Hyderabad Traffic: హైదారాబాద్ లోని అంబర్‌ పేటలో ఫ్లై ఓవర్‌ నిర్మాణ పనుల నేపథ్యంలో గాంధీ విగ్రహం వద్ద నుంచి అంబర్‌పేట టీ జంక్షన్‌ వరకు 40 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నారు. ఈ నెల 30వ తేదీ నుంచి మార్చి 10వ తేదీ వరకు రోడ్డు మూసి వేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఆ రూట్‌లో వెళ్లే వాహనదారులు ప్రత్యామ్నాయ రూట్లలో వెళ్తూ, పోలీసులకు సహకరించాలని కోరారు. గాంధీ విగ్రహం నుంచి 6 నంబర్‌ బస్టాప్‌ వరకూ వెళ్లే మార్గంలో (ఒకవైపు) వాహనాలను అనుమతించకుండా ఆంక్షలు విధించినట్టు చెప్పారు. ఉప్పల్‌ వైపు నుంచి 6 నంబర్‌ బస్టాప్‌ మీదుగా చాదర్‌ఘాట్‌ వెళ్లే భారీ వాహనాలు, ఆర్టీసీ బస్సులు హబ్సిగూడ క్రాస్‌ రోడ్స్‌ నుంచి తార్నాక, ఉస్మానియా వర్సిటీ, అడిక్‌మెట్‌ ఫ్లై ఓవర్‌, విద్యా నగర్‌, ఫీవర్‌ దవాఖాన, బర్కత్‌ పురా, నింబోలి అడ్డా వైపు నకు వాహనాలను మళ్లించనున్నారు. ఇక ఇదే మార్గంలో వెళ్లే సిటీ బస్సులు, సాధారణ వాహనాలను గాంధీ విగ్రహం నుంచి ప్రేమ్‌ సదన్‌ బాయ్స్‌ హాస్టల్‌, సీపీఎల్‌ అంబర్‌ పేట్‌ గేట్‌, అలీఖేఫ్‌ క్రాస్‌ రోడ్స్,. 6 నంబర్‌ బస్టాప్‌, గోల్నాక, నింబోలి అడ్డా మీదుగా చాదర్‌ఘాట్‌ కు వెళ్లాల్సి ఉంటుంది. ఛే నంబర్‌ బస్టాప్‌ వైపు నుంచి ఉప్పల్‌ వైపు వెళ్లే అన్ని వాహనాలను అనుమతిస్తారు. హైదారాబాద్ ప్రజలు ఈ విషయాన్ని గుర్తించుకొని ప్రయాణం చేస్తే ఎలాంటి సమస్యా ఉండదు.


బేగంపేటలోని ఓ రోడ్డు కూడా ఫిబ్రవరి వరకు బంద్ 


బేగంపేట ప్రాంతంలో ఓ మార్గాన్ని మూడు నెలల పాటు అధికారులు మూసివేయనున్నారు. స్ట్రేటజిక్ నాలా డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ (ఎస్‌ఎన్‌డీపీ) కింద రసూల్‌పుర - రాంగోపాల్‌పేట పోలీస్ స్టేషన్ ల మధ్య అండర్ గ్రౌండ్ లోని నాలాను పునరుద్ధరించనున్నందున ఈ మార్గంలో ఇవాల్టి (నవంబరు 24) నుంచి మూడు నెలలపాటు ట్రాఫిక్‌ ను అనుమతించడం లేదు. దీనికి సంబంధించి హైదరాబాద్ పోలీసు కమిషనర్‌ సీవీ ఆనంద్‌ ఒక ప్రకటనలో వెల్లడించారు. నవంబరు 21వ తేదీ నుంచి వచ్చే ఏడాది ఫిబ్రవరి నెల వరకూ ఈ ట్రాఫిక్‌ ఆంక్షలు అమల్లో ఉంటాయని తెలిపారు.


ఈ మూడు నెలలూ వేరే రోడ్లకు ట్రాఫిక్ మళ్లింపు


బేగంపేట ఫ్లైఓవర్‌ నుంచి కిమ్స్‌ ఆసుపత్రి, మినిస్టర్‌ రోడ్‌, రాణిగంజ్‌, నల్లగుట్ట, వీపీఎన్‌ఆర్‌ మార్గ్‌ వైపు వెళ్లేందుకు రసూల్‌పుర టీ-జంక్షన్‌ వద్ద యూటర్న్‌ తీసుకునేందుకు అనుమతి ఇవ్వరు. కిమ్స్‌ ఆసుపత్రి, మినిస్టర్‌ రోడ్‌, రాణిగంజ్‌, నల్లగుట్ట వైపు రసూల్‌పుర నుంచి వెళ్లే వాహనాలు సీటీఓ ఫ్లైఓవర్‌ వరకు వెళ్లి యూటర్న్‌ తీసుకోవాలి. హనుమాన్‌ టెంపుల్‌ నుంచి ఫుడ్‌ వరల్డ్‌, సింధీ కాలనీ, రాంగోపాల్‌పేట ఠాణా, కిమ్స్‌ ఆసుపత్రుల వైపు వెళ్లొచ్చు. రాణిగంజ్‌, నల్లగుట్ట, పీవీఎన్‌ఆర్‌ మార్గ్‌ నుంచి వచ్చే వాహనాలను రసూల్‌పుర వైపు వెళ్లనివ్వరు. అటువైపుగా వచ్చే వాహనాలు రాంగోపాల్‌పేట పోలీస్ స్టేషన్, సింధి కాలనీ, ఫుడ్‌ వరల్డ్‌, హనుమాన్‌ ఆలయం మీదుగా వచ్చి లెఫ్ట్ తీసుకొని రసూల్‌పుర వైపు వెళ్లే వీలుంది.