Lokesh in Delhi : ఆంధ్రప్రదేశ్ లో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని .. ప్రతిపక్షాల్ని అణిచి వేస్తున్నారని రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఫిర్యాదు చేశారు. పార్టీ నేతలతో కలిసి రాష్ట్రపతి భవన్‌లో ద్రౌపది ముర్మును పార్టీ నేతలతో సహా కలిశారు. టీడీపీ అధినేత చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేశారని రాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్లారు. చంద్రబాబుపై కక్షగట్టిన ఏపీ సర్కార్ ఏ ఆధారాలు లేకుండా మాజీ సీఎంను అరెస్ట్ చేశారని స్కిల్ కేసు వివరాలు అదించారు. లోకేష్ తో పాటు ఎంపీలు కనకమేడల, కేశినేని నాని, గల్లా జయదేవ్, రామ్మోహన్ నాయుడు ఉన్నాయి. కక్ష సాధింపు లో భాగంగా అక్రమ కేసులు పెట్టి ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు ని అరెస్ట్ చేసిన తీరు గురించి రాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్లారు. ఎటువంటి ఆధారాలు లేకపోయినా కేవలం అవినీతి బురద చల్లే లక్ష్యంతో అరెస్ట్ చేశారు అంటూ తమ వద్ద ఉన్న సమాచారాన్ని, ఆధారాలను రాష్ట్రపతి కి అందించారు. ఆంధ్రప్రదేశ్ లో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని రాష్ట్రపతిని కోరారు.
అంతకు ముందు నారా లోకేష్ ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో తనను ఏ 14గా చేర్చడంపై సోషల్ మీడియాలో విమర్శలు గుప్పించారు. యువగళం పేరు వింటే సైకో జగన్ గజగజలాడుతున్నాడని.. ఏం చేసినా సరే యువగళం ఆగదని హెచ్చరించారు.
చంద్రబాబు అరెస్టు తర్వాత ఢిల్లీ వెళ్లిన లోకేష్ కేసు గురించి జాతీయ మీడియాలో తన వాదనలు వినిపించారు. ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల్లో.. ఎంపీల ద్వారా దేశం దృష్టికి తీసుకెళ్లారు. న్యాయ నిపుణులతో మాట్లాడుతున్నారు. ఢిల్లీకి వెళ్లి వాస్తవాలు చెబుతున్నారని.. దేశంలోని అన్ని రాజకీయ పార్టీలకు ఏపీలో జరుగుతున్న అంశాలను వివరిస్తున్నారని టీడీపీ నేతలంటున్నారు.
లోకేష్ ఈ వారాంతంలోగా యువగళం పాదయాత్ర ఎక్కడ ఆపారో అక్కడి నుంచే ప్రారంభించనున్నారు. కేసు విషయాలను చూసుకోవడానికి పూర్తిగా న్యాయకోవిదులతో పాటు పార్టీపరంగా ఓ టీమును ఏర్పాటు చేసి.. తన పాదయాత్రను మళ్లీ ప్రారంభించాలని నిర్ణయించారు. పార్టీ పరమైన వ్యవహారాలకు లోటు రాకుండా జాగ్రత్త పడాలనుకుటున్నారు. మరో వైపు జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ కూడా రంగంలోకి దిగుతున్నారు. ఆయన తన నాలుగో విడత వారాహి యాత్రను ఒకటో తేదీ నుంచి ప్రారంభించనున్నారు.