాలస్ కుల్చేస్తే జగన్ పరిస్థితి ఎంటో ఆలోచించు కోవాలని సలహా ఇచ్చారు. టీడీపీ గెలిస్తే మంగళగిరిలో ఇళ్లను కూల్చివేస్తారని ప్రచారం చేసిన ఆర్కే ఇప్పుడు ఇళ్ల కూల్చివేత కోసం సొంతంగా జేసీబీలు కొన్నారని మండిపడ్డారు. 


జగన్ రెడ్డి పెద్ద సైకో... ఆర్కే చిన్న సైకో  .. పేదల ఇళ్ళు జేసీబీతో కూల్చే వీడియోలు టివిలో చూసి ఆనందం పడే రకం ఈ పెద్ద సైకో, చిన్న సైకో అని లోకేష్ విమర్శించారు. ప్రజా వేదిక కూల్చడం తో జగన్ రెడ్డి జేసీబీ పాలన మొదలుపెట్టాడని..  టిడిపి సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు గారి ఇంటి గోడ కూల్చారు, సబ్బం హరి గారి ఇంటి గోడ కూల్చారు, గీతం యూనివర్సిటీ గోడ కూల్చారని గుర్తు చేశారు. మంగళగిరిని డిస్ట్రక్షన్ క్యాపిటల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గా మార్చేసారు.  పేదల ఇళ్ళు కూల్చడానికి ఎమ్మెల్యే ఆర్కే ఏకంగా సొంత జేసీబీ కొన్నాడని..ఇప్పటి వరకూ  ఆత్మకూరు-72 ఇళ్ళు, పేరుకలపూడి-16 ఇళ్ళు మరియు షాపులు, పెదవడ్లపూడి-50 ఇళ్ళు మరియు షాపులు, అమరారెడ్డి కాలనీ-300 ఇళ్ళు, నూతక్కి-15 ఇళ్ళు,  ప్రకాష్ నగర్, డోలాస్ నగర్- 30షాపులు, 20 ఇళ్ళు, నులకపేట-3షాపులు ఇలా అన్ని చోట్లా వందల సంఖ్యలో పేదల ఇళ్ళు కూల్చారు. కురగల్లు-250 ఇళ్ళకు , నిడమర్రు-50 ఇళ్ళకు నోటీసులు ఇచ్చారన్నారు. 


ముఖ్యమంత్రి ఇంటి పక్కన పేదల ఇళ్ళు ఉండటానికి వీలు లేదని.. కాలనీలనే తీసేశారన్నారు.  అన్ని చోట్లా ఇళ్ల కూల్చివేతలకు వ్యతిరేకంగా టిడిపి పోరాటం చేసింది. న్యాయ సహాయం చేసి కొన్ని చోట్ల కూల్చివేతలు అడ్డుకోగలిగామన్నారు.  ఇప్పటం లో జరిగింది మరీ అన్యాయమని..  కేవలం రాజకీయ కక్షతోనే ఇక్కడ ఇళ్ళు కూల్చేశారన్నారు.  రోడ్డు మీద గుంతలు పూడ్చలేని చెత్త ప్రభుత్వం రోడ్డు విస్తరణ అంటూ ఇళ్ళు కొట్టేయడం విడ్డూరంగా ఉంది.  కనీసం బస్సు సౌకర్యం కూడా లేని ఊరి రోడ్డుని 120 అడుగులు వెడల్పు చెయ్యడానికి కారణం కేవలం రాజకీయ కక్షసాధింపేనన్నారు.  జనసేన సభకి భూములు ఇచ్చారని, పోయిన ఎన్నికల్లో ఈ గ్రామంలో టిడిపి కి మెజారిటీ వచ్చిందనే కోపంతోనే ఇళ్లను కూల్చేశారన్నారు. ఇప్పటం గ్రామస్తుల పోరాటానికి టిడిపి అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.  


లోకేష్‌తో మాట్లాడిన కొంత మంది గ్రామస్తులు ఎమ్మెల్యేను నమ్మి మోసపోయామన్నారు.  మార్కింగ్ చేసిన తర్వాత గ్రామం నుండి 50 మంది ఎమ్మెల్యే గారి దగ్గరకు వెళ్ళామన్నారు.  80 అడుగుల రోడ్డు ఉంది కదా విస్తరణ ఉండకుండా నేను చూసుకుంటా అని ఆయన హామీ ఇచ్చారని..కానీ  ఉన్నట్టుండి శుక్రవారం ఉదయం 6 గంటలకే మూడు క్రేన్లు, 20 మంది పోలీసులు వచ్చారని.. గ్రామస్తులు అడ్డుపడటంతో మరో 2 బస్సుల్లో పోలీసులు వచ్చారని..  15 మందిని అరెస్ట్ చేసి దుగ్గిరాల పోలీస్ స్టేషన్ కి తరలించి మరీ కూల్చివేతలు చేశారన్నారు. కోర్టు స్టే ఇచ్చినా కూల్చివేతలు కొనసాగించారన్నరాు.  ఆరు నెలల క్రితం అధికారులు వచ్చి రోడ్డు విస్తరణ ఉంది అంటూ  మా ఇంటి ముందు వరకే మార్కింగ్ ఉందని.. ఈ మధ్య కాలంలో మళ్ళీ వచ్చి రీ మార్కింగ్ చేసి ఇళ్లు కూడా పోతుంది అని చెప్పారని మరో బాధితుడు వాపోయారు.