చంద్రబాబు అరెస్టు తర్వాత ఢిల్లీ వెళ్లి అక్కడ న్యాయ నిపుణులతో చర్చిస్తు్న్న ఆయన తనయుడు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మరికొన్ని రోజులు అక్కడే ఉండాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. నిజానికి ఈ రోజు సాయంత్రం రాజమండ్రికి తిరిగి రావాలని ముందుగానే లోకేష్ ప్రణాళికలో భాగంగా ఉంది. కానీ, నేడు (సెప్టెంబరు 22) ఏపీ హై కోర్టులో చంద్రబాబు క్వాష్ పిటిషన్ కొట్టివేయడంతో ప్రణాళిక మారినట్లుగా తెలుస్తోంది.


క్వాష్ పిటిషన్‌ని ఏపీ హైకోర్టు కొట్టేయడంతో సుప్రీం కోర్టులో న్యాయ పోరాటానికి సిద్ధం అయిన నేపథ్యంలో మరికొన్ని రోజులు ఢిల్లీలోనే ఉండాలని లోకేష్ నిర్ణయం తీసుకున్నట్లుగా సమాచారం. అందుకోసం ఎప్పటికప్పుడు లోకేష్ న్యాయనిపుణులతో సంప్రదింపులు చేస్తున్నారు. సుప్రీం కోర్టులో వేయాల్సిన పిటిషన్, తదితర అంశాలపై న్యాయవాదులతో లోకేష్ చర్చిస్తున్నారు.