TS BC Bhavans :   తెలంగాణ ప్రభుత్వం నిర్మించాలనుకుంటున్న బీసీ ఆత్మగౌరవ భవన నిర్మాణాలకు ముహూర్తం ఖరారు అయినట్లుగా మంత్రి గంగుల కమలాకర్ ప్రకటించారు. 32 కుల సంఘాల భవనాల నిర్మాణం జరుగుతుంది. ఫిబ్రవరి ఐదున కోకా పేటలో  6న ఉప్పల్ భగాయత్లో సామూహిక భూమిపూజలు నిర్వహిస్తామని ప్రకటించారు.  దార్శనిక ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలో బీసీ ఆత్మగౌరవ ప్రతీకలుగా భవనాలు ఉంటాయని..  16 ప్రభుత్వ ఆధ్వర్యంలో, 18 బీసీ ఏక సంఘాల సారథ్యంలో నిర్మాణం జరుగుతాయని మంత్రి గంగుల కమలాకర్ ప్రకటించారు.  వేల కోట్ల విలువ గల 87.3 ఎకరాలు 41 బీసీ ఆత్మగౌరవ భవనాలకు కేటాయించామన్నారు.  మార్చి 31లోగా స్లాబుల నిర్మాణం పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. 


అన్ని రకాల సౌకర్యాలతో బీసీ ఆత్మ గౌరవ భవనాలు
  
 75 ఏళ్ల స్వతంత్ర్య భారత చరిత్రలో ఏ ప్రధాని, ఏ ముఖ్యమంత్రి చేయని విదంగా 41 బీసీ కులాల ఆత్మగౌరవం కోసం కేసీఆర్ అత్యంత విలువైన జాగలను హైదరాబాద్లో కేటాయించి వాటికి నిధులతో పాటు ఆయా కులాల ఆత్మగౌరవం ప్రతిభింబించేలా నిర్మించుకునే సువర్ణ అవకాశం సైతం ఆయా బీసీ కులసంఘాలకే కల్పించారని మంత్రి చెప్పారు.  దీన్ని సద్వినియోగం చేసుకుంటూ ఆర్డర్లు పొందిన ప్రతీ ఏక సంఘం మార్చి 31లోగా స్లాబులు పూర్తయ్యేలా నిర్మాణాలు ప్రారంబించాలన్నారు. ఇప్పటికే అనుమతి పత్రాలు పొందిన ఏ బీసీ కులమైన ఈ గడువులోగా ముందుకు రాకపోతే ప్రభుత్వమే నిర్మాణాలను చేపడుతుందన్నారు. మిగతా సంఘాలు సైతం అతిత్వరలో నిర్ణయం తీసుకోవాలని సూచించారు మంత్రి గంగుల కమలాకర్. ఎట్టిపరిస్థితుల్లోనూ అన్ని బీసీ ఆత్మగౌరవ భవనాలు దసరాకు ప్రారంభించే విదంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. 


కళ్యాణవేదికలు, సమావేశ మందిరాలు, విద్యార్థులకు హాస్టల్స్, రిక్రియేషన్ ఏర్పాట్లు


ఈ ఆత్మగౌరవ భవనాల్లో కళ్యాణవేదికలు, సమావేశ మందిరాలు, విద్యార్థులకు హాస్టల్లు, రిక్రియేషన్ తదితర అన్ని సధుపాయాలు ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు. కోకాపేట, ఉప్పల్ భగాయత్ తదితర బీసీ ఆత్మగౌరవ భవనాల ప్రాంగణాల్లో రోడ్లు, విద్యుత్, తాగునీరు, డ్రైనేజీ తదితర మౌళిక వసతులను సైతం ఈనెలాఖరులోగా పూర్తి చేస్తామని ఇందుకోసం బీసీ సంక్షేమ శాఖ ఉన్నతాధికారులతో పాటు, హెచ్ఎండీఏ, విద్యుత్, వాటర్ వర్క్స్, ఆర్ అండ్ బీ తదితర అన్ని శాఖల అధికారులను సమన్వయపరిచి నిర్ణిత కాలంలో పనులు పూర్తయ్యేలా అడ్ హాక్ కమిటీని తక్షణమే ఏర్పాటు చేయాలని ఆదేశించారు మంత్రి గంగుల.   


బీసీల ఆత్మగౌరవం ఇనుమడించేలా భవనాల నిర్మాణం ఉండాలన్న మంత్రి 


ఏక సంఘంగా ఏర్పడిన బీసీ కుల సంఘాలు నిర్మించుకునే భవనాలకు సైతం శాఖపరంగా అన్ని పనులు చూసుకునేందుకు లైజనింగ్ ఆఫీసర్లను సైతం నియమించామని వీరందరినీ సమన్వయపరిచే వేదికను సైతం ఏర్పాటు చేసామన్నారు మంత్రి గంగుల, నిర్మాణం కోసం ఎలాంటి ఇబ్బందులున్నా సంబందిత కులసంఘాలు నేరుగా తనను సంప్రదించవచ్చని సూచించారు  . ఎట్టిపరిస్థితుల్లోనూ ముఖ్యమంత్రి కలలు కన్న విదంగా బీసీల ఆత్మగౌరవం ఇనుమడించేలా బీసీ ఆత్మగౌరవ భవనాలను దసరా నాటికి ప్రారంభిస్తామన్నారు మంత్రి గంగుల కమలాకర్.