Nara Lokesh: బుధవారం రాత్రి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో నారా లోకేష్ భేటీ ఏపీ రాజకీయాల్లో కీలకంగా మారింది. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబు అరెస్ట్ కావడం, నెల రోజులుగా రాజమండ్రి సెంట్రల్ జైల్లోనే ఉన్న నేపథ్యంలో అమిత్ షాతో లోకేష్ సమావేశం కావడం రాజకీయ వర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారింది. ఈ భేటీలో కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డితోపాటు ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి కూడా పాల్గొన్నారు. చంద్రబాబు అరెస్ట్‌, ఆరోగ్యం గురించి అమిత్ షా ఆరా తీసినట్లు టీడీపీ శ్రేణులు చెబుతున్నా.. ఈ భేటీలో ఏం జరిగిందనేది చర్చనీయాంశంగా మారింది. ఈ సమావేశంపై వైసీపీ శ్రేణులు ఇప్పటికే విమర్శలు మొదలుపెట్టగా.. టీడీపీ వర్గాలు కూడా ఎదురుదాడి చేస్తోన్నాయి.


ఈ క్రమంలో అమిత్ షాతో భేటీపై నారా లోకేష్ స్వయంగా స్పందించారు. గురువారం మధ్యాహ్నం ఢిల్లీలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ.. అమిత్ షా నుంచి తనకు పిలుపు వచ్చినట్లు తెలిపారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తనకు స్వయంగా ఫోన్ చేసి మిమ్మల్ని అమిత్ షా కలవాలనుకుంటున్నట్లు చెప్పారని, అందుకే తాను వెళ్లినట్లు లోకేష్ క్లారిటీ ఇచ్చారు. అమిత్ షాకు అన్నీ వివరించానని, చంద్రబాబు ఆరోగ్యపరంగా ఇబ్బంది పడుతున్నట్లు చెప్పానని అన్నారు. చంద్రబాబు భద్రతాపరంగా ఉన్న ఆందోళన గురించి కూడా చెప్పానని మీడియాకు తెలిపారు. సీఐడీ ఎందుకు పిలిచింది.. ఎన్ని కేసులు పెట్టారని అమిత్ షా అడిగారని, పూర్తిగా రాజకీయ కక్షతో పెట్టిన కేసులే అని అమిత్ షాకు చెప్పానని లోకేష్ వివరించారు.


'రాజమండ్రి జైలులోనే మాజీ నక్సలైట్లు ఉన్నారు. అమిత్ షా వద్ద ఎలాంటి రాజకీయ విషయాలు చర్చకు రాలేదు. నిజంవైపు ఉండాలని అమిత్ షాను కోరాను. బీజేపీ పేరు చెప్పి కక్ష సాధిస్తున్నారని అమిత్ షా అన్నారు. చంద్రబాబు అరెస్ట్ వెనుక బీజేపీ లేదని అమిత్ షా స్పష్టంగా చెప్పారు. బీజేపీపై జగన్ నిందలు మోపుతున్నారని అమిత్ షా అన్నారు. బీజేపీనే చేయిస్తోందని ఒక ఎంపీ, మంత్రి నేరుగా అన్నట్లు చెప్పాను. చంద్రబాబు అరెస్ట్ వెనుక బీజేపీ పాత్ర ఉందని నేను అనుకోవట్లేదు. బీజేపీ నేతల మౌనంతో ఆరోపణలు వచ్చాయని అనుకుంటున్నా టీడీపీ ఎంపీలు ప్రధాని, హోంమంత్రికి లేఖలు రాశారు. రాష్ట్రం నుంచి అమిత్ షా సమాచారం తీసుకున్నట్లు తెలిసింది. క్షేత్రస్థాయిలో వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఉంది. అక్రమ కేసులపై వైసీపీ క్యాడర్‌లోనే అనుమానం ఉంది' అని లోకేష్ స్పష్టం చేశారు.


'10 రోజులుగా కేసు విషయంపై వైసీపీ మాట్లాడట్లేదు. స్కిల్ డెవలప్‌మెంట్‌ కేసు వెనుక ఏదో జరుగుతుంది. నా తల్లి ఐటీ రిటర్న్‌లు సీఐడీ చేతికి ఎలా వచ్చాయి? నా తల్లి ఐటీ రిటర్న్‌లపై సీబీడీటీకి ఫిర్యాదు చేస్తా. ఎన్డీయే, ఇండియా కూటములకు సమదూరంలోనే ఉన్నాం. దాదాపు అన్ని ప్రాంతీయ నేతలను కలిశా' అని లోకేష్ తెలిపారు. కాగా దాదాపు నెల రోజులుగా ఢిల్లీలోనే ఉన్న లోకేష్.. అమిత్ షాను కలిసేందుకు ప్రయత్నించారు. కానీ అపాయింట్‌మెంట్ దక్కలేదు. కానీ ఇప్పుడు అమిత్ షా పిలవడం ప్రాధాన్యతను సంతరించుకుంది.