Nara Lokesh News: నారా లోకేశ్ ఎన్నికల ప్రచారం సీరియస్ గా సాగుతోంది. లోకేశ్ వివిధ వర్గాలను కలుస్తూ వారి మద్దతు కూడగడుతున్నారు. తాజాగా నారా లోకేశ్ ఒంగోలులో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. యువగళం పేరుతోనే సభ నిర్వహించారు. అక్కడ కొంత మంది కార్యకర్తలు, యువత అడిగిన ప్రశ్నలకు నారా లోకేశ్ సమాధానాలు చెప్పారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను లోకేశ్ సంబోధించిన తీరు అందరికీ నవ్వు తెప్పించింది. జగన్ ఈ మధ్య బ్యాండేజ్‌ తో కనిపించినందున లోకేశ్ ఆయన్ను బ్యాండేజ్ బబ్లూ అంటూ సంబోధించారు.


గత డిసెంబరులో వైఎస్ షర్మిల నారా లోకేశ్‌కు క్రిస్మస్ కేసు పంపిన ఘటన గురించి ఓ యువకుడు నారా లోకేశ్ ను ఓ ప్రశ్న అడిగారు. ఆ క్రిస్మస్ కేకు రిసీవ్ చేసుకున్నట్లుగా ఎక్స్‌లో ఓ పోస్టు పెట్టారని.. అది రాజకీయ కోణంలోనే పెట్టారా అని యువకుడు ప్రశ్నించాడు. అప్పటికే జగన్ - షర్మిలకు గొడవలు ఉన్నందున.. దాన్ని తీవ్రస్థాయికి తీసుకెళ్లాలనే ఉద్దేశంతోనే ఆ పోస్ట్ చేశారా? అని యువకుడు లోకేశ్ ను అడిగాడు.


దీనికి నారా లోకేశ్ సమాధానం చెప్తూ ప్రతి విషయాన్ని రాజకీయ కోణంలో చూడవద్దని కోరారు. మనకి రాజకీయంగా శత్రువులు ఉంటారు కానీ.. వ్యక్తిగతంగా శత్రువులు ఉండబోరని అన్నారు. షర్మిల క్రిస్మస్ పండుగకు తమకు కేక్ పంపించారని.. అందుకు థ్యాంక్స్ అంటూ తాను రెస్పాండ్ అయ్యానని అన్నారు. మర్యాదపూర్వకంగా స్పందించడం అనేది ఒక మానవత్వం అని అన్నారు. అంతేతప్ప దాని వెనక మరే ఉద్దేశం లేదని అన్నారు. బ్యాండేజ్ బబ్లూకి మానవత్వం లేకపోవచ్చు కానీ.. నారా లోకేశ్ కు మానవత్వం ఉందని అన్నారు. ‘‘బ్యాండేజ్‌ బబ్లూకి మానవత్వం లేదేమో కానీ, నాకు మాత్రం ఉంది’’ అని లోకేశ్ అన్నారు.