Nara Lokesh : తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కడపకు చేరుకున్నారు. భారీ ర్యాలీ టీడీపీ కార్యకర్తలు ఆయనకు స్వాగతం పలికారు. అక్కడ లక్ష్మీ వెంకటేశ్వరస్వామి ఆలయం, పెద్ద దర్గా, మరియాపురం చర్చిలను దర్శించుకోనున్నారు. గురువారం తిరుమల శ్రీవారిని కుటుంబసభ్యులతో కలిసి దర్శించుకోనున్నారు. 27వ తేదీన కుప్పం నుంచి లోకేష్ యువగళం పాదయాత్ర ప్రారంభిస్తారు. లోకేష్ పర్యటనను విజయవంతం చేసేందుకు టీడీపీ శ్రేణులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.
ఉదయం ఇంటి నుంచి ఆయన బయలుదేరిన సమయంలో భావోద్వేగ సన్నివేశాలు కనిపించాయి. కుటుంబ సభ్యులతో కలిసి ఇంట్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మానాన్ననారా చంద్రబాబు నాయుడు, భువనేశ్వరి, అత్తమామలు నందమూరి బాలకృష్ణ, వసుంధర నుంచి ఆశీర్వాదం తీసుకున్నారు లోకేష్. నాలుగు వందల రోజుల పాటు ఇంటికి దూరంగా ఉంటూ పాదయాత్ర చేయనుండటంతో..కుటుంబసభ్యులందరూ వచ్చి ఆత్మీయ వీడ్కోలు పలికారు. ఆయన సతీమణి నారా బ్రాహ్మణి హారతి పట్టి, బొట్టు పెట్టి, విషెస్ చెప్పారు. అక్కడి నుంచి నుంచి లోకేష్ నేరుగా ఎన్టీఆర్ ఘాట్‌కు చేరుకుని ఎన్టీఆర్‌కు నివాళులర్పించారు. అటు నుంచి కడపకు బయలుదేరారు.
పాదయాత్రకు ముందు ఆయన రాష్ట్ర ప్రజలకు బహిరంగ లేఖ విడుదల చేశారు. తనను ఆశీర్వదించాలంటూ ప్రజలను కోరారు. రాష్ట్ర విభజన అనంతరం ఏర్పడిన తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం, ఇప్పుడున్న వైసీపీ ప్రభుత్వం పాలనను బేరీజు వేస్తూ.. అభివృద్ధి పనులు, పాలనా విధానాలను పేర్కొన్నారు. టీడీపీకి మరోసారి అధికారం ఇచ్చి.. రాష్ట్రాభివృద్ధికి సహకరించాలని కోరారు లోకేష్. అంతకు ముందు ప్రజలకు బహిరంగ లేఖ రాశారు
‘లోటు బడ్జెట్‌తో ఏర్పడిన రాష్ట్రాన్ని ఐదేళ్లలో తెలుగుదేశం ప్రభుత్వం గాడిలో పెట్టి, నవ్యాంధ్ర నిర్మాణానికి చాలా కృషి చేసింది. ఈ విషయం మీకు తెలిసిందే. జగన్ నేతృత్వంలోని ప్రభుత్వం సాగిస్తున్న విధ్వంసం మీరంతా చూస్తూనే ఉన్నారు. ప్రతివర్గం మాకొద్దీ అరాచకపాలన అంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొత్త పరిశ్రమలు ఎలాగూ రావడంలేదు. ఉన్నవీ తరిమేస్తున్నారు. కుల, మత, ప్రాంతాల పేరుతో విద్వేషాలు ఎగదోసి వికృత రాజకీయానికి తెరలేపారు. ఈ అరాచక పాలన పోవాలి. అందుకే మీ ముందుకు వస్తున్నాను. యువతకి భవితనవుతాను. అభివృద్ధికి వారధిగా నిలుస్తాను. రైతన్నని రాజుగా చూసేవరకూ విశ్రమించను. ఆడబిడ్డలకు సోదరుడిగా రక్షణ అవుతాను. మీరే ఒక దళమై, బలమై నా యువగళం పాదయాత్రని నడిపించండి. మీ అందరి కోసం వస్తున్న నన్ను ఆశీర్వదించండి.. ఆదరించండి.’ అంటూ ప్రజలను కోరారు నారా లోకేష్.