CM Jagan Delhi Tour :  ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటన సుడిగాలి సమావేశాలతో ముగిసింది. ఉదయం బయలుదేరి ఢిల్లీ వచ్చిన ఆయన ముందుగా హోంమంత్రి అమిత్ షాతో 45 నిమిషాల సేపు సమావేశం అయ్యారు. తర్వాత ప్రధానమంత్రి నరేంద్రమోదీ  నివాసానికి వెళ్లారు.  దాదాపుగా గంట సేపు ప్రధాని మోదీతో చర్చలు జరిపారు. ఆ తర్వాత కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తో సమావేశం అయ్యారు. అక్కడ్నుంచి నేరుగా ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకుని తాడేపల్లి బయలుదేరారు. రోజులోనే కీలకమైన సమావేశాల్ని ముగించుకుని జగన్  ఢిల్లీ నుంచి బయలుదేరారు. అయితే ఏ ఏ అంశాలపై చర్చించారో స్పష్టత లేదు. 


రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ నిధులపై చర్చలు         


రాష్ట్రానికి సంబంధించినపలు అంశాలు పెండింగ్ లో ఉన్నాయని  వాటిని పరిష్కరించాలని కోరినట్లుగా తెలుస్తోంది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఇటీవల విదేశీ పర్యటనకు వెళ్లారు. ఆ పర్యటనలో అద్భుతమైన స్పందన వచ్చిందని అభినందనలు తెలిపినట్లుగా తెలుస్తోంది. సీఎం జగన్  వెంట  ఎంపీలు  విజయసాయి రెడ్డి, మిధున్ రెడ్డి,  సీఎస్ జవహర్ రెడ్డి,  ధనుంజయ్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి.. చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ చిదానందరెడ్డి... ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్ ఎస్ రావత్‌లు ఉన్నారు. ఆర్థిక శాఖ ఉన్నతాధికారి కూడా సీఎం జగన్ వెంట ఢిల్లీ రావడంతో  రాష్ట్రానికి రావాల్సిన నిధులు, అదనపు అప్పుల పరిమితి పెంపు వంటి అంశాలపై చర్చలు జరిపినట్లుగా భావిస్తున్నారు. 


ముందస్తు ఎన్నికలకు సహకరించాలని కోరారా ? 


సీఎం జగన్ ఢిల్లీ పర్యటనలో రాజకీయాలపైనా చర్చించారని రాజకీయవర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇటీవల ఓ  ఉత్తరాది హిందీ చానల్ లో వచ్చిన సర్వేల ఫలితాలతో.. ఇప్పటికిప్పుడు ఎన్నికలకు వెళ్తే వైఎస్ఆర్‌సీపీకి మంచి  అవకాశం ఉంటుందన్న అంచనాలతో.. ఐదు రాష్ట్రాల ఎన్నికలతో పాటు ఆరో రాష్ట్రంగా ఏపీ అసెంబ్లీకి కూడా ఎన్నికలు నిర్వహించేలా సహకరించాలని ఆయన బీజేపీ అగ్రనేతలను కోరినట్లుగా చెబుతున్నారు. వారి వైపు నుంచి సానుకూల స్పందన వస్తే.. తదుపరి క్యాబినెట్ భేటీలో ముందస్తు ఎన్నికలపై సీఎం జగన్ సంకేతాలు ఇవ్వవొచ్చని అనుకుంటున్నారు. 


ఐదు రాష్ట్రాలతో పాటు ఏపీకి ఎన్నికలు జరగాలని కోరుకుంటున్నారా?       


ఎన్నికల సన్నాహాలను ఇప్పటికే వైఎస్ఆర్‌సీపీ దాదాపుగా పూర్తి చేసింది. అభ్యర్థుల కసరత్తు కూడా పూర్తయిందని ఆ పార్టీ వరగాలు చెబుతున్నాయి. వైసీపీ క్యాడర్ మొత్తం చాలా కాలంగా ఇంటింటికి తిరుగుతున్నారు. సీఎం జగన్.. ప్రతి జిల్లాలోనూ సభలు పెడుతున్నారు. వారానికి రెండు, మూడు సభల్లో పాల్గొంటున్నారు.  జగనన్న సురక్షా కార్యక్రమం ద్వారా కొత్తగా పథకాలు అందని వారందరికీ పథకాలు మంజూరు చేయబోతున్నారు. ఇప్పటికే ప్రజా సమస్యల పరిష్కారనికి అనేక ప్రయత్నాలు చేశారు. పార్లమెంట్  ఎన్నికలతో పాటు వెళ్తే తమ సంక్షేమ పథకాలు ఓటింగ్ ఎజెండా కాకుండా పోతాయన్న ఆందోళనతో.. ప్రత్యేకంగా అసెంబ్లీకి మాత్రమే ఎన్నికలు జరగాలని కోరుకుంటున్నట్లుగా భావిస్తున్నారు.