Nara Lokesh Comments on CM Jagan: 'ఇప్పటికిప్పుడు ఎన్నికల్లో ఓడినా తనకు విచారం లేదు. నాకు ఎంతో సంతోషం' అంటూ సీఎం జగన్ (CM Jagan) చేసిన వ్యాఖ్యలపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ (Nara Lokesh) వ్యంగ్యాస్త్రాలు సంధించారు. 'జగన్ హ్యాండ్సప్.. వైసీపీ ప్యాకప్' అంటూ ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేశారు. బై బై జగన్, 2024లో ఆయన ఇక అధికారంలో ఉండరని అన్నారు. అటు, అమరావతి రైతుల ఉద్యమం 1500 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. 'కుట్రలు, కుతంత్రాలు, కుయుక్తులకు ఎదురొడ్డి అమరావతి నిలబడింది. అమరావతి పరిరక్షణకు రాజధాని రైతులు చేపట్టిన ఉద్యమం గురువారంతో 1500 రోజులు పూర్తి చేసుకుంది. ప్రజా రాజధాని కోసం ఇన్ని రోజులుగా నియంతపై పోరాడుతోన్న రైతులకు ఉద్యమాభివందనాలు. అమరావతి కోసం పోరాడుతూ ప్రాణాలు కోల్పోయిన వారికి నివాళులు అర్పిస్తున్నా. త్వరలోనే మీ ఆశయం నెరవేరుతుంది. రాష్ట్రం, భావితరాల భవిష్యత్తు కోసం భూమిని త్యాగం చేసిన రైతులకు న్యాయం జరుగుతుంది. అధర్మంపై ధర్మం విజయం సాధిస్తుంది.' అని పేర్కొన్నారు. 










1500 రోజులకు ఉద్యమం


రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన 3 రాజధానులకు వ్యతిరేకంగా.. అమరావతి పరిరక్షణే ధ్యేయంగా రైతులు, మహిళలు సాగిస్తున్న పోరాటం గురువారానికి 1500వ రోజుకు చేరుకుంది. అమరావతి నిర్మాణంపై ప్రభుత్వ తీరును నిరసిస్తూ ఇన్ని రోజులుగా అక్కడి వారు ఆందోళన చేస్తూనే ఉన్నారు. సర్కారు నిర్ణయానికి వ్యతిరేకంగా న్యాయస్థానాల మెట్లు ఎక్కారు. పాదయాత్రలతో అమరావతి ప్రాధాన్యతను అందరికీ తెలిసేలా ఉద్యమం ఉద్ధృతం చేశారు. రాజధాని రైతులు 2021 నవంబర్ 1న 'న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకు' పేరుతో తుళ్లూరు నుంచి తిరుమలకు పాదయాత్ర చేశారు. అలాగే, 2022, సెప్టెంబర్ 12 నుంచి శ్రీకాకుళం జిల్లాలోని అరసవల్లి నుంచి పాదయాత్ర ప్రారంభించారు. ప్రతికూల పరిస్థితుల్లోనూ రైతులు రామచంద్రాపురం వరకూ ఈ యాత్ర చేపట్టి ఆ తర్వాత పరిస్థితుల దృష్ట్యా నిలిపేశారు.


'250 మందికి పైగా మరణం'


2019, డిసెంబర్ 17న సీఎం జగన్ శాసనసభలో 3 రాజధానుల ప్రతిపాదన చేశారు. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రాజధాని గ్రామాల్లో నిరసనలు హోరెత్తాయి. ఆ రోజు నుంచి ఇప్పటివరకూ ఆ ప్రాంత రైతులు, మహిళలు ఆందోళనలు చేస్తూనే ఉన్నారు. రైతులు, కూలీలు, మహిళలు, రాజధాని మద్దతుదారులపై దాదాపు 720కి పైగా కేసులు నమోదు చేసినట్లు తెలుస్తోంది. 3 రాజధానుల నిర్ణయంతో తీవ్ర మనస్తాపం చెంది అనేక మంది ఉద్యమకారులు, రైతులు, కూలీలు కన్నుమూశారని అమరావతి ఐకాస తెలిపింది. ఇప్పటి వరకూ 250 మందికి పైగా మృతి చెందినట్లు పేర్కొంది.


ప్రత్యేక కార్యాచరణ


అమరావతి ఉద్యమం 1500 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆ పోరాట స్ఫూర్తిని దశదిశలా చాటేందుకు ఐకాస ప్రత్యేక కార్యాచరణను రూపొందించింది. ప్రభుత్వం తమను ఇబ్బంది పెడుతున్న తీరును ప్రజలకు తెలియజేయాలని రాజధాని రైతులు భావిస్తున్నారు. 'అమరావతి సమర శంఖారావం' పేరుతో నిరసన కార్యక్రమాలు, రాజధాని గ్రామాల్లోని శిబిరాల్లో వినూత్న రీతిలో నిరసనలు, సభలు, సమావేశాలు నిర్వహించనున్నారు. వెలగపూడి దీక్షా శిబిరం, మందడం గ్రామదేవత పోలేరమ్మ ఆలయం వద్ద సభల్ని ఏర్పాటు చేస్తున్నారు. ఉద్యమ నేపథ్యం, పోరాట ఘట్టాల్ని వివరించేలా ప్రత్యేక గీతాల్ని ఆవిష్కరించనున్నారు.


Also Read: సంక్షేమ పథకాలే ప్రభుత్వాన్ని నిలబెడతాయి- ఆధారాలతోనే చంద్రబాబు అరెస్ట్: సీఎం జగన్