చంద్రబాబు అరెస్టు అయిన తర్వాత ప్రభుత్వం మరింత నియంతలా వ్యవహరిస్తోందనే నినాదాన్ని ప్రజల్లోకి విరివిగా తీసుకెళ్తున్నారు. యువగళం పాదయాత్రని ఆపిన దగ్గరే కొనసాగించి ప్రభుత్వం, సీఎం జగన్ తీరును ఎండగట్టాలని ప్రయత్నిస్తున్నారు. సుప్రీంకోర్టులో చంద్రబాబు స్కిల్ డెవలప్ మెంట్ కేసు విచారణ ఉన్నందున యువగళం పాదయాత్రని వాయిదా వేశారు. ఈలోపు నారా లోకేశ్ ఓ పాటను విడుదల చేశారు. ‘తెలుగు జాతి వెలుగుబిడ్డ లేరా.. గడపదాటి తిరగబడగ రారా..’ అంటూ ఆ పాట సాగుతుంది.


సినీ నిర్మాత, Philanthropist అయిన అట్లూరి నారాయణ రావు ఈ పాటను తయారు చేయించారు. ఈయన నిర్మాతగానే కాకుండా ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల కమిటీకి ఛైర్మన్‌గా కూడా వ్యవహరించారు. అలాగే ఏఎన్ఆర్ చారిటబుల్ ట్రస్ట్‌కి ఛైర్మన్ గా ఉన్నారు.



యువగళం పాదయాత్ర వాయిదా


నారా లోకేశ్ యువగళం పాదయాత్ర కొనసాగింపు వాయిదా పడింది. స్కిల్ డెవలప్ మెంట్ కేసు వల్ల పాదయాత్ర తేదీని మార్చినట్లుగా టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. అక్టోబర్ 3న సుప్రీంకోర్టులో స్కిల్ డెవలప్ మెంట్ కేసు విచారణ ఉన్నందున యువగళం పాదయాత్ర కొనసాగింపునకు ఆటంకం ఏర్పడింది. ఈ మేరకు యువగళం పాదయాత్ర వాయిదా వేస్తున్నట్లు టీడీపీ అధికారిక ప్రకటన చేసింది. త్వరలోనే నాయకులతో చర్చించి యువగళం పున:ప్రారంభ తేదీని ప్రకటించాలని అనుకుంటున్నారు. ముందుగా అనుకున్న ప్రకారం.. యువగళం పాదయాత్ర శుక్రవారం రాత్రి 8 గంటల నుంచి తిరిగి ప్రారంభం కావాల్సి ఉంది.


చంద్రబాబు అరెస్టు, తర్వాత జరిగిన పరిణామాల వల్ల సెప్టెంబరు 9న ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా రాజోలు నియోజకవర్గంలో యువగళం పాదయాత్రని నిలిపివేశారు. దాదాపు 20 రోజుల తర్వాత సెప్టెంబరు 29న రాత్రి 8.15 గంటలకు పాదయాత్ర మళ్లీ ప్రారంభించాలని నిర్ణయించారు. కానీ, అక్టోబర్ 3న స్కిల్ డెవలప్‌మెంట్ కేసు పిటిషన్ సుప్రీంకోర్టులో వాదనలు ఉన్నందున యువగళం పాదయాత్ర పున:ప్రారంభ తేదీని వాయిదా వేసుకోవాలని పార్టీ ముఖ్య నేతలే లోకేశ్‌ని కోరారు. 


ప్రస్తుతం లోకేశ్ ఢిల్లీలో ఉండి కేసు విషయంలో న్యాయనిపుణులను సంప్రదిస్తున్నారు. పాదయాత్రలో ఉంటే న్యాయవాదులతో సంప్రదింపులు, ఇతర కార్యక్రమాల పర్యవేక్షణ ఇబ్బంది అవుతుందని లోకేశ్‌ కు పార్టీ నేతలే చెప్పారు. వారి సలహాలను స్వీకరించిన లోకేశ్‌.. యువగళం పాదయాత్ర పున:ప్రారంభ తేదీని వాయిదా వేసుకోవాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. త్వరలోనే నాయకులతో చర్చించి యువగళం పాదయాత్ర డేట్స్ ఖరారు చేయనున్నారు.