అమరావతి: రాజులు, రాజ్యాలు అంతరించిపోయి ప్రజాస్వామ్యం అమల్లోకి వచ్చాక సైతం ఆంధ్రప్రదేశ్ లో నియంత పాలన కొనసాగుతుందని నారా లోకేష్ అన్నారు. సుమారు అయిదేళ్ల క్రితం ఏపీ ప్రజలు పొరపాటున జగన్మోహన్ రెడ్డి అనే నయా నియంతకు అధికారమిచ్చారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (Nara lokesh) వ్యాఖ్యానించారు. సీఎం జగన్ అనాలోచిత, పిచ్చి నిర్ణయాలతో అన్నివర్గాల ప్రజలను అవస్థల పాలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. టీడీపీ, జనసేన అధికారంలోకి వచ్చాక అంగన్వాడీ (Anganwadis) చెల్లెమ్మల న్యాయపరమైన డిమాండ్లను పరిష్కరిస్తాం అన్నారు.
హామీలు నేరవేర్చాలని అడిగితే పట్టించుకోని జగన్!
ఎన్నికల సమయంలో తమకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలంటూ అంగన్వాడీలు 40రోజులుగా ఆందోళనలు చేస్తుంటే సీఎం జగన్ కనీసం స్పందించడం లేదన్నారు. పైగా విధుల్లోకి చేరకపోతే ఉద్యోగాలు పీకేస్తామని ప్రభుత్వ సలహాదారు సజ్జలతో బెదిరింపులకు దిగుతున్నాడని లోకేష్ ఆరోపించారు. ప్రభుత్వ అనాలోచిత, మొండివైఖరి కారణంగా ఇప్పటికే ఇద్దరు అంగన్వాడీ చెల్లెమ్మలు ప్రాణాలు కోల్పోయారని చెప్పారు. జగన్ అంగన్వాడీలపై ప్రయోగించిన ఎస్మా ఆయన పాలిట భస్మాసుర హస్తంగా మారబోతోందని వ్యాఖ్యానించారు.
ఎంతటి నియంత అయినా ప్రజాభీష్టానికి తలొగ్గక తప్పదన్న చారిత్రక సత్యాన్ని గుర్తించలేని జగన్... మరో 3నెలల్లోపే ఇంటికి వెళ్లడం ఖాయం అన్నారు. ఎన్ని ఇబ్బందులు పెట్టినా బెదిరిపోకుండా న్యాయమైన డిమాండ్ల సాధనకు 40రోజులుగా ఆందోళన చేస్తున్న అంగన్వాడీలకు టీడీపీ తరఫున సంపూర్ణ మద్దతు తెలిపారు. టిడిపి-జనసేన నేతృత్వంలో రాబోయే ప్రజాప్రభుత్వం అంగన్వాడీల న్యాయమైన డిమాండ్లను పరిష్కరిస్తుందని మాట ఇచ్చారు.
మంత్రి పెద్దిరెడ్డి కాన్వాయ్ అడ్డగించిన అంగన్వాడీలు
రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలు తమ సమస్యల పరిష్కారం కోసం నిరసన కొనసాగిస్తున్నారు. ప్రభుత్వం తమపై ఎస్మా ప్రయోగించినా పలు చోట్ల వెనక్కి తగ్గకుండా ఆందోళనకు దిగుతున్నారు. ఏపీ సీఎం వైఎస్ జగన్ ఈనెల 25న అనంతపురం జిల్లాలో పర్యటించనున్నారు. సీఎం జగన్ పర్యటన ఏర్పాట్లను పరిశీలించేందుకు జిల్లా ఇంఛార్జ్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వెళ్లగా.. ఉరవకొండ నియోజకవర్గంలో అంగన్వాడి వర్కర్లు ఒక్కసారిగా ఆయన వాహనాన్ని అడ్డుకున్నారు. తమకు న్యాయం చేయాలని, వెంటనే జీతాలు పెంచాలని మంత్రి పెద్దిరెడ్డిని డిమాండ్ చేశారు. మంత్రి కాన్వాయ్ ముందుకు కదలకుండా అడ్డుకుని, రహదారిపై బైటాయించి నిరసన వ్యక్తం చేశారు. దీంతో ఉరవకొండలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు అంగన్వాడీలను బలవంతంగా అక్కడినుంచి పక్కకు జరపడంతో మంత్రి పెద్దిరెడ్డి కాన్వాయ్ అక్కడి నుంచి వెళ్లిపోయింది. తమ సమస్యలు పరిష్కరించాలని నిరసనలు చేస్తున్న కూడా ప్రభుత్వం పట్టించుకోవడంలేదని అంగన్వాడీలు ఆవేదన వ్యక్తం చేశారు.