Nara Bhuvaneswari Responds On Minister Lokesh Gesture: ఏపీవ్యాప్తంగా 45 వేల పైచిలుకు స్కూళ్లలో ప్రభుత్వం శనివారం మెగా పేరెంట్స్ - టీచర్స్ మీటింగ్ ఘనంగా నిర్వహించింది. ఇందులో భాగంగా బాపట్ల మున్సిపల్ హైస్కూల్‌లో సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు ఆసక్తికర ఘటనలు చోటు చేసుకున్నాయి. పేరెంట్ - టీచర్ మీటింగ్‌లో పాల్గొన్న అనంతరం తండ్రీకొడుకులిద్దరూ విద్యార్థులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. అక్కడ విద్యార్థులతో ముచ్చటించారు. భోజనం పూర్తైన తర్వాత చంద్రబాబు తిన్న ప్లేట్‌ను మంత్రి లోకేశ్ తీసి అక్కడి సిబ్బందికి సహాయం చేశారు. ఇది అందరి దృష్టిని ఆకర్షించింది. దీనిపై తల్లి నారా భువనేశ్వరి స్పందిస్తూ కుమారుడిపై ప్రశంసలు కురిపించారు. దీనికి సంబంధించిన వీడియోను ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు.
'వెల్ డన్ నారా లోకేశ్.. చంద్రబాబు గారు తిన్న ప్లేట్ నువ్వు తీయడం, భోజనం అనంతరం శుభ్రం చేస్తోన్న సిబ్బందికి సాయపడడం.. తల్లిదండ్రుల పట్ల నీకున్న అత్యంత గౌరవాన్ని చాటి చెప్పడమే కాదు. నిత్యం మనకు సహాయకారిగా ఉండే వారి పట్ల నువ్వు ఎంతటి విధేయతను కలిగి ఉన్నావో ఈ చర్య ద్వారా స్పష్టమవుతోంది. నిజంగా ఇది స్ఫూర్తిదాయకం.' అంటూ కుమారున్ని ప్రశంసించారు.
మరిన్ని ఆసక్తికర ఘటనలు
అంతకుముందు స్కూల్ ఆవరణను సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఇండోర్ స్టేడియంలో సరదాగా తండ్రీకొడుకులు టగ్ ఆఫ్ వార్ గేమ్ ఆడారు. చంద్రబాబు వైపు ఎమ్మెల్యే నరేంద్ర వర్మ, అధికారులు ఉండగా.. లోకేశ్ వైపు ఎంపీ తెన్నేటి కృష్ణప్రసాద్, ఇతర అధికారులు ఉన్నారు. చివరకు సీఎం చంద్రబాబు జట్టు విజయం సాధించింది.
ప్రసంగం మధ్యలోనే ఆపేశారు
అనంతరం ఉపాధ్యాయులు, విద్యార్థులు, పేరెంట్స్‌తో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడారు. అనంతరం సీఎం చంద్రబాబు మాట్లాడుతుండగా స్థానికంగా నమాజ్ వినిపించింది. దీంతో కొద్దిసేపు తన ప్రసంగం ఆపేసిన ఆయన.. నమాజ్ పూర్తి కాగానే ప్రసంగం కొనసాగించారు. 'విద్యార్థులు స్మార్ట్ ఫోన్లకు బానిసలు కాకుండా చూసుకోవాలి. డ్రగ్స్ వ్యసనానికి విద్యార్థులు దూరంగా ఉండాలి. మానవ సంబంధాలను మాదక ద్రవ్యాలు నాశనం చేస్తాయి. రాష్ట్రంలో ఈగల్ పేరుతో డ్రగ్స్ నిరోధక వ్యవస్థను ఏర్పాటు చేశాం. ఈ రక్కసిని కర్కశంగా అణచివేస్తాం. డ్రగ్స్ వ్యతిరేక పోరాటం పాఠశాలల నుంచే ప్రారంభం కావాలి.' అని చంద్రబాబు పిలుపునిచ్చారు.