చిన్న పిల్లల గొడవకి కూడా వైసీపీ గూండాలు మానవత్వం మర్చిపోయి హత్యలు చేస్తున్నారు అంటూ టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మండిపడ్డారు. తిరుపతి జిల్లా రామచంద్రాపురం మండలం బొప్పరాజు పల్లె టీడీపీ గ్రామ కమిటీ అధ్యక్షుడు మహమ్మద్ రఫీని వైసీపీ నేత సిద్దిక్ హత్య చేయడం రాష్ట్రంలో భయానక పరిస్థితులకు అద్దం పడుతోందన్నారు. నిందితులను అరెస్టు చేయాల్సింది పోయి పోలీసులే వారిని కాపాడే ప్రయత్నం చేయడం దారుణం అన్నారు. వైసీపీ గూండాయిజానికి బలైన మహమ్మద్ రఫీ కుటుంబానికి న్యాయం చేయాలని ఏపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
చిత్తూరు జిల్లా బంగారుపాలెం మండలం జంబువారిపల్లి శాంతినగర్ అంగన్వాడీ కేంద్రంలో గర్భిణులకి ఇచ్చే పౌష్టికాహారంలో చచ్చిన పాము రావడంపై నారా లోకేష్ స్పందించారు. వైసీపీ ప్రభుత్వం ఇచ్చేది పౌష్టికాహారమా? విషాహారమా? అని ప్రశ్నించారు. అంగన్వాడీ కేంద్రంలో గర్భిణులకి ఇచ్చే పౌష్టికాహారంలో చచ్చిన పాము కళేబరం రావడం గర్భిణులపై జగన్ ప్రభుత్వానికి ఉన్న నిర్లక్ష్యాన్ని చూపిస్తుందన్నారు. సీఎం జగన్ పాలనని గాలికొదిలేసి తన రాజకీయ కక్ష సాధింపుల కోసం ప్రభుత్వాన్ని, వ్యవస్థల్ని వాడుకుంటూ ప్రశ్నించే ప్రతిపక్ష నేతలని జైలులో పెట్టించి వికృతానందం పొందుతున్నారని విమర్శించారు. గర్భిణులకి విషాహారం పంపిణీ చేయిస్తున్న జగన్ ను.. నిన్ను నమ్మం అంటున్నారు జనం అని లోకేష్ పేర్కొన్నారు.
పౌష్టికాహారం ప్యాకెట్‌లో పాము కళేబరం-షాకైన గర్భిణిశాంతినగర్‌లో అంగన్‌వాడీ కేంద్రం ఉంది. మానస అనే గర్భిణి ఆ అంగన్‌వాడీలో ఇచ్చిన పౌష్టికాహారం కిట్ తీసుకుంది.ఆ తర్వాత శ్రీమంతం కోసం పుట్టింటికి వెళ్లిపోయింది. అక్కడికి వెళ్లాక... అంగన్‌వాడీలో ఇచ్చిన పౌష్టికాహార కిట్‌లోని ఎండు ఖర్జూరం ప్యాకెట్ తెరిచింది. ఆ ప్యాకెట్‌లో పాము కళేబరం ఉండటం గమనించి షాకయ్యింది. ఈ విషయాన్ని అంగన్‌వాడీ సూపర్‌వైజర్ కళ్యాణికి ఫోన్ చేసి చెప్పింది. ఫొటోలు కూడా తీసి పంపింది. కళ్యాణి సాయంతో ఉన్నతాధికారి అయిన సీడీపీవో వాణిశ్రీ దేవికి ఫిర్యాదు చేసింది.