Sidharth Luthra : " ప్రతి రాత్రి తర్వాత తెల్లవారుతుంది .. కొత్త రోజు వెలుగునిస్తుంది... రాత్రి తర్వాత మీ తెల్లవారుజాము .. ఉదయం మన జీవితాల్లో వెలుగునిస్తుంది..." అని సుప్రీంకోర్టు సీనియర్ లాయర్ సిద్ధార్థ లూధ్ర ట్వీట్ చేశారు. చంద్రబాబు తరపునన ఏసీబీ కోర్టుతో పాటు హైకోర్టులోనూ వాదిస్తున్నారు. క్వాష్ పిటిషన్ పై విచారణకు హరీష్ సాల్వే కూడా వచ్చారు. అయితే చంద్రబాబుకు ఊరట లభించకపోవడంతో సిద్ధార్థ లూధ్రా ఈ వ్యాఖ్యలు చేసినట్లుగా తెలుస్తోంది. క్వాష్ పిటిషన్ పై హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించే యోచనలో ఉన్నారు. అందుకే తదుపరి ప్రయత్నాల్లో న్యాయం లభిస్తుందని ఆయన ఈ వ్యాఖ్యలు చేసినట్లుగా భావిస్తున్నారు.
గతంలో అన్ని విధాలుగా ప్రయత్నించినప్పుడు ఇంకా న్యాయం కనుచూపు మేరలో లేదు అని తెలిసినప్పుడు...కత్తి తీసి పోరాటం చేయడమే సరైనది అని గురు గోవింద్ సింగ్ వ్యాఖ్యలను ట్విటర్లో షేర్ చేశారు. ఈ రోజు ఇదే మా నినాదం అని ఆయన పేర్కొన్నారు. సిద్ధార్థ లూధ్రా ట్వీట్‌పై పలువురు స్పందించారు. లాయర్‌కు కత్తి కంటే పెన్నే పవర్ ఫుల్ అని ఓ నెటిజన్ చెప్పడంతో .. లూధ్రా స్పందించారు. లాయర్‌కు కత్తి అంటే.. చట్టమేనన్నారు. లా అనే ఆయుధమే లాయర్‌కు ఉంటుందని వివరించారు. అయితే ఆయన హింసను ప్రేరేపిస్తున్నారని వైసీపీ నేతలు రాజమండ్రిలో పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసినట్లుగా ప్రచారం జరిగింది. కానీ అలాంటి కేసులు పెట్టలేదని పోలీసులు వివరణ ఇచ్చారు.
సుప్రీంకోర్టు సీనియర్ లాయర్ గా ఉన్న సిద్ధార్థ లూద్రా చంద్రబాబును అరెస్ట్ చేసిన రోజున ఢిల్లీ నుంచి విజయవాడ వచ్చారు. ఆ రోజు నుంచి ఆయన విజయవాడలోనే మకాం వేశారు. రిమాండ్ రిపోర్టు అంతా డొల్లేనని ప్రాథమిక ఆధారాలు కూడా లేవని.. చంద్రబాబును అరెస్ట్ చేయడం చట్ట సమ్మతం కాదని.. గవర్నర్ అనుమతి లేదని కూడా వాదించారు. అన్నీ తనకు అనుకూలంగా ాఉన్నాయనుకున్న లూధ్రా రిమాండ్ రిపోర్టు కొట్టి వేస్తారని అనుకున్నారు. అయితే అనూహ్యంగా కోర్టు రిమాండ్ విధించడంతో ఆయన విజయవాడలోనే ఉండిపోయారు. హౌస్ రిమాండ్ పిటిషన్ వేశారు. దానిపైనా సుదీర్ఘంగా వాదనలు జరిపినప్పటికీ సానుకూల ఫలితం రాలేదు. దాంతో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. తీరా విచారణలో ప్రభుత్వ లాయర్ .. కౌంటర్ దాఖలుకు సమయం కావాలని కోరడంతో కోర్టు వారం రోజులు సమయం ఇచ్చింది. వారం రోజుల తర్వాత విచారణ జరిగి.. తీర్పు మూడు రోజులు ఆలస్యమైనా ప్రయోజనం లేకపోయింది.
చంద్రబాబును వేధించడానికే కస్టడీకి అడుగుతున్నారని ఇవ్వొద్దని ఆయన ఏసీబీ కోర్టులో వాదించారు. అయినా ప్రయోజనం లేకపోయింది. ఈ క్రమంలో న్యాయపరంగా తీసుకోవాల్సిన తదుపరి కార్యాచరణపై సిద్ధార్థ లూధ్రా నారా లోకేష్‌తో చర్చించినట్లుగా తెలుస్తోంది.