Chandrababu Shares Secong Video Against YS Jagan Ruling: 
వైసీపీ హత్యా రాజకీయాలపై సీఎం జగన్‌ను నిలదీసిన చంద్రబాబు 
నాలుగేళ్ల నరకం క్యాంపెయిన్ లో భాగంగా రెండో వీడియో ట్వీట్


వైసీపీ పాలనలో అరాచకాలను ఎండగడుతూ తెలుగుదేశం పార్టీ చేపట్టిన 'నాలుగేళ్ల నరకం' క్యాంపెయిన్ రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతుంది. సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హత్యా రాజకీయాలు చేస్తున్నారంటూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ట్వీట్ చేశారు. రాష్ట్రాన్ని రావణకాష్టంలా మారుస్తున్నారని మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వంలో టీడీపీ కార్యకర్తల హత్యను ప్రస్తావిస్తూ సీఎం జగన్‌ను ట్విట్టర్ వేదికగా నిలదీశారు. 


ఆంధ్రప్రదేశ్‌లో కేవలం వారం రోజుల వ్యవధిలో జరిగిన నేరాలపై 'నాలుగేళ్ల నరకం' అంటూ కొద్ది రోజుల క్రితం చంద్రబాబు నాయుడు తొలి వీడియో విడుదల చేశారు. వైసీపీ ప్రభుత్వ ఆగడాలను ఎండగట్టారు. ఈ రోజు రెండో వీడియోను రిలీజ్ చేశారు. హత్యా రాజకీయాలపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ.. సీఎం జగన్ మోహన్ రెడ్డిని ట్విట్టర్ వేదికగా నిలదీశారు. 


"సీఎం జగన్ ఎంత సున్నితంగా మాట్లాడటానికి ప్రయత్నించినా, కరుణామయుడిలా మరెంత నటించినా లోపలున్న కూరమైన వ్యక్తిత్వం బయటపడుతూనే ఉంటుందంటూ చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. ఆ వ్యక్తిత్వమే తన అనుచరులకు మార్గదర్శకత్వం అవుతుంది. అదే రాష్ట్రాన్ని రావణకాష్టంలా మారుస్తుందని," చంద్రబాబు నాయుడు అన్నారు. 






మంగళగిరికి చెందిన ఉమా మహేశ్వర యాదవ్, పల్నాడులో చంద్రయ్య, జల్లయ్య, ప్రొద్దుటూరులో నందం సుబ్బయ్య, కర్నూలులో మంజుల సుబ్బరావు హత్యలను ప్రస్తావిస్తూ చంద్రబాబు నాయుడు  వీడియోను వీడియో పోస్ట్ చేసారు. వైసీపీకి బలైన ప్రాణాలు మరెన్నో అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ జగన్ అరాచక పాలనకు చరమగీతం పాడాల్సిన అవసరం ఉందని రాష్ట్ర ప్రజలకు పిలుపుచ్చారు.