AP Chief Ministers | అమరావతి: వైసీపీ ఐదేళ్ల పాలనలో ఆంధ్రప్రదేశ్‌లో మాజీ సీఎం వైఎస్ జగన్ (YS Jagan Mohan Reddy) సృష్టించిన ఆర్థిక విధ్వంసం అంతా ఇంతా కాదని.. అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేశారని ఏపీ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) విమర్శించారు. అందినకాడికి ఎక్కడ పడితే అక్కడ రాష్ట్రంపై అప్పులు చేశారు. 58 ఏళ్లపాటు పాలించిన ముఖ్యమంత్రులు అంతా కలిపి చేసిన అప్పుపై 2019 నాటికి రూ.14,155 కోట్లు వడ్డీ చెల్లిస్తుంటే... కేవలం వైఎస్ జగన్ పాలించిన ఐదేళ్ల కాలానికి... 2024 నాటికి అప్పులపై కట్టాల్సిన వడ్డీ ఏకంగా రూ.24,944 కోట్లకు చేరిందని లోకేష్ తెలిపారు. మిగతా అందరు సీఎంలు చేసిన అప్పుపై కట్టిన వడ్డీ కంటే వైసీపీ ఐదేళ్ల పాలనలో జగన్ రెడ్డి చేసిన అప్పుపై కట్టే వడ్డీనే సుమారు రూ.11వేల కోట్లు అధికంగా ఉందని మండిపడ్డారు. జగన్ ఏపీలో ఎంతటి ఆర్థిక విధ్వంసం సృష్టించారో ఈ గణాంకాలే నిదర్శనమని నారా లోకేష్ పేర్కొన్నారు.
ప్రయాగ రాజ్ లో మంత్రి నారా లోకేష్ పుణ్యస్నానాలు
అమరావతి: మహా కుంభమేళాలో పుణ్యస్నానాలు ఆచరించేందుకు మంత్రి నారా లోకేష్ ప్రయాగ రాజ్ బయలుదేరారు. ఉదయం10 గంటలకు మంత్రి లోకేష్ ప్రయాగ్‍రాజ్ లోని షాహి స్నానఘట్టానికి చేరుకుంటారు. 10.10 నుంచి 12.10 గంటల నడుమ మహాకుంభ మేళా షాహి స్నానఘట్టంలో లోకేష్ పుణ్యస్నానాలు ఆచరిస్తారు. మధ్యాహ్నం 1 గంటకు ప్రయాగ్‍రాజ్ నుంచి వారణాసికి బయలుదేరతారు. మధ్యాహ్నం 2.45 గంటలకు వారణాసి కాలభైరవ ఆలయాన్ని ఆయన సందర్శిస్తారు. అనంతరం సాయంత్రం 3.40 గంటలకు వారణాసి కాశీ విశ్వేశ్వర ఆలయాన్ని సందర్శించి, ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. సాయంత్రం 4 గంటలకు విశాలాక్షి ఆలయాన్ని సందర్శిస్తారు. సాయంత్రం 5.25 గంటలకు వారణాసి నుంచి విజయవాడకు తిరుగు ప్రయాణం అవుతారని అధికారులు తెలిపారు.
50 కోట్లు దాటిన పుణ్యస్నానాలు..
144 ఏళ్లకు జరిగే మహా కుంభమేళా ఈ ఏడాది యూపీలోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతోంది. ఈ కుంభమేళాకు 40 కోట్ల వరకు భక్తులు తరలివచ్చే అవకాశం ఉందని, ఆ మేరకు ఏర్పాట్లు చేశామని యూపీ ప్రభుత్వం, కేంద్రం చెప్పాయి. అనూహ్యంగా ఇప్పటికే 50 కోట్ల మంది భక్తులు కుంభమేళాలో పాల్గొని పుణ్యస్నానాలు ఆచరించారు. త్వరలో మహా కుంభమేళా ముగియనుండటంతో మరో 5, 10 కోట్ల మంది వరకు త్రివేణి సంగమంలో పుణ్యస్నాలు చేసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.