Tarakaratna : బెంగళూరు హృదయాలయ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నందమూరి తారకరత్నకో ఎక్మో చికిత్స అందిస్తున్నారన్న ప్రచారంలో నిజం లేదని నందమూరి రామకృష్ణ ప్రకటించారు. తారకరత్నకు ఎక్మో పరికరం అమర్చలేదు..ఎక్మో అమర్చారని జరుగుతున్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని ఆయన స్పష్టం చేశఆరు. బెంగుళూరు నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తారకరత్నను నందమూరి రామకృష్ణ పరామర్శించారు. తారకరత్న ఆరోగ్య పరిస్ధితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. తారకరత్న ఆరోగ్యం మెరుగుపడుతోందని, గుండె ఊపిరితిత్తులు కిడ్నీలు తదితర అవయవాలు సక్రమంగా పనిచేస్తున్నాయని వైద్యులు చెప్పారని రామకృష్ణ తెలిపారు.
తారకరత్న వైద్య పరీక్షల నివేదికలు ఆలస్యం
తారకరత్నకు సిటీ స్కాన్ తీశారని రిపోర్టు రావాల్సి ఉందన్నారు. లైఫ్ సపోర్ట్ పరికరాలు, అత్యవసర మందులు క్రమంగా తగ్గిస్తున్నారని తెలిపారు.. బ్రెయిన్ కు సంబంధించి కండిషన్ మెరుగుపడటానికి మరి కొంత సమయం పడుతుందని రామకృష్ణ తెలియజేశారు. నందమూరి తారకరత్న పూర్తి ఆరోగ్యంతో తిరిగి వస్తాడని భావిస్తున్నట్లు చెప్పారు.. పరీక్షలన్నీ పూర్తి చేశాక మెడికల్ రిపోర్ట్ విడుదల చేసే అవకాశం ఉందని మీడియాకు తెలిపారు. ఐసీయూలో న్యూరాలజిస్టుల పర్యవేక్షణ మధ్య తారకరత్న వైద్యం తీసుకుంటున్నారని ఆయన తెలిపారు. లెటెస్టుగా అన్ని పరీక్షల ఫలితాలు వచ్చిన తర్వాత తారకరత్న హెల్త్ బులెటిన్‌ను ఆస్పత్రి వర్గాలు విడుదల చేయనున్నాయి.
మెదడకు సరిగ్గా రక్త ప్రసరణ జరగకపోవడంతో సమస్య
లోకేష్ పాదయాత్రలో పాల్గొనడానికి వచ్చిన తారకరత్న 27వ తేదీన అకస్మాత్ గా కుప్పకూలిపోయారు. ఆయనను హుటాహుటిన సమీపంలోని ఆస్పత్రికి తీసుకెళ్లారు. అప్పటికే ఆయనకు పల్స్ ఆగిపోయింది. వైద్యులు అరగంట పాటు సీపీఆర్ చేయడంతో పల్స్ మెరుగుపడింది. ఆ తర్వాత వెంటనే పేస్ మెడికల్ కాలేజీ ఆస్పత్రికి తరలించారు. అక్కడ్నుంచి బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆస్పత్రికి తరలించారు. గుండెపోటు వచ్చిన తర్వాత 30 నిమిషాలపాటు రక్త ప్రసరణ జరకపోవడంతో మెదడు పనితీరుపై ప్రభావం పడినట్లు వైద్యులు భావిస్తున్నారు. ప్రస్తుతం ఇద్దరు న్యూరో సర్జన్లు సహా 10మంది వైద్యులు తారకరత్న ఆరోగ్యాన్ని నిత్యం పర్యవేక్షిస్తున్నారు.
తారకత్న ఎక్మోపై ఉన్న ప్రచారం అవాస్తవం
తారకరత్న ఎక్మోపై ఉన్నారని ఇప్పటి వరకూ ప్రచారం జరిగింది. ఎక్మోపై అంటే అత్యంత క్రిటికల్ స్టేజ్ అని కోలుకోవడం కష్టమని సోషల్ మీడియాలో విస్తృత చర్చలు జరిగాయి. అయితే అసలు తారకత్నకు ఎక్మో చికిత్స చేయలేదని.. వెంటిలేటర్ పై మాత్రమే ఉన్నారని.. రామకృష్ణ చెబుతున్నారు. తారకరత్న తాజా ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు పూర్తి స్థాయిలో బులెటిన్ విడుదల చేసిన తర్వాతే స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
తారకరత్న ను పరామర్శించేందుకు కుటుంబసభ్యులను మాత్రమే అనుమతిస్తున్నారు.. ఆస్పత్రి వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. కర్ణాటత ప్రభుత్వం కూడా తారకరత్న కు అవసరమైన వైద్య సాయంలో ప్రభుత్వం తరపున ఎటువంటి సాయం కావాలన్ని అందించడానికి సిద్ధంగా ఉన్నామని భరోసా ఇచ్చింది. ఆ రాష్ట్ర ఆరోగ్య మంత్రి తారకరత్నకు అందుతున్న చికిత్సపై ప్రత్యేక శ్రద్ద పెట్టారు. ఈ అంశంపై ఆయనకు నందమూరి కుటుంబసభ్యులు కృతజ్ఞతలు చెబుతున్నారు.