Nara Lokesh Speech in Shankaravam in Ichapuram: రానున్న ఎన్నికల్లో టీడీపీదే ఘన విజయమని.. తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడ్డాక ప్రతీ ఏటా డీఎస్సీ నిర్వహిస్తామని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ (Nara Lokesh) అన్నారు. శ్రీకాకుళం (Srikakulam) జిల్లా ఇచ్ఛాపురంలో (Ichapuram) 'శంఖారావం' పేరిట ఎన్నికల ప్రచారానికి ఆయన ఆదివారం శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా స్థానిక సురంగిరాజా మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడారు. పౌరుషాలు, పోరాటాలకు మారుపేరు శ్రీకాకుళం జిల్లా అని.. ఉత్తరాంధ్ర అమ్మ వంటిదని తల్లి ప్రేమకు ఎలాంటి షరతులు ఉండవో ఇక్కడి ప్రజలూ అంతేనని అన్నారు. కింజరాపు ఎర్రన్నాయుడు, గౌతు లచ్చన్న పుట్టిన గడ్డ నుంచి 'శంఖారావం' యాత్ర ప్రారంభిస్తుండడం అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పారు. ఈ నేపథ్యంలో సీఎం జగన్ పై విమర్శలు గుప్పించారు. ఉత్తరాంధ్రను టీడీపీ హయాంలో జాబ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా మారిస్తే జగన్ గంజాయి క్యాపిటల్ గా మార్చారని మండిపడ్డారు. నాలుగున్నరేళ్లలో ఒక్క డీఎస్సీ ఇవ్వని ప్రభుత్వం ఇప్పుడు ఎన్నికల ముందు హడావుడిగా 6,500 డీఎస్సీ పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చి కొత్త డ్రామాకు తెర లేపారని ధ్వజమెత్తారు. అది మెగా డీఎస్సీ కాదని.. దగా డీఎస్సీ అని మోసం, దగా, కుట్రకి ప్యాంటు, షర్ట్ వేస్తే జగన్ లా ఉంటుందంటూ ఎద్దేవా చేశారు. '2019 ఎన్నికల ముందు 23 వేల పోస్టులతో డీఎస్సీ నిర్వహిస్తామని వైసీపీ హామీ ఇచ్చింది. ఆ తర్వాత 18 వేల పోస్టులే ఉన్నాయంటూ.. స్కూల్ రేషనైలేజేషన్ పేరుతో పోస్టులు తగ్గించారు. ఎన్నికల ముందు నామమాత్రంగా 6 వేల పోస్టులతో డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చారు. ఎన్టీఆర్, చంద్రబాబు డీఎస్సీ ద్వారా 1.70 లక్షల ఉద్యోగాలు భర్తీ చేశారు. రాబోయేది మన ప్రభుత్వమే. ఏటా డీఎస్సీ నిర్వహిస్తాం.' అని లోకేశ్ స్పష్టం చేశారు.


వడ్డీతో సహా చెల్లిస్తాం


టీడీపీ అధినేత చంద్రబాబు సహా తనపై, ఇతర నేతలపై వైసీపీ ప్రభుత్వం అక్రమ కేసులు బనాయించిందని.. ఎన్ని కేసులు పెట్టినా వెనక్కు తగ్గేది లేదని లోకేశ్ అన్నారు. చట్టాలను ఉల్లంఘించి, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన అధికారులందరి పేర్లు తన రెడ్ బుక్ లో ఉన్నాయని చెప్పారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వారిపై న్యాయ విచారణ జరిపించి.. వడ్డీతో సహా చెల్లిస్తామని అన్నారు. 'సీఎం జగన్ సభలు చూస్తుంటే నవ్వొస్తోంది. ఆయన సిద్ధం అంటున్నారు. దేనికి సిద్ధం? జైలుకు వెళ్లేందుకేనా?. సీఎం తన కుటుంబ సభ్యులకే రక్షణ కల్పించడం లేదు. తమకు భద్రత లేదని షర్మిల, సునీత అంటున్నారు. సొంత చెల్లెళ్లకే భద్రత ఇవ్వకపోతే ఇక సాధారణ మహిళల పరిస్థితి ఏంటి.?. దేశంలో వంద సంక్షేమ పథకాలకు కోతపెట్టిన ఏకైక సీఎం జగన్. ఆయన ఇచ్ఛాపురానికి ఇచ్చిన ఒక్క హామీని నెరవేర్చలేదు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేస్తాం. కొబ్బరి, జీడి రైతుల సమస్యలు పరిష్కరిస్తాం. వైసీపీ భూకబ్జాలకు సహకరించలేదనే విశాఖలో తహసీల్దార్ రమణయ్యను కొట్టి చంపారు.' అని లోకేశ్ మండిపడ్డారు. అటు, ప్రభుత్వం ఎన్ని అవాంతరాలు సృష్టించినా.. లోకేశ్ 'యువగళం' పాదయాత్రను ఆపకుండా కొనసాగించారని టీడీపీ ఎంపీ రామ్మోహన్ అన్నారు. కార్యకర్తలకు ఎలా న్యాయం చేయాలో ఆయనకు తెలుసని చెప్పారు. ఢిల్లీలో మన గళం వినిపించాలంటే లోక్ సభ స్థానాల్లోనూ టీడీపీని గెలిపించాలని కోరారు.






Also Read: TSRTC News: TSRTC గుడ్ న్యూస్ - బస్ టికెట్ తో పాటే శ్రీశైలం దర్శన టికెట్ బుకింగ్ సదుపాయం